మరవకు మానవుడా, ఏనాడూ నీ తల్లిదండ్రులను":- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ)- సారవకోట- 9490904976
జాతీయ తల్లిదండ్రులు దినోత్సవం సందర్భంగా
====================================
తల్లిదండ్రులు దైవ స్వరూపాలు.
మాతృ దేవో భవ 
పితృ దేవో భవ
చెప్పిందేనాడో వేదం..
వారికి తెప్పించకు నిర్వేదం.

వారి కంట కన్నీరు ఏనాడూ రానీకు..
కన్నవారిని కన్నుల్లో పెట్టుకొని చూసుకో..
కలత, నలత రానివ్వకు,
బిడ్డలపై వారికెంతో వ్యాకులత.

అడ్డాల బిడ్డైనా, గడ్డాల నాడైనా
అల్లరి చేసినా, చిల్లరగా తిరిగినా
గారాం చేసినా, మారాం చేసినా
కోపగించక, శాపగించక
బిడ్డల బాగుకోరేది నీ తల్లిదండ్రులు..

"తల్లి" నవమాసాలు మోసి,
తాపసపడి, ఆపసోపాలు పడి
జన్మనిచ్చి, స్తన్యమిచ్చిన తల్లికి
ఏమిచ్చి రుణం తీర్చగలవు.
పొత్తిళ్ళలో నిన్ను పెట్టుకుని
ఒత్తిళ్ళను ఎదుర్కొని నిన్నెత్తుకుంది.

తండ్రి నీ జీవన కారకుడు..
నిన్ను, నీ కుటుంబానికి పోషకుడు.
నీ వెన్నంటే ఉండి నిన్ను నడిపించేది నాన్న.
నీకన్నీ సమకూర్చేది నాన్న
బడి, గుడి, మడి
అన్నింటికీ తీసుకువెళ్లేది నాన్న.

ఒరవడి రాయించేది నాన్న.
నీ నడవడి చూసేది నాన్న.
తడబడితే సరిచేసేది నాన్న.
తప్పులు చేస్తే నిన్ను
ఖండించేది, దండించేది నాన్న.
దిద్దెంచేది, సరిదిద్దేది నాన్న.

అమ్మ బిడ్డగా అందరుంటారు.
నాన్నను ఎడం పెట్టకు.
నీ కుడి భుజం నాన్న.
నాన్న నీ దన్ను, నీ వెన్ను..

అమ్మ కన్ను, నాన్న చూపు.
నీకు సరైన దారి చూపు.
నాన్న అడ్డు కాదు,
నావను నడిపించే నావికుడు
ఒడ్డుకు తెచ్చే తెడ్డులాంటోడు.
దర్శకుడు, మార్గదర్శకుడు "నాన్న".

అమ్మ నాన్నల ఆశలు
ఆవిరి కానివ్వకు.
వారి ఆశయాలు నెరవేర్చు.

పైసలు కోసం, పదవుల కోసం, ప్రఖ్యాతి కోసం పరుగులిడి,
వారిని వదిలేయడం మంచిది కాదు.

పట్టణాలకు, పైదేశాలకు పోయిన
ఫోన్ లో ప్రతీరోజూ వారిని పలకరించు.
పండగలకు, పబ్బాలకు, 
పలుసార్లు వస్తూ,పోతుండు.
నిన్ను కన్నవారున్నారని,
పెద్దలున్నారని గుర్తుంచుకో.

ఆరోగ్యం బాలేక ఆసుపత్రుల్లో
అవస్థలు పడుతున్నపుడు..
వారిని అందరూ ఉన్నా అనాథలు చేయకు.

వెంటనే వచ్చి వారి సేవలు చేయు.
మాతా పితా సేవయే మాధవసేవ.

నీ చిన్నప్పుడు ఆలనా పాలనా చూసి,
నీకన్నీ పెట్టిన అమ్మానాన్నలను కాపాడుకోవడం నీ బాధ్యత.
ఆపేక్షగా చూడడం, ఆనందంగా ఉంచడం నీ ధర్మం.
 
డబ్బే లోకం కాదు..
డబ్బు ఎప్పుడైనా ఎలాగైనా సంపాదించవచ్చు.
పెద్దలు పరమపదించాక మరిరారు.
మరవకు మానవుడా, ఏనాడూ నీ తల్లిదండ్రులను..


కామెంట్‌లు