ఒకూర్లో రామయ్యని ఒడుండేటోడు. వానికో రోజు ఈ లోకంలో అందరికన్నా ఎవరు గొప్ప అని ఒక అనుమానమొచ్చింది. అనుమానమొచ్చినాక తీర్చుకోవాల గదా... దాంతో ఎట్లా తెలుసుకోవాలబ్బా అని కనపన్న ప్రతొక్కరినీ అడగడం మొదలు పెట్టినాడు. కానీ ఎవరినడిగినా '' నాకు తెలీదంటే... నాకు తెలీదు'' అనేటోళ్ళే గానీ సమాధానం చెప్పేటోళ్ళు కరువయినారు.
ఒకరోజు వాళ్ళూరికి ఒక సాధువు వచ్చినాడు. రామయ్య వురుక్కుంటా ఆ సాధువు కాడికి పోయి ''సామీ... సామీ... ఈ లోకంలో అందరికన్నా గొప్పెవరూ'' అని అడిగినాడు. దానికా సాధువు చిరునవ్వు నవ్వి జోలెలోంచి ఒక చిన్న దేముని విగ్రహం తీసి రామయ్యకిచ్చి ''చూడు రామయ్యా... ఈ లోకంలో దేముని కంటే గొప్పోడు ఎవడూ లేడు... తీస్కోని పోయి ఈ బొమ్మకు పూజ చేసుకోపో'' అన్నాడు.
రామయ్య అప్పటినుండీ రోజూ దేముని బొమ్మకు పూజ చేసి, ప్రసాదం పెట్టి ఆ తర్వాత తాను తినేటోడు. ఒక రోజు ఎప్పటిలాగే ప్రసాదం పెట్టి వెనక్కు తిరగ్గానే దభీమని చప్పుడొచ్చింది. ''ఏమైందబ్బా'' అని తిరిగి చూస్తే ఇంకేముంది... ఒక ఎలుక దేముని బొమ్మను కింద పడేసి ప్రసాదం తింటా వుంది. అది చూసిన రామయ్య ''అరెరే... ఇన్ని రోజులూ దేముడే గొప్పోడనుకోని అనవసరంగా పూజ చేస్తి. కానీ ఆ దేముడేం గొప్పోడు. ఆ దేమున్నే కింద పడేసిన ఈ ఎలుకనే నిజంగా గొప్పది'' అనుకోని ఆ రోజు నుండీ ఎలుకకు పూజ చేస్తా ప్రసాదం పెట్టడం మొదలుపెట్టినాడు.
ఒకరోజు ఎలుకకు ప్రసాదం పెట్టి పూజ చేస్తా వుంటే ఆ ఎలుకను చూసిన ఒక పిల్లి ''అబ్బ... ఎన్నాళ్ళకు దొరికిందిది'' అనుకుంటా దాన్ని పట్టుకోని గుటుక్కుమనిపిద్దామని ఒక్క దుంకు దుంకింది. అంతే... పిల్లిని చూసిన ఎలుక అదిరిపడి కీసుకీసుమనుకుంటా దానికి దొరక్కుండా సర్రున పారిపోయింది. అది చూసిన రామయ్య '' అరెరే... ఇన్ని రోజులూ ఎలుకే గొప్పదనుకోని అనవసరంగా పూజ చేస్తి... కానీ ఈ ఎలుకేం గొప్పది... దీన్ని వురికిచ్చిన పిల్లే నిజంగా గొప్పది'' అనుకోని ఆ రోజు నుండీ పిల్లికి పూజ చేస్తా ప్రసాదం పెట్టడం మొదలు పెట్టినాడు.
ఒకరోజు పిల్లి ప్రసాదం తింటా వుంటే యాన్నించొచ్చిందో ఒక కుక్క వచ్చి ''అబ్బ... ఎన్నాళ్ళకు కనబడిందిది'' అనుకుంటా దాన్ని పట్టుకోడానికి ఒక్క దుంకు దుంకింది. అంతే... పిల్లి అదిరిపడి దానికి దొరక్కుండా 'మ్యావ్ మ్యావ్' అనుకుంటా సర్రున పారిపోయింది. అది చూసిన రామయ్య ''అరెరే... ఇన్ని రోజులూ పిల్లే గొప్పదనుకోని అనవసరంగా పూజ చేస్తి... కానీ ఈ పిల్లేం గొప్పది... దీన్ని వురికిచ్చిన కుక్కే నిజంగా గొప్పది'' అనుకోని ఆ రోజు నుండీ కుక్కకు పూజ చేస్తా ప్రసాదం పెట్టడం మొదలుపెట్టినాడు.
ఆ కుక్క రోజూ ప్రసాదం మెక్కీ మెక్కీ బాగా కొవ్వు పట్టింది. ఒకరోజు రామయ్యకు జ్వరమొచ్చి మంచమ్మీద నుండి లేవలేక పోయినాడు. కుక్కకు రోజూ పొద్దున్నే తినడం అలవాటయింది గదా... అందుకని ''ఇదేందబ్బా నాకింకా ప్రసాదం పెట్టలేదు'' అనుకుంటా ఇంట్లోకొచ్చి పొయ్యి మీదున్న అన్నం కుండలన్నీ కింద పడేసి నాకడం మొదలు పెట్టింది.
అప్పుడే లోపలికొచ్చిన రామయ్య పెండ్లాం పగిలిపోయిన కుండల్ని, కుక్కను చూసి ''ఓసి దొంగదానా... అన్నం కుండలన్నీ పగలగొడ్తావా'' అని మూలనున్న పొరక తీసుకోని దాన్ని కిందామీదా ఏసి కొట్టింది. ఆ దెబ్బలకది కుయ్యికుయ్యిమని అరుస్తా పారిపోయింది. అది చూసిన రామయ్య ''అరెరే... ఇన్ని రోజులూ కుక్కే గొప్పదనుకోని అనవసరంగా పూజ చేస్తి... కానీ ఆ కుక్కేం గొప్పది... దాన్నే కిందా మీదా ఏసి కొట్టిన నా పెండ్లామే నిజంగా గొప్పది'' అనుకోని ఆ రోజు నుండీ పెండ్లానికి పూజ చేస్తా ప్రసాదం పెట్టడం మొదలు పెట్టినాడు.
అది చూసి ఆమె '' అబ్బ... నేనెంత అదృష్టవంతురాలిని... నా మొగుడు నన్నెంత బాగా చూసుకుంటా వున్నాడు'' అని మురిసిపోయింది. ఒకరోజు ఆమె కూర చేస్తా... చేస్తా మర్చిపోయి రెండుసార్లు కారమేసింది. రామయ్య నోట్లో ముద్ద పెట్టుకోడం ఆలస్యం నోరంతా సుర్రుమనింది. దాంతో వానికి పెండ్లామ్మీద చానా కోపమొచ్చి '' ఓసి దొంగదానా... కూరలో ఇంతనా కారమేసేది'' అని జుట్టు పట్టుకోని దభీదభీమని నాలుగు గుద్దులు గుద్దినాడు. ఆమె భయంతో వణికిపోతా తప్పయిపోయిందని వాని కాళ్ళు పట్టుకోనింది.
అంతలో వాడు ''అరెరే... ఇన్నాళ్ళూ... నా పెండ్లామే గొప్పదనుకోని అనవసరంగా పూజ చేస్తి... కానీ నా పెండ్లానిదేం గొప్ప... నన్ను చూసి భయంతో గజగజా వణికిపోతా వుంది. అంటే నేనే అందరికన్నా గొప్పన్నమాట'' అనుకోని ఆ రోజు నుండీ వాడు వేరే వాళ్ళకు పూజ చేయడం మానేసి తనకు తానే చేసుకోవడం మొదలుపెట్టినాడు.
***********
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి