"జైహింద్" అనే నినాదం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంత గానో ఉత్తేజపరిచింది. ఈ నినాదాన్ని మొదటగా నినదించిన వ్యక్తి మేజర్ అబిద్ హసన్ సఫ్రాని.
నేతాజీ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీలో సభ్యుడు. భారత దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆయన భారత రాయబారిగా పని చేశారు.
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో జర్మనీలో విద్యార్థిగా ఉన్న అబిద్ హసన్, అక్కడి భారతీయ ఖైదీలను ఉద్దేశించి నేతాజీ చేసిన ప్రసంగానికి ముగ్ధుడయ్యారు. ఆయన నేతాజీని కలిసి ఇండియన్ ఫ్రీడమ్ బ్రిగేడ్‌లో చేరారు. బోస్ జర్మనీ నుండి మద్దతు సేకరిస్తున్నప్పుడు ఆయన బోస్ వ్యక్తిగత కార్యదర్శిగా, అనువాదకుడిగా పని చేశారు.
1943లో జర్మనీ నుండి ఆగ్నేయాసియా పర్యటనలో ఆయన బోస్‌తో కలిసి వెళ్లారు. ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీలో వివిధ సంస్కరణలను ప్రవేశపెట్టారు.
ఆగ్నేయాసియాలో నేతాజీ తన ప్రచారాలలో కూడా ఆయనతో పాటు వెళ్లారు.
అబిద్ హసన్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగారు.
ఐఎన్ఎ సైనికులు ఒకరినొకరు కలిసినప్పుడు, వారు తమ మతం, జాతి ఆధారంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. సైనికులు కలిసి నిలబడి ఐక్య భారతదేశం కోసం పోరాడటానికి ఒక సాధారణ పదాన్ని సృష్టించడానికి, ధైర్యవంతుడైన సెన్బగ రామన్ పిళ్లై భారత జాతీయ సైన్యం తాను రూపొందించిన జై హింద్ అనే పదబంధాన్ని ఉపయోగించాలని సూచించాడు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో భారతదేశానికి వచ్చిన తర్వాత, ఆయన 1946లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు.
విభజన తర్వాత, హసన్ హైదరాబాద్‌లో స్థిరపడాలని ఎంచుకుని భారత విదేశాంగ సేవలో చేరారు. ఈజిప్టు, డెన్మార్క్‌తో సహా అనేక దేశాలకు ఆయన భారత రాయబారిగా పనిచేశారు. ఈయన గురించి, ఈయన నినాదం జైహింద్ గురించి మొదటగా విన్నది ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణగారి రేడియో ప్రసంగం ద్వారానే.
హైదరాబాద్ నగరంలో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అబిద్ తల్లి ఫక్రున్నీసా బేగం. ఆమె సరోజినీ నాయుడు సాంగత్యంలో దేశభక్తిని పెంపొందించుకున్నారు. ఉద్యమాల్లో పాల్గొన్నారు. విదేశ వస్త్రాలను పరశురామ ప్రీతి చేసిన హైదరాబాద్ మొదటి మహిళగా నాయకుల, ప్రజల గౌరవం ఆమె పొందగలిగారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, ఆజాద్ మొదలైన అగ్రనాయకులు ఆమెను 'అమ్మా జాన్' అని పిలిచేవారు. ఆమె ముగ్గురు కుమారులూ ఉన్నత విద్యావంతులే. దేశభక్తులే. నగరంలోని మతశక్తుల నుండి తప్పించుకోవడంలో వారెన్నో ప్రమాదకర సంఘటనలకు గురయ్యారు. సోదరులలో జ్యేష్టుడైన బద్రుల్ హసన్ 1925 సంవత్సరంలో గాంధీజీ నడిపిన 'యంగ్ ఇండియా' పత్రికను ఎడిట్ చేశారు.
అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో అబిద్ హసన్ చదువుకున్నారు. అనంతరం
కేంబ్రిడ్జ్ సీనియరు పరీక్షలో ఉత్తీర్ణుడైన అబిద్ హసన్ 1931లో సబర్మతి ఆశ్రమం చేరుకొని దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. సఫ్రాని అప్పటి స్వాతంత్ర్యోద్యమ విషయాలపై మాట్లాడుతూ 'హిందువులకే గాంధీజీ ఆశ్రమం అంకితం కారాదు. సర్వమత సమన్యాయ ప్రార్థనలుండాలి' అని సూచించారు. ఆ తరువాతే ప్రార్థనలలో మార్పు వచ్చింది.
అబిద్ హసన్ జైలు నుంచి విడుదల కాగానే జర్మనీ వెళ్లి ఇంజనీరింగ్ చదువుకున్నారు. విద్య సమాప్తమవుతున్న దశలో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమయింది. అక్కడే పరిచయమైన మేజర్ స్వామితో అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అబిద్ హసన్ జర్మనీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్, అరబిక్, సంస్కృతం, పర్షియన్, హిందీ, ఉర్దూ, తెలుగులలో నిష్ణాతులు.
ఈ అమరవీరుడు అబిద్ హసన్ 1911 జూన్ 11న జన్మించారు. 1984 ఏప్రిల్ 5న తుదిశ్వాస విడిచారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి