సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -904
"నిరీక్షితే కేలివనం ప్రవిశ్య,క్రమేలకః కంటకజాలమేవ"న్యాయము
*****
నిరీక్షితే అనగా ఎదురు చూడ బడినది,నిరీక్షింపబడినది.కేలి అనగా ఆట, వినోదం,క్రీడ వనం అనగా అడవి, తోట. కేలి వనం అనగా ఆనందంగా ఆడుకునే ప్రదేశం, వినోదానికి ఏర్పాటు చేయబడిన తోట, ఉద్యానవనం.ప్రవిశ్య అనగా ప్రవేశించడం, లోపలికి వెళ్ళడం.క్రమేలకః అనగా  ఒంటె,ఉష్ట్రం,లొట్టిపిట్ట.కంటకం అనగా ముల్లు.కంటక జాల మేవ అనగా పుష్కలంగా లేదా ఎక్కువగా ముళ్ళతో కూడి వున్న సమూహము అని అర్థము.
ఒంటె ఉద్యానవనంలోనికి పోయి, ముండ్ల చెట్లను వెతుక్కొంటుంది.అనగా ఎంత అందమైన ప్రదేశంలోకి వెళ్ళినా రసజ్ఞత లేని,ఆస్వాదించడం రాని వ్యక్తి తన దృష్టిని పనికిరాని వాటివైపే సారిస్తాడు అని అర్థము.
దీనికి సంబంధించి  ప్రజాకవి వేమన రాసిన ఈ పద్యాలను చూద్దామా!
"ఓగునోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని/భావమిచ్చి మెచ్చు బరమలుబ్దున్/బంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా?/విశ్వదాభిరామ వినురవేమ!"
మూర్ఖుడిని మూర్ఖుడే మెచ్చుకుంటాడు.అజ్ఞానియైన వాడు లోభి వానినే మెచ్చుకుంటాడు. అలాగే పంది బురదనే కోరుకుంటుంది కానీ పన్నీరును కోరుకోదు.మనం ప్రస్తుతం చెప్పుకుంటున్న న్యాయములో ఒంటె మూర్ఖుడికి ప్రతీక. కాబట్టే  పూలతోటకు వెళ్ళి కూడా అక్కడ  పూల అందాలను వదిలేసి  ముళ్ళకోసం వెతుక్కోవడం మనం గమనించవచ్చు.
అలాగే మరో పద్యాన్ని చూద్దాం."కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి/ ఎట్టివారు మెత్తు రట్టివాని/ మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా?/విశ్వదాభిరామ వినురవేమ!"
అనగా ఒక చెడ్డవాడు ,ఒక మంచివాడు ఇరువురూ ఉన్నప్పుడు వారిలో మంచివాడు మంచివాడిని ఎంచుకుంటే చెడ్డవాడు చెడ్డవాడినే ఎంచుకుంటాడు.మంచివాడిని వదిలేస్తాడు.అంటే ఎటువంటి వారు అటువంటి వారినే ఇష్టపడతారు.వారినే మెచ్చుకుంటారు.ఇది ఎట్లానో  చెబుతూ చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది కాని, అదనంగా జ్ఞానాన్ని ప్రసాదించలేదు కదా! అంటాడు వేమన.
"నిరీక్షితే కేలివనం ప్రవిశ్య,క్రమేలకః కంటకజాలమేవ" న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే   ఒంటె లాంటి వారు మన చుట్టూ ఉన్న సమాజంలో కొందరు కనిపిస్తూ ఉంటారు.అలాంటి వారు మంచిని వదిలేసి చెడునే అధికంగా ఇష్టపడుతారు.ఒక మహాకవి అన్నట్లు ఇద్దరు వ్యక్తులకు కిటికీ లోంచి బయటకు చూస్తే ఒకరికి అందమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తే, మరొకరికి మురికి గుంట,చెత్త కనిపించాయట. అంటే ఎవరి బుద్ధిని బట్టి వారికి ప్రకృతి కాని, సమాజం కానీ, మనుషులు కానీ కనిపిస్తారు."తన కంపు తనకింపు" అన్నట్లుగా ఎవరి స్వభావం తీరుగా వారు ప్రవర్తిస్తారు. చెప్పు తినే కుక్క  చెరకులోని తీపిని , మాధుర్యాన్ని గ్రహించలేదు.గ్రహించడానికి ఇష్టపడదు అనేది ఈ న్యాయము ద్వారా మనం గ్రహించవచ్చు.

కామెంట్‌లు