గర్వభంగం : సరికొండ శ్రీనివాసరాజు

 ఒక అడవిలో అందమైన కుందేలు ఉండేది. దాని అందానికి ముగ్ధులై చాలా జీవులు కుందేలును పలకరించేవి. ఆప్యాయంగా మాట్లాడేవి. "నీ అందం ఈ అడవిలో ఏ జీవికీ ఉండదు. నువ్వు ఈ అడవిని పరిపాలిస్తే ఎంత బాగుంటుంది?" అన్నది ఓ గుర్రం. "అడవిలో అందాల పోటీ జరిపితే బాగుండు. మా అందరి ఓట్లూ నీకే." అన్నది ఒక జింక. "నీ వంటి అందమైన జీవులు నడువకూడదు. మేం ఉన్నాం కదా! మోసుకుని పోతాం." అన్నది ఏనుగు. ఈ మాటలతో కుందేలు గర్వం మామూలుగా పెరగలేదు. కొన్ని జీవులు అందంగా లేవని వాటితో మాట్లాడటం లేదు. అవి కనిపిస్తే ముఖం తిప్పుకుని వెళ్తుంది కుందేలు.
       ఆ అడవిలోకి ఒక జింక కొత్తగా ప్రవేశించింది. అది అంత అందంగా లేదు. పైగా నల్లగా ఉంది. కానీ అది కనిపించిన ప్రతి జీవినీ పరిచయం చేసుకుని స్నేహ పూర్వకంగా మాట్లాడుతుంది. చిన్నా పెద్దా జీవులకు ఏమైనా సహాయం కావాలన్నా చేస్తుంది. ఆరోగ్యం బాగా లేక ఓపిక లేక పడుకున్న జీవులకు ఆహారాన్ని తెచ్చి ఇస్తుంది. వైద్య సహాయం కూడా చేస్తుంది. కొద్ది రోజులలోనే అడవిలో దాదాపు అన్ని జీవులకు జింక ప్రాణం అయింది. 
     కుందేలుకు కూడా ఈ జింక ఎదురైంది. జింక కుందేలును పలకరించబోగా కుందేలు ముఖం తిప్పుకుంది. పక్కన పోతున్న నెమలితో ఇలా అంది. "అందంలో రాణిని అయిన నేను ఇలాంటి నీచ జంతువులతో మాట్లాడను అని చెప్పు." అన్నది. ఈ వార్త దావానలంలా అడవి అంతా వ్యాపించింది. అక్కడకు చాలా జీవులు చేరుకున్నాయి. "ఛీ! అందం అంటే రూపానికి సంబంధించినది కాదు. ఇన్నాళ్ళూ అందంగా ఉన్న నిన్ను చూసి అనవసరంగా స్నేహం చేశాము. నిజమైన అందం గుణంలో ఉంటుంది. మా ఈ జింక అందం ముందు నువ్వు ఎందుకూ పనికిరావు. ఇకపై ఈ అడవిలో ఏ జీవీ నీతో మాట్లాడదు." అన్నది రామచిలుక. మిగిలినవి అన్నీ అవునని అన్నాయి. కుందేలుకు గర్వభంగం అయింది.

కామెంట్‌లు