మార్క్ ట్వైన్ పిల్లి ప్రేమికుడు:- - యామిజాల జగదీశ్
 మార్క్ ట్వైన్ అని పిలువబడే శామ్యూల్ లాంగ్‌హోర్న్ క్లెమెన్స్ ఒక  రచయిత మాత్రమే కాదు, పిల్లి ప్రేమికుడు కూడా. 
ట్వైన్‌కు, పెంపుడు జంతువులలో పిల్లి అంటే ఎక్కువ ఇష్టం. వాటి తెలివితేటలు, ప్రవర్తన ఆయనను కట్టిపడేసేవి.
ఆయన జీవితాంతం, పిల్లులను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. వాటి పట్ల తనకున్న అభిమానాన్ని సన్నిహితులకు రాసే ఉత్తరాలలో ప్రస్తావించే వారు. అలాగే తన రచనలలోనూ వాటి గురించి రాసేవారు.
జంతువులను విస్మరించిన కాలంలో, ట్వైన్ వాటి పట్ల కరుణ చూపేవారు. తరచుగా ఆయన ఒడిలో పిల్లితో కనిపించేవారు.‌వాటికి పేర్లు పెట్టేవారు. ఆయా పేర్లతోనే వాటిని పిలిచేవారు.
ఆయన అత్యంత ప్రసిద్ధ కథలలో ఒకటి కుమార్తె క్లారాకు చెందిన బాంబినో అనే నల్ల పిల్లి గురించి.  బాంబినో తప్పిపోయినప్పుడు, ట్వైన్ న్యూయార్క్ అమెరికన్ పత్రికలో ఒక హృదయపూర్వక ప్రకటన ఇచ్చారు. దానినెవరైనా కనిపెట్టి ఇస్తే తగిన రీతిలో బహుమతి ఇస్తానంటూ ఆ ప్రకటనలో తెలిపారు మార్క్ ట్వైన్. పిల్లి గురించి సున్నితమైన వివరాలను ఇచ్చారు.
“పెద్ద పిల్లి. నల్లరంగులో ఉంటుంది. మందపాటి, వెల్వెట్ బొచ్చు. ఛాతీపై ఒక తెల్లటి మచ్చ. సహజ కాంతిలో గుర్తించడం కష్టం.” అని ఆ పిల్లి గురించి చెప్పారు.
ఆ ప్రకటన చూసిన వారిలో కొందరు "ఇదిగో మీ బాంబినో కావచ్చు" అంటూ ట్వైన్ ఇంటికి వచ్చారు‌. కానీ అవేవీ తన బాంబినో కాదన్నారు. తీరా కొన్ని రోజులకే ఆయనెంతో ప్రేమగా చూసుకున్న నిజమైన బాంబినో స్వయంగా ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడీ విషయమై ఆయన ఓ కథ రాశారు. పిల్లులు సహజంగా తప్పిపోయినా లేదా తీసుకెళ్ళి ఎక్కడైనా విడిచిపెట్టినా అవి తిరిగి సొంత ఇంటికి వచ్చెస్తాయి. వాటి స్వభావమది.
ట్వైన్ ఒకసారి ఇలా రాశారు...
“నేను పిల్లిని ఎదిరించలేను. ముఖ్యంగా పుర్రుమని పిలుచుకునే పిల్లి. మీరు ప్రేమించే అమ్మాయిని పక్కన పెడితే, అవి నాకు తెలిసిన అత్యంత శుభ్రమైన, తెలివైన జీవి.
పిల్లులను ప్రేమించే వారెవరైనా ఆయనకు సన్నిహితులైపోతారు. వారు కలుసుకున్నప్పుడు మాటలూ పిల్లి గురించే ఉంటాయి.
జంతు దయ రక్షకుడిగా ఆయన వారసత్వం ఈ రోజు వరకు కొనసాగుతోంది. కొన్నిసార్లు తెలివైన హృదయానికి మాట్లాడటానికి పదాలు అవసరం లేదని మనకు గుర్తుచేస్తుంది. 

కామెంట్‌లు