కరోలిన్ హెర్షెల్:- - యామిజాల జగదీశ్
 అంచనాలను అధిగమించిన కరోలిన్ హెర్షెల్!
జర్మనీలోని హనోవర్‌లో 1750లో జన్మించిన కరోలిన్ హెర్షెల్ ఎప్పుడూ శాస్త్రవేత్త కావాలని అనుకోలేదు. లేదా ప్రపంచమూ ఆమె గురించి అలా అనుకోలేదు. 
బాల్యంలో అనారోగ్యానికి గురైన తమ కుమార్తె ఇంటి పనులకు తప్ప మరి దేనికీ పనికిరాదని ఆమె కన్న తల్లి భావించింది. అయితే అనూహ్యంగా కరోలిన్ భవిష్యత్తు మరోలా మారింది. ఆమె నక్షత్రాలపై దృష్టి సారించింది.
ఆమె సోదరుడు విలియం హెర్షెల్‌ కోసం 1772లో ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడు, కరోలిన్ అతనికి కేవలం సహాయకురాలిగా మాత్రమే మారింది. ఆమె రాత్రి వేళల్లో ఆకాశంతో ప్రేమలో పడింది. అవిశ్రాంత అంకితభావంతో ఆకాశాన్ని అధ్యయనం చేయసాగింది. 
1786 ఆగస్టు 1న, ఆమె తన మొదటి తోకచుక్కను స్వతంత్రంగా కనుగొంది. తరువాతి దశాబ్దంలో, ఆమె మరో ఏడింటిని కనుగొంది.
అలాగే ఆమె చేసిన రచనలూ విప్లవాత్మకమైనవి. 
1787లో, కింగ్ జార్జ్ III ఆమెకు 50 పౌండ్ల వార్షిక జీతం మంజూరు చేసారు. 
దీంతో కరోలిన్ చరిత్రలో శాస్త్రీయ పనికి జీతం అందుకున్న మొదటి మహిళగా నిలిచింది. అయితే ఇది కేవలం జీతం మాత్రమే కాదు, ఇది ఒక విప్లవం అని అందరూ భావించారు.
వందలాది నక్షత్రాలు, నీహారిక (nebulae)లతో ఓ పట్టిక తయారు చేసింది.  ఆమె 14 కొత్త నీహారికలను కనుగొంది.
1828లో, ఆమె రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ నుంచి ప్రతిష్ఠాత్మక బంగారు పతకాన్ని అందుకుంది. ఓ మహిళగా ఆమెకిది అరుదైన గౌరవం. ఆమె చాలా మంది కంటే ప్రకాశవంతమైన మహిళగా చరిత్రపుటలకెక్కింది.

కామెంట్‌లు