చదువుసంధ్యలు:- - యామిజాల జగదీశ్
 మా ఇంటికి ఓ ఆరు వీధులవతల ఓ స్కూలు ఉంది. పేరు జేవియర్ స్కూలు. వేసవి సెలవుల తర్వాత ఈరోజు (జూన్ 12) స్కూలు తెరిచారు. దాంతో రోడ్డు పొడవునా పిల్లలు. వారి తల్లిదండ్రులు. పిల్లలను దిగ పెట్టడానికి వాహనాలు. కొందరు పిల్లలు హుషారుగా. కొందరు పిల్లలు ఒకింత డల్లుగా, కొందరేమో నిరాశతో ఏడుస్తూ స్కూల్లోకి వెళ్ళబోమని మొండికేయడం, వాళ్ళకు నచ్చ చెప్పి స్కూలు వాకిట్లో నిల్చున్న ఆయాకో టీచరుకో అప్పగించడం, పిల్లలు చేసేదేమీలేక దీనంగా మొహం పెట్టుకుని వెళ్ళడం, తల్లిదండ్రులు ఆఖరి నిముషంలోనైనా తమను ఇంటికి తీసుకు వెళ్తారేమోనని పెద్దగా ఏడవటం...బలే ఉంటాయి ఈ సన్నివేశాలు. 
ఇన్ని రకాల పిల్లలను చూస్తుంటే నాకు నేను చదువుకున్న రోజులు గుర్తుకొచ్చాయి.‌ సెలవులు తర్వాత నేనెలా వెళ్ళేవాడినో గుర్తుకు రావడం లేదు కానీ వెళ్ళడమైతే వెళ్ళేవాడిని.‌ పైకి ఏడుపు రానీయక తెచ్చి పెట్టుకున్న కృత్రిమ హుషారుతో  వెళ్ళే ఉంటాను. ఎందుకంటే నాకు స్కూలు ఫైనల్ వరకూ స్కూలంటే ఏమిటో అర్థమయ్యేది కాదు కానీ సరిగ్గా రాయకుంటే మార్కులు తక్కువ వస్తాయని, ముప్పైయి అయిదు మార్కులకన్నా తక్కువ వస్తే  ఫెయిలవుతాననే విషయం మాత్రం తెలిసింది. 
నాకున్న సబ్జెక్టులలో లెక్కలు, ఇంగ్లీషు, సైన్సు, హిస్టరీ ఎప్పుడూ ఆందోళన కలిగించేవే. ఇంగ్లీషంటే చచ్చేంత భయం. అందుకే డిగ్రీ ప్యాసై యాభై ఏళ్ళయినా ఈరోజు వరకూ నాలుగు వాక్యాలు వ్యాకరణ దోషాలు లేకుండా రాయలేను.‌ ఇంగ్లీషులో మాట్లాడాల్సి వస్తే అక్కడి నుంచి మెల్లగా జారుకోవాలనుకునే వాడిని. ఇంగ్లీషు అక్షరాలు వచ్చు. వాటిని గుర్తు పట్టి నాకు తెలిసిన విధంగా పలకడం వచ్చు కానీ ఇంగ్లీషంటే హడలే. లెక్కల్లో అయితే ఎంచక్కా గుండు సున్నా తెచ్చుకున్న రోజులున్నాయి.‌ చరిత్ర సబ్జెక్టులోనైతే రాజుల జనన, మరణ తేదీలతో తంటాలన్నీ ఇన్నీ కావు. సైన్సులో ఫార్ములాలేమిటో బోధపడేవి కావు. 
నా అకడమిక్ కెరీర్లో నేను ఇష్టపడిన క్లాసు డ్రాయింగ్ క్లాసు ఒక్కటే. ఆపైన తెలుగు సబ్జెక్ట్ ఓ మోస్తరు. అందుకే స్కూల్లోకి వెళ్ళేటప్పుడల్లా ఏ టీచరుని చూసినా భయమే‌. ఇక కాలేజీలో చదువు గురించైతే విడిగా చెప్పక్కర్లేదు. అందుకే నేను థర్డ్ క్లాసులో డిగ్రీ ప్యాసవడం నావరకైతే ఓ అద్భుతమే. అలాగే మిడిమిడి జ్ఞానంతో ముప్పై ఏళ్ళకు పైగా ఎలా మీడియాలో కొనసాగి రిటైరయ్యానో ఇప్పటికీ అర్థం కావడం లేదు.
నాకిప్పటికీ వ్యాకరణం రాదు. పెద్ద పెద్ద పదప్రయోగాలు తెలియవు. కొందరి రచనలు చదువుతుంటే నేనేమీ రాని వాడిననే నిజం మరొక్కసారి తెలిసొస్తుంది. భావాడంబరమైతే శూన్యం. 
అయినా తెలుగు అక్షరాలు అఆలు పలకమీద రాయించిన అమ్మకు హృదయపూర్వక పాదాభివందనం. అందుకేనేమో ఇప్పటికీ అ అంటే అమ్మ అనే మాటంటే ప్రేమ. అభిమానం. గౌరవం. అణకువ. ఇంకా ఎన్నెన్ని భావాలో...!!

కామెంట్‌లు