కిలకిల నవ్వుల కలకలమే
కళ కళ లాడే సుమవనమే
తెలతెల వారే సమయమే
మిలమిల మెరిసే ఇలాతలమే!
వేలపూల నవ్వులలో
వేచి చూచిన వేడుకగా
వెలుగుపువ్వు విరిసే వేళ
వెల్లివిరిసె సంతసమే!
సుమనేత్రాల తోటతల్లి
రవి రాకకు ప్రణమిల్లి
సడిలేని సంతోషాలను
సుమగంధమై వెదజల్లె!
బంగరు రంగుల వంపి
నింగిని సొగసున నింపి
పొంగిన ప్రేమను పంపి
ముంగిట నిలిచెను తరణి
ప్రాగ్దిశ వాకిట నిలిచిన
ప్రభాకర బింబపు తేజము
ప్రభాసమున నింపె జగతిని
పసిడి కళలు పొంగారగా!
ప్రతి ఉదయమొక పండుగ
ప్రతి ఎదను వేడుక నిండగా
ప్రతి క్షణము మారె వింతగా
ప్రతి మనసు కన్న కలలు పండగా
ప్రభవించు ప్రభువుకు ప్రణామములతో

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి