చిన్నపాపాయి కాలి కదలికలకు
వినపడే మువ్వల అలికిడిలా
చిన్ని గువ్వల కువకువల సడికి
కనులు తెరచే నిఖిల జగతి
కన్నయ్య మురళీ నాదానికి
మురిసి పరుగులు తీసే గోపమ్మల
పరవశం లాగా...పొడిచిన బాలుని
చూసి మధురలా మారిన మేదిని
యమునంటి చిక్కని చీకటి
భానుని రాకను చూసి
తాను తొలగి దారి ఇవ్వగా
పరచుకున్న పసిడి వెలుగు
రహదారి ముస్తాబు కోసం
రంగవల్లులను రచిస్తూ
నింగిని వర్ణమయం చేసి ప్రభువు
రాక కోసం వేచిన పర్జన్యాలు
క్షణక్షణము ఎదుగుతూ
చురుకుగా సాగుతూ గగనాన
విహరించు తరుణాన తొంగి
తన రూపు సవరించుకునే తరణి
అలవాటుగా ఆగమించినా
అద్భుతంగా తోచు రవి రాక!
అస్వాదించు అంతరంగాలకు
అపురూపమే అరుణోదయం
ఆనందమే ఆదిత్యునికి అంజలిగా
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి