"అరకు వెళ్ళే రైలు బండి" : - పోలయ్య కవి కూకట్లపల్లి




 అరకు వెళ్ళే రైలు బండి... 
మానవత్వం నిలుపుకో... 
పుస్తకంలోని మూడవ నవలిక... 
 
రచన: 
డాక్టర్ వీడి రాజగోపాల్ గారు  డైరెక్టర్ మైన్స్ (రిటైర్డ్) & గౌ.అద్యక్షులు మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ
సమీక్ష చేసిన వారు: 
పోలయ్య కవి కూకట్లపల్లి  మేనేజర్ ఆంధ్రా బ్యాంక్ (రిటైర్డ్) & ప్రముఖ కవి రచయిత  అత్తాపూర్ హైదరాబాద్
"అరకు వెళ్ళే రైలు బండి"...  ఆ పేరు వినగానే... మీకు తప్పక గుర్తుకు వస్తుంది  ఒకనాటి తూర్పు వెళ్ళే రైలు... 
బాపు రమణల రమణీయమైన చిత్రం  
ఈ నవలిక చదివితే... గుర్తుకు వస్తాయి  ఒక సమయంలో అందరూ  వారంవారం ఎదురు చూసిన  యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు... అందులోని పాత్రలు అందమైన హీరోలు. ఇందులో సాగర్ పాత్ర కూడా  ఆ హీరోలనే గుర్తు చేస్తుంది...  
ముందుగా మా గురుదేవులైన బిక్కికృష్ణ గారికి  పితృసమానులైన ఇనాక్ గారికి 
నా నమస్సుమాంజలులు.  
"మానవత్వం నిలుపుకో "అన్న నాలుగు నవలికల్లో మూడవదైన అరకు వెళ్లే రైలు బండిని సమీక్ష చేయమని  నన్ను కోరడం నా అదృష్టం ఇది నాకు  ఒక బంగారు అవకాశమే కాదు నాకు  "ఒక చిన్న ప్రమోషన్" లాంటిది. అందుకు ముందుగా అందరిని ప్రోత్సహించే అవకాశాలు కల్పించే...రాజగోపాల్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే...  
ఒక తల్లి బిడ్డకు పాలిచ్చి ఆ బిడ్డ కడుపునిండా త్రాగి ఆదమరిచి నిద్రపోతూ ఉంటే ఆ తల్లి ఎంత ఆనందం పొందుతుందో అటువంటి చల్లనితల్లి మాతృత్వపు...దాతృత్వపు మనస్తత్వం  ఉన్న మన రాజగోపాల్ గారు సభలు సమావేశాలుపెట్టి కవులను కళాకారులను 
సన్మానించి  వారి ముఖాల్లో చిరునవ్వులు చూసి తాను పొందే ఆనందం ఆత్మతృప్తి  అంతా ఇంతా కాదు...అదే వారి బలం  అదే వారి ఆరోగ్య రహస్యం.  
అట్టి వీడి రాజగోపాల్ గారికి ముందుగా  నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  
ఇక నా సమీక్ష ప్రారంభించే ముందు  
ఈ నాలుగు నవలికల మీద తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన పూజ్యనీయులైన ఇనాక్ గారి...గురుదేవులైన బిక్కికృష్ణ గారి... ప్రముఖ కవి నటుడు నాయుడు గారి... ఆణిముత్యాలవంటి మాటలు కొన్ని మీకు గుర్తు చేసి తదనంతరం  క్లుప్తంగా నా సమీక్ష చేస్తాను.  
పద్మశ్రీ ఆచార్య ఇనాక్ గారు ఏమన్నారు అంటే..?. మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా అనేకమంది కవులను
ప్రోత్సహిస్తూ కవిసమ్మేళనాలునిర్వహిస్తూ 
సాహిత్యసేవలో తరించే మన రాజగోపాల్ గారు తన కష్ట సమయాల్లో సాహిత్యం తనకు ఎలా ఉపయోగపడిందో వారు వ్రాసిన "మనసులోని మాటను" ప్రతి ఒక్కరు చదివి తీరాలి...అన్నారు.   
నిజమే మన రాజగోపాల్ గారు తన  "ముందుమాటలో " ఏమి వ్రాశారంటే...  సాహిత్యం మన బుర్రలో ఉంటుంది. అది మన నీడలా వెన్నంటి ఉంటుంది.ఎప్పుడు పిలిచినా పలుకుతుంది. బుర్రని ఇతర విషయాలపై ఆలోచింప చేయనయ్యదు  ఒక విధంగా తన వైపు కట్టిపడేస్తుంది. ఏకాంతములో నిన్ను విడిచి  పొమ్మన్నా పోదు...35 రోజులు నేను "చంచలగూడ  ఆశ్రమ వాసినిగా" ఉన్నాను...అన్నారు
కానీ నేను ఏమనుకుంటున్నానంటే... వారు ఈ నెల రోజులు "వాల్మీకి ఆశ్రమానికి విహారయాత్ర కెళ్లారని అనుకుంటున్నాను   ఆ ఆశ్రమంలో ఒక వైపు మహర్షి వాల్మీకి తాను వ్రాసిన రామాయణాన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే...మరో వైపు మన రాజగోపాల్ గారు వారానికొక్క నవలికను రాస్తూ నెలరోజులు రాత్రింబవళ్లు సాహితీ
లోకంలో విహరించారని నాలుగు అంశాల మీద చక్కని పాత్రలచిత్రీకరణతో నాలుగు 
నవలికలు అద్భుతంగా వ్రాశారని  వారు ఖచ్చితంగా విహారయాత్రకే వెళ్ళారని, నేను గట్టిగా విశ్వసిస్తున్నాను    
ఒక తోటమాలిగా డాక్టర్ విడి రాజగోపాల్ గారు తన "మానవత్వం నిలుపుకో" తోటలో పెంచిన నాలుగు మొక్కలే  
ఈ నాలుగు నవలికలు...అందులో  గుభాళించే"గులాబీలా మొక్క ఈ 
"అరకు వెళ్లే రైలు బండి".
మా గురుదేవులు బిక్కీగారే మన్నారంటే... ఈ నాలుగు నవలికలు కాదు ఇవి మినీ నవలలు అని...అంతేకాదు మంచివాళ్లకు దేవుడే  రక్షకుడు అంటారు. 70 పైబడిన వయసులో మన రాజగోపాల్ అన్నకు  జరగరాని నష్టం జరిగిందని...రాకూడని కష్టం వచ్చిందని...ఆయన మంచితనం మానవత్వం...సేవాగుణం...దయాగుణం ఆయనకు శ్రీరామరక్ష...అని. ఎడారిలో ఒయాశిస్సులు సృష్టించుకో గల ఆత్మవిశ్వాసం...తనపై తనకున్న నమ్మకం...న్యాయం గెలుస్తుందనే దృఢ సంకల్పంవల్ల అన్నగారు నెలరోజుల్లో తన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని, అద్భుతమైన నాలుగు 
అంటే  వారానికి ఒకటి లెక్కన నాలుగు కథానికలు సృష్టించి గొప్ప మినీ నవలా రచయితగా వెలుగులోనికి వచ్చారని మా గురువు గారి భావన. 
ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి  రాజగోపాల్ గారి వంటి ఒక అదృష్టవంతుణ్ణి సముద్రంలో విసిరేస్తే... మునిగి పైకి తేలాడట "నాలుగు బంగారు చేపలతో" ఆ నాలుగు బంగారు చేపలే  
ఈ "నాలుగు నవలికలు" అని నా భావన.
సినీ గీతరచయిత నటుడు నాయుడు గారు ఏమన్నారంటే...? మన రాజగోపాల్ గారు సున్నిత మనస్కులు, సునిశిత
పరిశీలకులు, పరిశోధకులు, ఆధ్యాత్మిక భావనలు నిండుగా ఉన్నవారు, సేవా తత్పరులు, కలల పట్ల అంకితభావం గలవారు, సమాజంలో నైతిక విలువలు వెల్లి విరియాలని ఆకాంక్షించేవారు,  విస్తృతమైన విషయపరిజ్ఞానం ఉన్నవారు, వ్యవస్థలోని లోతుపాతులు  లోటుపాట్లు తెలిసినవారు మనిషిని బంధించగలరేమో కానీ మనసును బంధించలేరు కదా. కష్ట కాలంలో తనలోని కథా రచయితను తట్టి లేపారు, కాలాన్ని వృధా చేయకుండా కథాత్మకంగా మార్చుకున్నారు...  రాజగోపాల్ గారు...అన్నారు నాయుడు గారు...వారన్నది అక్షర సత్యం.  
ఈరోజు రాజగోపాల్ గారి పుస్తకం లోని ఒక నవలిక సమీక్ష చేయడనా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ గతంలో నా మీద నమ్మకంతో  మన పూర్వ అడ్మిన్  అరుణా కుమారిగారి అరుణోదయ కిరణాలకు... శ్రీకాకుళం పత్తి సుమతిగారి  అక్షర ఖడ్గానికి... కర్నూలు బ్రహ్మయ్యగారి తొలి కిరణాలుకు...తెనాలి నాగేశ్వరరావు గారి కవితా కెరటాలుకు...బెంగళూరు బనారే గారి సంపూర్ణ రామాయణం పుస్తకాలకు...  ఇలా ఒక ఐదు పుస్తకాలకు సమీక్షలు/ ముందు మాటలు వ్రాయడం జరిగింది... రచయితల నుండి నాకు మంచి స్పందనే వచ్చింది...నాకు సమీక్షలు చేయగలనన్న నమ్మకం కుదిరింది.  
మానవత్వం నిలుపుకో " పుస్తకంలోని నాలుగు నవలికల్లో ... "మల్లె తీగకు పందిరి తోడైతే"... సాధనాల వెంకట స్వామి నాయుడు... "నేటి సమాజంలో 
ఓ ఆడపిల్ల"... డా.రాధా కుసుమ... "హృదయ కుసుమం"...రామలక్ష్మి మోచర్ల సమీక్ష చేశారు. 
సహజంగా ఎవరైనా ఒక కవికి ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మంచి ఆలోచన రావు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడే అద్భుతమైన ఆలోచనలు ఉద్భవిస్తాయి ఇది సహజం. కానీ కొందరికి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారి యొక్క స్థిత ప్రజ్ఞతతో ధ్యానంలో ఉన్న వారికి  దివ్యమైన ఆలోచనలు వస్తాయి  
ఆ ఆలోచనలే ఆ వాల్మీకి మహర్షి ఆశిస్సులతో మన రాజగోపాల్ గారికి  వచ్చి ఈ "మానవత్వం నిలుపుకో" నాలుగు నవ నవలికల సంపుటి వెలుగు చూసిందని నా భావన.
ఏదైనా ఒక సంఘటన జరిగితే వెంటనే దాని మీద కవితలు చక్కని పాటలు గజల్స్ నాటకాలు వ్రాయడం కథానికలతో కాసేపు అంటూ గతంలో రెండు కవితా సంపుటాలు తీసుకువచ్చి కథలు అల్లడంలో ...పాత్రల చిత్రీకరణలో  
దిట్ట మన రాజగోపాల్ గారు ...  
కవిగా కవితలు సృష్టించవచ్చు కానీ కథారచయితగా పాత్రల సృష్టి అది భగవంతుని వరమే  అట్టివరం పొందిన వారు మన  డాక్టర్ వీడి రాజగోపాల్ గారు  ఇది నిజంగా వరప్రసాధితమే కాకపోతే ఒక్క నెల రోజుల వ్యవధిలో నాలుగు నవలికలు చిత్రవిచిత్రమైన పాత్రలతో సృష్టించడం  అందరికి సాధ్యమయ్యేది కాదు  
రాజగోపాల్ గారిలో ఒక కవి...ఒక నాటక రచయిత...ఒక గేయ కవి...ఒక కథా రచయిత...ఇందరు దాగి ఉన్నారనడంలో  నాకైతే ఎట్టి సందేహమే లేదు.  
అరకు వెళ్లే రైలు బండిలో ముఖ్యపాత్రలు హీరో సాగర్ ...విశాఖలో ఒక ఇంజనీర్ స్టూడెంట్...ధనవంతుల బిడ్డ. పేదప్రజల మీద దయ జాలి కలిగినవాడు. కాలేజీలో ర్యాగింగ్ కట్టడిచేసినవాడు.  నార్త్ ఇండియా టూర్ లో హెలికాప్టర్ రద్దైతే సాగర్ ఫాదర్ పవర్ ఉపయోగించి  సమస్యను పరిష్కరించడంతో... సాగర్ నాయకత్వ లక్షణాలు...మంచితనం... యద్దనపూడి సులోచనారాణి నవల్లో హీరోను గుర్తు చేస్తుంది. సాగర్ ఫాదర్ మధుసూదన్  వైజాగ్ లో పెద్ద కాంట్రాక్టర్...  రైల్వే గేట్ మాన్ బానోజీ నాయక్...వారి కూతురు సీతాలు...సీతాలు అన్న కమల్...సాగర్ ను ఇష్టపడే రాధిక...ఈ ఆరుపాత్రలతో అద్భుతంగాఅందించిన "అమృత కలశం"  అరకు వెళ్లే రైలు బండి.   
ప్రతిపాత్ర సజీవంగా చదువుతున్నంత సేపు మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది మన చుట్టే తిరుగుతూ ఉంటుంది ఇది రాజగోపాల్ గారి అధ్భుత దృశ్య చిత్రీకరణకు ఒక ఉదాహరణ.   
మన కథానాయకుడు సాగర్  గేట్ మాన్ భానోజీ నాయక్ ఇంట్లో ఒకరోజు గడపాలనుకోవడం...సీతాలును ఇష్టపడే అనిపిస్తుంది. ఆమె అమ్మా నాన్నలతో  ప్రరిచయం పెంచుకుని కొంత  చనువు ఏర్పడిన తరువాత,  సీతాలును తల్లీ దండ్రుల అనుమతితో  వైజాగ్ తీసికెళ్ళి, తమ ఇంటిలో  కొద్దిరోజులు ఉంచుకోవడం  సీతాలును అమ్మకు రాధికకు పరిచయం చేసి,  సీతాలుకు అనేక విషయాల్లో ట్రైనింగ్ ఇప్పించడం...అంటే...అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి ప్రాకుతుంది...అని ఓ కవి అన్నట్టు...  అందమైన కొండల్లో కోనల్లో తిరిగే అమాయకపు గిరిజన యువతిని 
సిటి లైఫ్ కు అలవాటు పడేలా చేయడం... అంతా ఒక శిలను సుందర శిల్పంగా మలచుకోవడమే...ఇక్కడ శీతాలు ఒక శిలైతే... సాగర్ ఒక శిల్పి... అని రాధిక అంటుంది. రెండు పాత్రలను అధ్భుతంగా డిజైన్ చేసిన "అభినవరాజమౌళి" మన రాజగోపాల్ గారు.  
ఒకసారి అరకులో ఒక తెల్లని రాయిని చూసి దానిని జియాలజి డిపార్ట్మెంట్  పంపి అక్కడ మైనింగ్ చేయవచ్చని 
దానికి ధరకాస్తు చేయించి, సీతాలు తల్లిపేర మైనింగ్ లీజును రిజిస్టర్ 
చేయించి, ఆమె ఖాతాకు కొంత డబ్బు జమ అయ్యోలా చేయడం... అక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ జరగడం... వారికి ఆదాయం  లక్షల్లో రావడం...అక్కడ వర్కర్స్ కి ఒక కాలనీ కట్టించడం... ఆ కొండ ప్రాంతమంతా గేట్ మాన్ భానోజీ నాయక్ తాండాగా మారిపోవడం...  
వాళ్ళ జీవితాలు ఊహకందని విధంగా మారిపోవడం...అదంతా సాగర్ ఉదాత్తమైన హృదయానికి...ఉన్నతమైన ఆలోచనలకు ప్రతిబింబం. కథానాయకుని నాయకత్వపు  లక్షణాలను పాఠకులకు పరిచయం చేయడమే...రాజగోపాల్ గారి గొప్పదనం.‌   
ఇలా కథ సాగే సమయంలో సితాలు 
తండ్రి భానోజీకి గుండెపోటు రావడం... చావు బ్రతుకుల్లోఉండి అకస్మాత్తుగా సీతాలును జాగ్రత్తగా చూసుకోమని... కారణం సీతాలు తమ కన్న కూతురు కాదని... పెంపుడు కూతురని...
23 సం.లక్రితం తమ ఇంటి దగ్గరే రైలు యాక్సిడెంట్ జరిగిందని, చాలా మంది చనిపోయారని, ఆమె తల్లిదండ్రులు చనిపోయారో బ్రతికి ఉన్నారో తమకు తెలియదని, మా గడ్డివాములో దొరికిన సీతాలును మేము పెంచుకున్నామని,  చెప్పడం...ఈ  ఈ కథలో ఒ్పెద్ద ట్విస్ట్ ఇది రాజగోపాల్ గారి ఉన్నతమైన ఊహలకు నిలువెత్తు నిదర్శనం...   
ఇక అసలు కథ ఇక్కడ మొదలౌతుంది  సీతాలు తల్లితండ్రుల ఆచూకి తెలుసు కోవడం కోసం సాగర్....కర్నూలు విజయవాడ చెన్నై బెంగుళూరు భువనేశ్వర్ వైజాగ్  హైదరాబాద్ లో  అమెరికాలో అనేక అడ్రస్సులు పట్టుకుని, తిరిగి తిరిగి అనేక మందిని కలిసి, ఎన్నో ఇబ్బంది పడి, అనేక మార్గాలలో చివరికి అమెరికాలో ఉన్న  ఆమె పినతండ్రి రక్తసంభందీకులు శ్రీనాథ్ పరిచూరి... ఆచూకీ కనుక్కోవడం...తన అన్న కమల్ అన్నా వదినల దగ్గర ఉన్నట్టు తెలుసుకొని కమల్ ని ఇండియాకు తీసుకు రావడం...  తమ ఇంటిలో ఉన్న సీతాలును కమల్ కు పరిచయం చేయడం...అలాగే  సాగర్ సీతాలు మధ్య...కమల్ రాధికల మధ్య ప్రేమలు చిగురించడం...ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం.. సాగర్ సీతాలు 
తమ పెళ్ళిని  అరకులోయలో బానోజీ తాండాలో చేసుకోవడం... కమల్ రాధికల పెళ్ళి హైదరాబాద్ లో  కమల్ ఫాంహౌస్ లో జరగడంతో  కథ సుఖాంతమౌతుంది.
ఈ చక్కని కథలో నాకు కలిగిన  
మూడు ధర్మసందేహాలు.. 
ఒకటి...మన రాజగోపాల్ గారు సీతాలు అసలు పేరు ఏమిటని..? అది మరిచి పోయారని... కానీ కథ చివరలో ఆమె పేరు  "జాహ్నవి" అని ఒకచోట చెప్పారు.   
రెండవది... కథలో ఒకసారి కమల్ ఒక గెస్ట్ హౌస్ ను కట్టించమని సాగర్ కు చెక్కు ఇస్తాడు  ఈ అడవిలో బంగళా ఎందుకని అనుకున్నా...కానీ ఆ కొత్త జంటల హనిమూన్  కోసమని నాకు ఆ తర్వాత అర్థమైంది.   
మూడవది... పెంపుడు కూతురు సీతాలును గుర్తుపట్టడం ఎలా అనుకున్నా...?  దానికి తండ్రి భానోజీ ఆమె కాళ్ల పట్టీలు మెడలో చైను భద్రంగా దాచిపెట్టానని సాగర్ తో చెబుతాడు... 
కథ చివరిలో కమల్ సీతాలును కలిసినప్పుడు తన చిట్టి చెల్లి"జాహ్నవి" కాళ్ళకు పట్టీలు మెడలో గొలుసు పెట్టుకొని ఉన్న పోటోచూపించడంతో  
నా ధర్మ సందేహం తీరిపోయింది...  
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రాజగోపాల్  గారు...ఎంత పకడ్బందీగా...  ఎంత అధ్భుతంగా...ఎంత చాకచక్యంగా
పాఠకులు ఊహించని  గొప్ప ఉత్కంఠ
భరితమైన మలుపులతో అందమైన కథలను...ఆ వాల్మీకి ఆశ్రమంలో కూర్చొని క్షణం తీరిక లేకుండా ఎలా అల్లారో చెప్పడానికే...  
చివరిగా...ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పల్లోలి శేఖర్ బాబు గారు... డాక్టర్ వీ.డి రాజ గోపాల్ గారి సాహిత్యమెంత సుందరమో సుమధురమో తన కవితలో ఇలా శ్లాఘించారు... రాజగోపాల్ గారి కవిత్వం...ఒక నయాగరా జలపాతమని... పరవళ్ళు తొక్కుతు ప్రవహిస్తుందని... అందరినీ ఆలోచింపజేస్తుందని... అది పట్టువస్త్రంలా... చిలకమ్మ పలుకులా...  నెమలి నాట్యంలా...కోకిల పాటలా... బాపుగారి బొమ్మలా...సురభి నాటకంలా... బంగినపల్లి మామిడిపండులా... గలగలా గోదారి పరుగులా... పుట్ట తేనెలా మధురంగా..ఉంటుందన్నారు 
నిజానికి అంతకు మించి.  
కవితలే ప్రపంచమనుకునే నాచే ఇలా సమీక్ష చేయించడం నాకు ఒక పరీక్ష లాంటిదే ఇందులో మంచి మార్కులే వచ్చాయని ఆశిస్తూ నాకు ఈ చక్కని అవకాశాన్ని  కల్పించిన డాక్టర్ వి డి రాజగోపాల్ గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ... వారి శేష జీవితం...  మూడుపువ్వులు  ఆరుకాయలుగా కాక... ఆరు కవి సమ్మేళనాలు...అరవై కథా సంకలనాలుగా...వృద్దిచెందాలని... 
ఆ "సాయినాధుని ఆశిస్సులు" 
వారిపై వారి కుటుంబ సభ్యులపై 
"కుంభవర్షమై" కురవాలని... 
మనస్పూర్తిగా కోరుకుంటూ శెలవ్...


కామెంట్‌లు