చంద్రునికో నూలుపొగు!:- ఓగిరాల గాయత్రి.- విజయవాడ.
 ఆకాశవీధిలో,
అందాల తిలకమై —
చుక్కలన్నీ రెక్కలై విచ్చుకున్న
పారిజాతమా...
తుషారశీతల సరోవరంలో,
కలువ భామల కోసమై
నిరీక్షిస్తూ —
సుధవోలే విలాసమా?

---
రేరాణులు విరిసే వేళ,
శుక్లపక్షపు వెన్నెలతో విహరించే చంద్రుడు ఉన్నప్పుడు —
"ఈ కృత్రిమ వెలుగులు నాకేలు?" అనుకుంటూ,
చందమామతో మనిషి అల్లుకున్న అనుబంధంపై
కాలిడి, ఎగురవేసిన ధ్వజం!

---
జాబిలి చుట్టూ ఎన్నెన్ని ఊహల లలలుకున్నా,
మనసునందు వేదనల వెల్లువై —
తనతో పంచుకుంటూ
“కలంకారి”ని జత చేసేది కవిహృదయమే!

---
“చంద్రునికో నూలుపొగు” అనుకుంటూ,
సహస్ర పూర్ణోదయాల వేడుక జరుపుకుంటూ —
“అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన” అన్నా,
నెలవంక రాకతో రంజాన్ అయినా,
లూనార్ కాలాన్ని అనుసరించే చైనా అయినా —
నిలిపే కదా ప్రాంతాలకు, మతాలకతీతమైన సుహృద్భావాన్ని!

---
చల్లని వెన్నెల మనసున కొలువై,
సమున్నతంగా ప్రకాశిస్తే —
జీవితం లోనూ వెన్నెలలు కురవవా?
అప్పుడు
“జీవితమే చందమామ అవునేమో!” కదూ..!!!

కామెంట్‌లు