సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-909
స్వజాతి ర్దురతిక్రమా న్యాయము
*****
స్వజాతి అనగా తన జాతికి చెందిన,స్వంత జాతి.దురతిక్రమా అతిక్రమించడానికి లేదా దాటడానికి వీలు లేనిది లేదా వీలు పడనిది అని అర్థం.
ఎవరూ తన జాతిని విడిచి పెట్టలేరు. జాతి అనేది ప్రత్యేకమైన,గుర్తించ దగిన లక్షణాలు కలిగిన  సమూహము.అలాంటి తమ జాతి లక్షణాలను వీడలేరు, వాటిని మార్చుకోవడం కష్టం అని అంటారు.అదెలాగో మన పెద్దవాళ్ళు చెప్పిన ఆసక్తికరమైన కథను చూద్దాం.
 ఒకానొక మునీశ్వరుడు, అతని భార్య ఒక ఊరికి దగ్గరలో వున్న ఆశ్రమంలో నివసించే వారు. వారికి సంతానం లేదు. ఒకరోజు మునీశ్వరుడు అర్ఘ్యమిస్తూ ఉండగా దోసిట్లో ఆకాశంలో కాకి ఎత్తుకొని పోతున్న ఎలుక పిల్ల పడుతుంది. అప్పుడు అతని భార్య చూసి "మీకు అనేక శక్తులు ఉన్నాయి కదా! ఈ ఎలుక పిల్లను అమ్మాయిగా మార్చండి మనం పెంచుకుందాం" అంటుంది. అప్పుడా ముని ఆ ఎలుక పిల్లను అమ్మాయిగా మారుస్తాడు.
ఆ అమ్మాయికి మూషిక బాల అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచుకో సాగారు.ఎదిగే క్రమంలో ఎప్పుడూ కలుగుల వద్ద ధాన్యం నిలువ చేసిన దగ్గర తిరుగుతూ ఉండటం వారికి ఆశ్చర్యంగా ఉండేది.  ఒకసారి వాళ్ళ ఊరిలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. అన్ని రోజులు గణేష్ మందిరాన్ని వదలకుండా అక్కడే ఉంటానని పేచీ పెడుతుంది. తల్లిదండ్రులు ఆ అమ్మాయి భక్తికి ముచ్చట పడుతూ ఎంతో బుజ్జగించి ఇంటికి తీసుకుని వచ్చేవారు.
బడి ఈడు వచ్చిన తర్వాత ఆ ఊరి బడిలో వేస్తారు.ఎక్కడా కుదురు లేకుండా తిరిగే మూషిక బాల తోటి పిల్లల పుస్తకాలు, సంచులను పళ్ళతో కటకటా కటకటా కొరికేది.చదువులో చురుగ్గా ఉండే ఆ అమ్మాయిని మందలించి వదిలేసే వారు.
 ఒకసారి ఆ అమ్మాయి చదివే పాఠశాల విద్యార్థులను క్షేత్ర పర్యటనలో భాగంగా అటవీ ప్రాంతానికి తీసుకుని వెళతారు. అనుకోకుండా ఓ విద్యార్థిని వేటగాళ్ళు జంతువుల కోసం వేసిన వలలో పడుతుంది.అప్పుడు మూషిక బాల తన పదునైన దంతాలతో వలను కొరికి ఆ విద్యార్థినిని కాపాడుతుంది.అప్పటి నుండి తోటి విద్యార్థులు మూషిక బాలతో  స్నేహం  చేయడానికి ఇష్టపడతారు.
చదువు పూర్తయిన తర్వాత  వివాహం చేయాలని సంకల్పించి సూర్యుడిని వరుడిగా ఎంపిక చేయబోతే అతడి  కిరణాల వేడికి తట్టుకోలేను వద్దు అంటుంది. సూర్యుని కంటే మేఘుడు గొప్పవాడు కదా! అనుకుని అతనికి ఇచ్చి వివాహం చేద్దామని అనుకుంటే అతడు చాలా నల్లగా ఉన్నాడు వద్దు అంటుంది.ఇక వాయు దేవుడిని నిలకడ లేని వాడనీ,పర్వత రాజును కఠినమైన వాడనీ వద్దు అంటుంది. చివరికి  మూషిక రాజును తీసుకుని వస్తే అతడు తనకు నచ్చాడనీ అతడినే పెళ్ళాడుతాను అంటుంది. అప్పుడా మునీశ్వర దంపతులు మూషిక రాజుకు ఇచ్చి వివాహం చేసి పంపుతారు.
మునీశ్వరుడు తన భార్యతో" ఎవరూ తమ జాతి లక్షణాలు వదులు కోలేరు. చూశావా  మనం ఎంతో గొప్ప సంబంధాలు తెచ్చాం.కానీ మన మూషిక బాల తన జాతి వాడినే ఇష్టపడింది " అంటాడు.
అలాగే డార్విన్ తన సిద్ధాంతం ప్రకారం మానవ జాతి పరిణామ క్రమంలో  కోతి నుంచి వచ్చిందని చెబుతాడు.
ఇక  రామాయణంలో  కల్పిత కథ ఒకటి ఉంది. అదే రాముడు, హనుమంతుడి మధ్య వివాదం వస్తుంది అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని నీ జాతి లక్షణాలు ఎలా పోతాయి. చూపించావు కదా,! అంటాడు.
ఇలా ఈ ప్రపంచంలో ఒక్కో జాతికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.అవి మానసిక, శారీరక, సామాజిక, సాంస్కృతిక లక్షణాలు.వారసత్వంగా వచ్చే ఈ లక్షణాలను మార్చడం అంత సులభం కాదు అనేది ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకో గలిగాము.
మరి మనం మన మానవ జాతికి ఉన్న మానవీయ విలువలు, లక్షణాలను వీడకుండా జీవితాన్ని గడుపుదాం.

కామెంట్‌లు