సుప్రభాత కవిత : బృంద
కనులకు కలలిచ్చి 
కలలకు రంగులద్ది 
కనపడని మెలికలు పెట్టి 
కదిలే కమ్మని కాలం!

స్వప్నం సత్యం కావాలని
సంఘర్షణలతో సంవేదనలు
సంతాపాలు ఎన్నున్నా
సహనంతో నిత్యం సావాసం!

కోరినవన్నీ తీరాలని
కొదవలు నింపుకు ఆగక
కొత్తవెలుగుల సాయంతో
కోరికలీడేర్చుకునే పోరాటం!

అందలమేదో వచ్చేనా 
అందని ఆనందం తెచ్చేనా 
ఆకాశం అంచున దాగిన 
ఆ అవకాశం దొరికేనా?

నిదుర రాని రేయిలో 
కలలు కనే సాహసం 
కలతలన్నీ కనుమరుగయే
కమ్మని క్షణం వచ్చేనా?

కలిసి వస్తానంటూ 
కదిలి వచ్చే కాలాన్ని
కనుపాపల దీపాలకు
కరిగిపోని వెలుగిమ్మని వేడుతూ

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు