అద్భుతం లింకన్ మెమోరియల్:- -ఎస్.వి.రమణా చార్య,జర్నలిస్ట్

 యువతకు స్ఫూర్తి
నేతలకు ఆదర్శ మూర్తి
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ లోని లింకన్ మెమోరియల్ చూడతగ్గ ప్రదేశం.నిత్యం వేలాది మంది సందర్శకులు ఇక్కడకు వస్తుంటారు.లింకన్ మెమోరియల్ ఓ అద్భుత కట్టడమే కాదు.ప్రజాస్వామ్య సమానత్వం,మానవ హక్కులసాధనకు ప్రతీకగా నిలచిన ఓ అఖండ చిహ్నం.అమెరికా దేశానికి 16వ ఆదక్షుడిగా ఆయన సేవలు అందించారు.
   1809 ఫిబ్రవరి 12న కెంటకీ రాష్ట్రంలో ఓ పేద కుటుంబంలో లింకన్ జన్మించారు.స్వయం కృషితో చదువుకుంటూ న్యాయవాద వృత్తిని చేపట్టారు.తన అరుదైన వాక్చాతుర్యంతో తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందారు.ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించి ఐలినాయిస్ రాష్ట్ర ప్రతినిధిగా,ఆ తరువాత దేశ అధ్యక్షుడిగా పదవి చేపట్టారు.
   అమెరికాలో జరిగిన సివిల్ వార్ సమయంలో దేశం విచ్ఛిన్నం కాకుండా లింకన్ ఆమోఘంగా శ్రమించారు.ఆయన నాయకత్వం వల్లే యూనియన్ విజయం సాధించింది.అమెరికా ఏకత్వంతో నిలబడింది.
  150 సంవత్సరాల క్రితం జీవించిన అబ్రహం లింకన్ ఆశలు,ఆశయాలు,మాటలు ఇప్పటి తరానికి ఓ మార్గదర్శకంగా ఉన్నాయి.
‘ప్రజల పాలన ,ప్రజలచే పాలన,ప్రజల కొరకు పాలన’ అని గేట్స్ బర్గ్ లో ఆయన చేసిన ప్రసంగంలోని మాటలు ప్రజాస్వామ్యానికి నిర్వచనంగా మారాయి.
   ఈ రోజుల్లో యువతకు లింకన్ జీవితం,ధైర్యం, పట్టుదల, సమానత్వం పట్ల నమ్మకానికి ఆదర్శంగా నిలుస్తుంది. పట్టుదల ఉంటే సామాన్యుడి నుంచి అతి పెద్ద నాయకునిగా ఎదగ వచ్చు అని చెప్పడానికి లింకన్ జీవిత చరిత్ర మనకు తెలియ చేస్తున్నది.పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆత్మవిశ్వాసంతో మనల్ని మనం మల్చుకొని గొప్పగా ఎదగ వచ్చు అని నిరూపిస్తోంది.
  ప్రస్తుతం ప్రపంచం మళ్లీ ఓ సంక్షోభ సమయంలో ఉంది.జాతుల మధ్య విద్వేషం,ధ్రువీకరణ రాజకీయాలు,హక్కుల హననం అధిక మవుతున్నాయి.ఈ సందర్భంలో లింకన్ మెమోరియల్ లోకి ఓ సారి వెళ్లి గమనిస్తే..ఆ విగ్రహాన్ని చూసి..ఆ గోడలపై చెక్కిన ప్రసంగాలను చదువు తున్నప్పుడు మనిషి మనుగడ పై ఆలోచనల ప్రవాహం అలా తొణికిసలాడు తుంది.నిజంగా మనం సమానత్వాన్ని పాటిస్తున్నామా?ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటున్నామా?అనే ఆలోచనలో మునిగి తేలుతాం. నాయకత్వం మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. సమానత్వం నినాదాలో కాదు నడవడికలో ఉండాలి అన్నట్లుగా ఉంటుంది.
  ప్రజలకోసం న్యాయంగా నిలచిన నాయకులు ఎప్పటికీ ప్రజల మనస్సుల్లో నిలిచిపోతారని లింకన్ మెమోరియల్ చూశాక నాకు తెలిసింది.లింకన్ కు ఇప్పటికీ ఎప్పటికీ ప్రజలు నీరాజనం పలుకుతూనే ఉంటారు.
  ఇలాంటి స్థలాలు కేవలం ఇసుకలో గడ్డ కట్టిన స్మారక చిహ్నాలు కావు…అవి మనుషుల మదిలో నిలిచిన దీపపు స్తంభాలు

కామెంట్‌లు