లలనాజనాపాంగవలనావసదనంగ
తులనాభికాభంగ దోఃప్రసంగ
మలసాని *లవిలోలదళసాసవరసాల
ఫలసాదరశుకాలపన విశాల
మలినీగరుదనీక మలినీకృతధునీక
మలినీసుఖితకోక కులవధూక
మతికాంత సలతాంతలతికాంతరనితాంత
రతికాంతరణతాంత సుతనుకాంత
తే.గీ.
మకృతకామోదకురవకా వికలవకుల
ముకులసకలవనాంతప్రమోదచలిత
కలిత కలకంఠ కులకంఠ కాకలీవి
భాసురము వొల్చు మధుమాసవాసరంబు!
----------------------------------------
కావ్యము:వసుచరిత్ర
కవి:రామరాజ భూషణుడు
సందర్భము:వసంత ఋతువర్ణన
ప్రధమాశ్వాసము:126వ.పద్యము
---------------------------------------
:నా విశ్లేషణ:
--------------------------------------
వసు చరిత్ర కావ్యం లోని సుప్రసిద్ధ పద్యంఇది.
అర్థం తెలియనప్పటికీ లయాత్మకంగా ఉండడం చేత శ్రోతలను ఉర్రూతలూగిస్తుంది.ఇందు కొన్ని విశేషములు ఏమిటంటే
మూడు పదములు (ప్రసంగ-ప్రమోద-పొల్చు) తప్ప మొత్తం సరళాక్షర గుణింత పదభరితమై కొనసాగింది.సూర్యగణాలు మినహా సీసంలో
“సగణాలు”అధికంగాకొన్నిచోట్ల”తగణాలు”తో
పద్యాన్ని అల్లడం వలన “ఖండగతి”లో పద్యం నడిచింది. అదీగాక తన “నరసభూపాలీయం”లో సీసాలలో యతి,ప్రాసలను బట్టి ఏడెనిమిది రకాల సీసాలను ఉటంకించాడు.ఈ పద్యం సరళాక్షరపదాల వలన ప్రసాద గుణభరితంగా ఉండి రాగాలాపనకు కూడా కీర్తన వలె అనుకూలమైనది. సంగీత సాహిత్యాల యందు భట్టుమూర్తి ధిషణ కలిగివాడు కనుక రస స్రవంతి వలె పొంగి ప్రవహించింది.
వృత్యను ప్రాసము నృత్యమే చేసింది. సంధిగత పదాల వలన అక్కడక్కడా “యమకము”కూడా
శబ్ధపల్లవాలచేత ధ్వనించింది.
-------------------------------------
1&2: పాదాలు:
-------------------------------------
లలనాజన-స్త్రీజనముయొక్క
అపాంగ-క్రేగంటి చూపుల యొక్క
వలన-చలనమందున
అవసత్-నివసించిన
అనంగ-మన్మధునితోడ
తులన-సమానమైన
అభిక-కాముకులయొక్క
అభంగ-అంతరాయము లేక
దోఃప్రసంగము-ఆలింగన ప్రచారములు కలిగినదియు.
:సంధిగతపదాలు:
#లలనాజన+అపాంగ+అవసత్+అనంగ
#తులన+అభిక+అభంగ
---------------------------------
3&4పాదాలు:
—--------------
అలసత్-మందగతిగల
అనిల-వాయువుచేత
విలోల-మిక్కిలి చలించుచున్న
దళ-చిగురుటాకులు గలిగినవియు
సాసవ-మకరందంతో కూడిన
రసాల-తీయమామిడి చెట్లయొక్క
ఫల-ఫలములయందు
సాదర-ఆదరముతో కూడుకొన్న
శుక-చిలుకలయొక్క
ఆలపన-ఆలాపముచేత
విశాలము-విస్తారమైనది.
:సంధి పదాలు:
#ప్రసంగము+అలసత్ (2వపాదం చివరి పాదంతో సంధి)
#సా+ఆసవ-("సా" కూడిన,ఆసవ -మకరందము)
#శుక+ఆలాపన
--------------------------------------
:5&6పాదాలు:
—-------------
అలినీ-ఆడతుమ్మెదలయొక్క
గరుత్-రెక్కలయొక్క
అనీక-సమూహములచేత
మలినీకృత-నల్లగా చేయబడిన
ధునీ-నదీసంబంధమైన
తామరతీగెలయందు
సుఖిత-సంజాత సుఖములైన
కోకకులవధూకము-చక్రవాక స్త్రీలు కలిగినదియు.
:సంధి పదాలు:
#విశాలము+అలినీ-(4వ.పాదం చివరిపదముతో అక్షరంతో సంధి)
#గరుత్+అనీక
------------------------------------
7&8పాదాలు:
—----------------
అతికాంత-అత్యంత మనోహరమైన
సలతాంత-పుష్పసహితములైన
లతికాంతర-తీగెల యిండ్ల లోపల
నితాంత-ఎడతెరిపిలేని
రతికాంతరణ-మన్మధయుధ్ధముచేత(రతిసఖ్యము చేత)
తాంత-అలసిన
సుతను కాంతము-స్త్రీపురుషుల గలిగినదియు
:సంధి పదాలు:
#కులవధూకము+అతి కాంత(6వ.పాదం చివరిపదంతో సంధి)
#స+లత+అంత
#లతిక+అంతర
------------------------------------
తేటగీతి
---------------
అకృతక-కృత్రిమముకాని
ఆమోద-పరిమళములు గలిగిన
కురువక-గోరింట పూవులు గలిగినదియు
అవికల-విచ్ఛన్నముకాని
వకుళ-పొగడ చెట్లయొక్క
ముకుళ -మొగ్గలు కలిగిన
సకల-సమస్తములైన
వనాంత-వనమధ్యమునందు
ప్రమోద-సంతోషముచేత
చలిత-సంచరించుచున్న
కలిత-ఒప్పిదమైన
కలకంఠ-కోయిలలయొక్క
కుల-సమూహము
కంఠకాకలీ-కంఠసంబంధమైన అవ్యక్తమధురధ్వని
భాసురము-ప్రకాశించుచున్నదియగు
మధుమాసవాసరంబు-వసంతవాసరము
పొల్చున్-ప్రకాశించును
:సంధి పదాలు:
#సుతను కాంతము+అకృతక(8వ.పాదం చివరి పాదంతో సంధి)
#అకృతక+ఆమోద
#కురువక+అవికల
#వన+అంత(వనమధ్యభాగాన)
----------------------------
భావము
----------------------------
1&2పాదాలు
*స్త్రీల క్రేగంటిచూపుల చలనమునందు నివసిస్తున్న మన్మధునితో సమానమైన కాముకుల అంతరాయములేని ఆలింగనముల ప్రచారములుగలిగిన మధుమాసవాసరము.
3&4 పాదాలు
*మందగతిగల వాయువు చేత అనగా మందమారుతముచేత మిక్కిలి కదలుతున్న చిగురుటాకులు కలిగినదియు,మకరందముతో కూడుకున్న తీయమామిడిచెట్ల ఫలములయందు
ఆదరము గలిగిన చిలుకల ఆలాపనముచేత
విస్తారమైన మధుమాసవాసరము.
5&6పాదాలు
*ఆడతుమ్మెదలయొక్క రెక్కలయొక్క సమూహముచేత నల్లగా చేయబడిన నదీ ప్రవాహము ,తామరతీగెలయందు సుఖించుచున్న చక్రవాకాంగనలగల మధుమాసవాసరము.
7&8పాదాలు
*అత్యంత మనోహరములైన,పుష్ప సహితములైన,
తీగెలు యిండ్లలో ఎడతెగని మన్మధ కేళిలో అలసిన స్త్రీపురుషులు కలిగిన మధుమాసవాసరము.
తే.గీ.
కృత్రిమముకాని (స్వభావసిద్ధమైన)పరిమళముగలిగిన గోరింట పువ్వులు కలిగినదియు, విచ్ఛిన్నములు కాని
పొగడ చెట్ల మొగ్గలు కలిగినదియు, సమస్తములైన వన మధ్యముల యందు సంతోషం చేత సంచరించుచున్న కోయిలల సమూహము యొక్క అవ్యక్త మధుర ధ్వని చేత
ప్రకాశించుచున్న మధుమాసవాసరము.
—-------------------------------------
కొన్ని విశేషణాలు:
*మన్మధుడు చెలువల కడగంటి చూపుల కదలికలను ఆశ్రయించి ఉండునని లోక ప్రసిద్ధము.
అతడు ‘అనంగుడు’ అగుట వలన అనగా అంగము లేనివాడు అగుట వలన మరి ఎక్కడ బ్రతుకగలడు
స్త్రీల కంటి చూపుల లోనే అని ధ్వని.
*గాలి ఎందుకు మందగమన అయింది? పరిమళాలను మోసుకు రావడం చేత. అందుకే “అలసత్ అనిల”అన్న ప్రయోగం వాడబడింది.
*పుష్ప రసము చేత తుమ్మెదలు మెరుగెక్కుట వలన వాని రెక్కల కాంతులచే నదినల్లబడినది. ప్రాతః సమయం అగుట చేత తామర పువ్వులలో చక్రవాకములు సుఖిస్తున్నవి.
*వసంత ఋతువు మనోహరమైనది. అందువలనే స్త్రీ పురుషులు నిరంతర ప్రతికాంతరణముతో గడిపారు. వృక్షాలు ప్రసూనావృతములగుటచేత
కామోద్దీప భావనలను కలుగజేస్తాయి. కనుక మొదటి పాదం యందు ఆలింగనము, సీసం నాలుగవ పాదముల యందు రతికేళిని కవి వర్ణించినాడు.
*మంద మారుతంతో కదులుతున్న చెట్ల ఆకులు.
మధురమైన ఫలాలతో నిండిన మామిడి చెట్లు.
మామిడి పండ్లను తింటున్న చిలుకల కిలకిలు.
మనోహరముగా పుష్పించిన వృక్షాలు. పరిమళిస్తున్న గోరింట పువ్వులు. విచ్ఛిన్న ముఖాన్ని పొగడ చెట్లు. వనాల మధ్యలో కోయలల కుహు కుహు గాన రవం. ఇది కదా వసంత ఋతుధర్మం.
ఇంత మనోహరమైన వసంతాన్ని వర్ణించిన
ఈ పద్య శిల్పం తెలుగువారి హృదయాలలో
‘కలకంట కులకంఠ కాకలీ’ స్వరాలను ఈనుతూనే ఉంటుంది.
—-------------------------------------
వివరణ:కిలపర్తి దాలినాయుడు.
ఆధార గ్రంథం:శేషాద్రిరమణకవుల వసుచరిత్ర సటీక.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి