న్యాయాలు-905
"పాత్రా పాత్ర విచారస్తు ధేను పన్నగయో రివ" న్యాయము
*****
పాత్రాపాత్ర అనగా యోగ్యుడు,అయోగ్యుడు, అర్హుడు,అనర్హుడు.విచారించు అనగా ఆలోచించు, విచారించు.ధేను అనగా ఆవు.పన్నగం అనగా పాము,భుజంగం,ఫణి.ఆరివ అనగా తెలివైన, జ్ఞానం కలవాడు అనే అర్థాలు ఉన్నాయి.
ఆవు గడ్డి తిని పాలను ఇస్తుంది.పాము పాలు తాగి విషమం గ్రక్కుతుంది.అందుచేత పాత్రాపాత్ర విచారము చేయక దానము చేస్తే ఒకప్పుడు విషమిస్తుంది.
ఈ న్యాయము యొక్క పూర్తి శ్లోకాన్ని చూద్దామా!
"పాత్రా పాత్ర వివేకోస్తి ధేను పన్నగయో రివ/తృణాత్సంజాయతే క్షీరత్సంజాయతే విషం!"
అనగా మనం ఇతరులకు సహాయం చేసేటప్పుడు పాత్రత అనగా అర్హత కలిగి వున్న వారికే చేయాలి.అపాత్రా దానం చేయకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు. దీనికి చక్కని ఉదాహరణగా అర్హత కలిగిన వాడిని అనగా పాత్రత కలిగిన వాడిని ఆవుతోనూ,అర్హత లేని వాడిని పాముతోనూ పోలుస్తాడు.అది ఎందుకో చెబుతూ ఆవు గడ్డి తిని పాలు ఇస్తుంది.అదే పామైతే పాలు తాగి విషం కక్కుతుంది.అనగా అర్హుడైన వాడికి చిన్న దానం లేదా సహాయం చేసినా దానిని జీవితాంతం మరిచి పోకుండా పాలలాంటి మనసును తిరిగి ఇస్తాడు.ఇక అపాత్రా దానంగా ఎంత పెద్ద సహాయం చేసినా ఒక పట్టాన తృప్తి పొందడు సరికదా తిరిగి విషం గక్కుతాడు అని అర్థము.
దీనినే ఓ సినీ గేయ కవి "అందమైన లోకమని - రంగు రంగులు ఉంటాయని అందరూ అంటుంటారు చెల్లెమ్మా " అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా - గడ్డి మేసి ఆవు పాలిస్తుంది - పాలు తాగి మనిషి విషమవుతాడు.అనే పాట ద్వారా నేటి సమాజంలో కొందరు వ్యక్తులు ఎలా ఉంటారో తెలియజేశారు.
ఈ న్యాయమునకు సంబంధించిన సందర్భం పోతన రాసిన భాగవతంలో వామన రూపంలో వచ్చిన శ్రీమహావిష్ణువు గురించి శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని హెచ్చరించినపుడు బలి చక్రవర్తి ఒక మాట అంటాడు. పాత్రత కలిగిన వాడు దొరకడం నా అదృష్టం. రైతుకు సారవంతమైన పంటపొలం, మంచి విత్తనాలు,తగిన నీటి వసతి సౌకర్యాలు ఎలా కలిగి ఉండాలో దాతకు అలాంటి అర్హుడైన గ్రహీత దొరకాలి అప్పుడే ప్రతిఫలం గొప్పగా ఉంటుంది అంటాడు.దీనిని మనం కూడా ఖచ్చితంగా ఆమోదించాలి.
అనగా దాత గ్రహీత ఇద్దరూ యోగ్యులై ఉండాలి. అప్పుడే దానానికి విలువ వుంటుంది.
ఒక వేళ ఇద్దరూ అయోగ్యులైతే ఇచ్చే దానం యొక్క గొప్పతనం పోతుంది.దానం చేసిన వ్యక్తి తానేమో చాలా పెద్ద దానం కొండంత ఇచ్చానని మురిసి పోతే, తీసుకున్న వాడు తనకు ఎంత పెద్ద సహాయం చేసినా గోరంతగా భావిస్తాడు.కాబట్టి ఇచ్చే వాడు,పుచ్చుకునే వాడు ఇద్దరూ పాత్రత కలిగి వుండాలి.
అసలే ఇది కలియుగము. "ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్లు" ఉంటారు కొందరు.ఇలాంటి వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.కొందరు దానం తీసుకునే వారు ఇచ్చిన దానానికి సంతృప్తి పడరు. దీనికి సంబంధించి మన పల్లె వాసులు కొన్ని సామెతలతో పోల్చడం గమనించ వచ్చు. అవే " పాపం పాపం అని పచ్చి పులుసు పోస్తే కారమైందని కచ్చీరు గోడ ఎక్కిందని" , "పాపమని పాత వస్త్రం ఇస్తే గోడ వెనక్కి వెళ్ళి మూరేసుకున్నాడని" లాంటి సామెతలు ఇలాంటి వారిని ఉద్దేశించి కనిపెట్టినవే.
గ్రహీతలు విపరీతమైన ఆశతో ఉంటారు. తమకు తృప్తిగా అనిపించక పోతే ఇచ్చిన వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టడానికి కూడా వెనుకాడని వారు కొందరు ఉంటారు. కాబట్టి అలాంటి మనస్తత్వం కలిగిన వారిని తెలుసుకోవాలంటే మంచి చెడుల విచక్షణ తెలిసి వుండాలి.తీసుకునే వారి పూర్వాపరాలు తెలిసి ఉంటే పాత్రా పాత్ర విచక్షణ శక్తి కలుగుతుంది. మనం చేసే సహాయానికి సార్థకత చేకూరుతుంది.
ఈ "పాత్రా పాత్ర విచారస్తు ధేను పన్నగయో రివ న్యాయము" ద్వారా మనం పాత్రా పాత్ర అంటే ఏమిటో తెలుసుకోగలిగాము. దానం చేసే ముందు ఏవేవి గమనించాలో ఈ న్యాయము ద్వారా స్పష్టమైంది. ఆవు లాంటి వారికి దానం చేయాలి కానీ పాము లాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని తెలుసుకోగలిగాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి