శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం
ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది. ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని పురాణాలు అభివర్ణించాయి. శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, అందువల్ల దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఉత్తర దిశలో ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతాడు. ఇది దక్షిణాయన ప్రారంభానికి సంకేతం. అలాగే, చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది.
ఈ రోజు సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. పూజ గదిని శుభ్రంగా ఉంచి, విష్ణుమూర్తి ప్రతిమ లేదా పటానికి పసుపు, కుంకుమలు అలంకరించి, పుష్పాలతో పూజించాలి. అనంతరం చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి, కర్పూర హారతి ఇవ్వాలి.
ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసిన వంటకాలు, వండిన ఆహార పదార్థాలు తీసుకోరాదు. అలాగే, మంచంపై నిద్రించరాదు. ఈ రోజు యోగనిద్రలోకి వెళ్లిన విష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని, దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత వచ్చే ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి, అందరూ చాతుర్మాస్య దీక్షను పాటిస్తారు.
పద్మ పురాణం ప్రకారం, మానవజాతి ఉద్ధరణ కోసం శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడు. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాక, మరణానంతరం వైకుంఠప్రాప్తి పొందుతారు.
ఈ పండుగ ముఖ్యంగా రైతులకు ప్రాధాన్యత కలిగినది. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుకగా జరుపుకుంటారు. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, ఇతర సమస్యలు రాకుండా ఉండాలని ప్రార్థిస్తారు. ఈ రోజు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా చేసి, నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.
అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి