సునంద భాష్యం: - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-914
"ముఖే ముఖే సరస్వతీ   "న్యాయము
*****
ముఖే అనగా ముఖము, మొగము.ముఖే ముఖే అనగా ప్రతి ఒక్కరి ముఖములోనూ, మాటలోనూ,ప్రతి ఒక్కరి నోటిలోనూ.సరస్వతి అనగా  జ్ఞానం,విద్య, కళలు, సంగీతానికి అధినేత.భారతి,శారద,వాగీశ్వరి,విద్యా దేవి,వాణి మొదలైన అర్థాలు ఉన్నాయి.
ముఖే ముఖే సరస్వతీ అనగా ప్రతి ఒక్కరి నోటిలోనూ,ప్రతి ఒక్కరి మాటలోను , ప్రతి వారి ముఖమునందు సరస్వతీదేవి ఉందనీ,అందరూ బాగా మాటలు చెప్పగలరు అని  మరో అర్థం.
అనగా ఈ "ముఖే ముఖే సరస్వతీ న్యాయము" ప్రకారం వాగ్దేవి లేదా  సరస్వతి ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఉంటుందని మన పెద్దవాళ్ళు అంటుంటారు.అది మాట్లాడే కళ కావచ్చు. సృజనాత్మకత శక్తి కావచ్చు, మరింకేదైనా ప్రతిభ  కావచ్చు.
 మరి ఈ న్యాయం గురించి చెప్పుకునే ముందు సరస్వతి దేవి గురించి కొన్ని విషయాలు విశేషాలు తెలుసుకుందాం.బ్రహ్మ యొక్క భార్య సరస్వతి దేవి. ఆమె బ్రహ్మ యొక్క ముఖము నందు ఉంటుంది.
 శబ్ద వ్యుత్పత్తి శాస్త్రం ప్రకారం సంస్కృతంలో సరస్ అనగా నీటిని కూడబెట్టడం , వాక్కు అని అంటారు. సరస్వతి అనే పదం ఋగ్వేదంలో ఒక నదిని సూచించే దేవతగా చెబుతారు. ఆ తర్వాత వేదాలలో శుద్ధి చేసేది, శుద్ధి చేసే జ్ఞానంగా చెప్పబడింది.అంతే కాదు నదులను అడ్డుకునే కరువుకు కారణమైన పాము లాంటి రాక్షసి మరియు అడ్డంకులు తొలగించేదిగా కూడా ముడిపడి ఉంది.యజుర్వేదం ఆమెను తల్లిగా చూస్తుంది.ఇక తైత్తిరీయ బ్రాహ్మణంలో  సరస్వతిని అనుకూలమైన వాక్చాతుర్యానికి మరియు శ్రావ్యమైన సంగీతానికి తల్లి అని అంటారు.
ఇక మహాభారతంలో ఆమె ఒక దేవతగా మానవీకరించబడిన రూపంగా సంతరించుకున్నది.ఇతిహాసాలలో సరస్వతి దేవి  దివ్య సౌందర్యం మరియు యోగ్యత కలిగిన స్త్రీ గా కనిపిస్తుంది.రామాయణంలో కూడా సరస్వతీ దేవి ప్రస్తావన ఉంది. రావణాసురుడి సోదరుడు కుంభకర్ణుడు  బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తూ ఘోరమైన వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు దేవతలంతా భయపడి ఆ వరాన్ని ఇవ్వొద్దని వేడుకుంటారు. అడిగిన తర్వాత ఇవ్వక తప్పదు కాబట్టి అడిగేటప్పుడు బ్రహ్మ సరస్వతి దేవి సహాయాన్ని కోరుకుంటాడు.
కుంభకర్ణుడు వరాన్ని కోరుకునే ముందు సరస్వతి మాత అతని నాలుక మీద చేరి "నిర్ధయ" అనడానికి బదులుగా "’నిద్రయ అనేలా చేస్తుంది.‌ఆ విధంగా బ్రహ్మకు సృష్టి రచనలో సహకరిస్తుంది.
ఈ విధంగా సరస్వతి దేవి  విద్యకు ,జ్ఞానానికి ప్రతినిధి గా ఉంది. ప్రతి ఋూరోజూ ఆమె పూజ తప్పనిసరిగా ఆబాల గోపాలం చేయాలని అంటారు.
“ఇక న్యాయము విషయానికి వస్తే ముఖే ముఖే సరస్వతీ అనగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రూపంలో ఉంటుంది. కనుక దానిని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాం కదా?. కొందరు చక్కగా మాట్లాడుతారు.కొందరు కొత్త కొత్త వస్తువులను కనిపెడతారు.వృత్తిలో అద్భుతాలు సృష్టిస్తారు.
ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ప్రతిభ రూపంలో జ్ఞానం  రూపంలో ఉంటుంది కనుక "ముఖే ముఖే సరస్వతీ" అంటారు.
ఈవిధంగా ఒక బోయవాడు వాల్మీకిగా మారి రామాయణం రాశాడు.ఏకలవ్యుడు గొప్ప విలుకాడుగా పేరొందాడు. మహా భారతంలో విదురుడు  బోధించిన నీతి వి"దుర నీతిగా" పేరు పొందుతుంది. ఇలా ఎన్నో  ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
ఇదండీ "ముఖే ముఖే సరస్వతీ న్యాయము" అంటే... దీనిని బట్టి ఎవరిలో ఏ ప్రతిభ ఉంటుందో తెలియదు.ఎలాంటి భేద భావం లేకుండా అందరినీ  గౌరవించాలి.

కామెంట్‌లు