ప్రతీకారం :----డా.పోతగాని సత్యనారాయణ

 ఒక దట్టమైన అడవిలో ఏనుగులు, జింకలు, పక్షులు, ఇతర జంతువులు సంతోషంగా కలిసిమెలిసి జీవించేవి. ఆ అడవికి ఏనుగు రాజు. అది చాలా దయాగుణం కలది, మరియు బలమైనది. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుండేది. అదే అడవిలో ఒక దోమ కూడా ఉండేది. అది చాలా నీచబుద్ధి కలది, మరియు చిన్నచిన్న విషయాలకే పగతో రగిలిపోయేది.
ఏనుగు ప్రతిరోజూ ఆహారం కోసం అడవిలో తిరిగి అలసిపోయేది. సేద తీరడం కోసం నీటి మడుగు పక్కనే ఉన్న ఒక విశాలమైన పెద్ద చెట్టు కిందకు చేరేది. ఆ చెట్టు ఎన్నో పక్షులకు, చిన్న జంతువులకు ఆశ్రయం కల్పించేది. దాని కొమ్మలపై పక్షులు గూళ్ళు కట్టుకొని నివసించేవి.
ఒకరోజు, కొండయ్య అనే కట్టెలు కొట్టేవాడు అడవిలోకి వచ్చాడు. అతనికి డబ్బు సంపాదించాలనే యావ తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. అతను ఆ పెద్ద చెట్టును చూసి, 'ఈ చెట్టును నరికితే నాకు నెల వరకూ కట్టెల కోసం వెతకాల్సిన అవసరం లేదు. అంతేకాదు, దీని బలమైన కాండంతో ఇంటికి అవసరమైన వాసాలు, తలుపులు, కిటికీలు తయారు చేయించి, అంగడిలో అమ్మి మరింత డబ్బు సంపాదించవచ్చు' అనుకున్నాడు.
ఆలోచన రావడమే ఆలస్యం, తన వెంట తెచ్చుకున్న పదునైన గొడ్డలితో చెట్టును నరకడం మొదలుపెట్టాడు.
కొండయ్య గొడ్డలి దెబ్బలకు చెట్టు బలంగా ఊగడంతో, గూళ్ళలోని పక్షులు భయంతో అరుస్తూ గాలిలోకి ఎగిరిపోయాయి. వాటి అరుపులతో అడవిలో అలజడి ఏర్పడింది. 
అదే చెట్టు పైన ఉన్న దోమ నిద్రలేచింది. నిద్రలేచిన వెంటనే దానికి విపరీతమైన కోపం వచ్చింది. తన చిన్న రెక్కలను ఆడిస్తూ కొండయ్య వైపు దూసుకువచ్చింది.
పక్షుల అరుపులతో, జంతువుల పరుగులతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. అడవిలో మేత కోసం దూరం వెళ్ళిన ఏనుగుకు ఈ శబ్దం వినిపించింది. అడవిలో ఏదో ప్రమాదం జరుగుతోందని అనుమానించి, అది వేగంగా చెట్టు దగ్గరకు చేరుకుంది. అక్కడ జరుగుతున్న సంఘటనను చూసి కోపంతో రగిలిపోయింది. ఆ చెట్టు ఎన్నో జీవులకు ఆశ్రయం ఇస్తుందని ఏనుగుకు తెలుసు. వెంటనే కొండయ్య మీదకు దాడికి దిగింది. ఏనుగును అంత కోపంగా చూసిన కొండయ్యకు గుండె జారిపోయినంత పనైంది. చేతిలోని గొడ్డలిని విసిరేసి, తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగు లంకించుకున్నాడు.
కొండయ్యను ఏనుగు కొంతదూరం తరిమికొట్టింది. ఆ తర్వాత, 
"ఇతనికి గుణపాఠం నేర్పాను, ఇక ఈ చెట్టును నరికే సాహసం చేయడు" 
అని భావించి, వెనుదిరిగి చెట్టు కిందకు చేరింది. ఏనుగుకు ఉన్నత మనస్సు ఉంది. దాని కోపం నీటిపై రాసిన రాతలా క్షణంలో మాయమైంది.
కానీ, దోమ మాత్రం కొండయ్యను వదలకుండా వెంటాడుతూనే ఉంది. కొండయ్య పారిపోతుంటే, అది తన వెగటైన శబ్దంతో అతని చుట్టూ తిరుగుతూ, విసిగిస్తోంది. కొండయ్య దోమను చేతితో విదిలిస్తూనే పరుగెత్తుతున్నాడు. ఏనుగు వెనుదిరిగి వెళ్ళిపోయిందని గమనించిన కొండయ్య పరుగు ఆపి ఊపిరి పీల్చుకున్నాడు.
అయితే దోమది నీచమైన మనసుకదా! కొండయ్య ముఖం పైన వాలింది. కొండయ్య చేతితో విదిలించాడు. అలా విదిలిస్తూనే ఉన్నాడు. దోమ వదలకుండా మళ్ళీ మళ్ళీ వాలుతూ, చిరాకు కలిగిస్తూనే ఉంది. అది చిన్న విషయానికి కూడా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. చివరికి, అది కొండయ్య చేతి మీద వాలి, నొప్పి తెలియకుండా రక్తం పీల్చడం మొదలు పెట్టింది. కొండయ్య ఓపిక పట్టి, విసుగుచెంది, ఆ దోమ మీద ఒక్క చరుపు చరిచాడు. ఒక్క క్షణంలోనే దోమ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
కొండయ్య, తన చేతిలో చచ్చిపడి ఉన్న దోమను చూశాడు. అతని కళ్ళు దోమను, ఏనుగును, అప్పుడు జరిగిన సంఘటనను ఒక్కసారిగా గుర్తు చేసుకున్నాయి. 
"చూశావా దోమా! నేను చేసిన తప్పుకు ఏనుగు కోపం కొన్ని క్షణాలే ఉంది, అది నన్ను వదిలేసింది. కానీ నీకు కలిగిన చిన్న కోపం, ఆ పగ ఎంత దూరం తీసుకువెళ్ళింది? చివరికి నీ ప్రాణాలనే తీసింది. అవును, ఉన్నత మనస్సు గలవారి కోపం నీటిపై రాసిన రాత లాంటిది, అది క్షణికం మాత్రమే. కానీ నీచ మనస్సు గలవారి కోపం పదునైన కత్తి లాంటిది, అది వారిని కూడా నాశనం చేస్తుంది. చిన్న విషయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూసేవారు చివరికి వారికే హాని చేసుకుంటారు" 
అని తనలో తనే గట్టిగా అనుకున్నాడు.
ఆ రోజు నుండి కొండయ్య అడవిలోకి వచ్చి చెట్లను నరకడం మానేశాడు. అతడు తన తప్పును తెలుసుకుని, ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు.

కామెంట్‌లు