సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-917
తైల పాత్ర ధర న్యాయము
*****
తైల పాత్ర అనగా నూనె కుండ . పాత్ర ధర అనగా పాత్రను ధరించిన అని అర్థము.
నూనె కుండను మోయు వాని వలె అనగా "నూనె కుండను నెత్తిమీద పెట్టుకొని పోయేవాడు చాలా జాగ్రత్తగా దాని మీదే మనసు పెట్టి ఏకాగ్రతతో నూనె తొణికిపోకుండా అడుగులో అడుగులు వేస్తూ పోతుంటాడు " అలాగే మనిషి ఎప్పుడు ఏ క్షణాన ఈ దేహాన్ని చాలిస్తామో తెలియదు కాబట్టి జీవితాన్ని ప్రతి క్షణం వ్రత నిష్ఠతో గడపాలి అనే అర్థంతో మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి సంబంధించిన మొత్తం శ్లోకాన్ని చూద్దాం.
"తైల పాత్ర ధరో యద్వ దసిహస్తై రధిష్ఠితః/స్ఖలితే మరణ త్రాసా త్తత్పర స్స్యాత్తథా వ్రతీ!!"
అనగా పాదం మరియు కాలు కదలికతో తొట్రుపడటం వల్ల తల మీద ఉన్న నూనె కుండ ఒలికి పోతుంది. అలా ఒలకడం వల్ల తన యజమాని యొక్క  శిక్షకు గురి అవడము వల్ల ప్రాణాపాయము సంభవించును.ఆ విధంగా భయముచేత నూనె కుండను మోయు వాని వలె వ్యక్తి వ్రత నిష్ఠా తత్పరుడై ఉండవలెను అని భావము.
అనగా ఎల్లప్పుడూ తదేక నిష్ఠతో ఉండాలి. ఈ తదేక నిష్ఠను అవధానం అని కూడా అంటారు.అవధానమంటేనే ఏకాగ్రత,తదేక నిష్ఠ అని  మనకు అర్థము  అవుతుంది. అవధాన ప్రక్రియ ఎలాంటిదో నూనె కుండను నెత్తిమీద పెట్టుకొని మోస్తూ వెళ్ళడం కూడా అలాంటిదే. అందుకే దీనిని అవధానంతో పోల్చారు.
 మరి అవధానము అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది తెలుగు వారికే సొంతమైన అపురూపమైన విజ్ఞాన,భాషా వినోద ప్రక్రియ.అవధానం అంటే మనసును హెచ్చరిస్తూ ఏకాగ్రతను కలిగి వుండటం. ఈ ప్రక్రియకు సంబంధించిన విషయాన్ని మనసులో ధారణ చేసి, అలా ధారణ చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకొని, అవసరమైనప్పుడు అడిగిన వారికి అప్పగించడం అన్నమాట.
అవధానం సాధారణంగా కవిత్వం , శాస్త్రాలు, ధార్మిక అంశాలు, సామాన్య సూత్రాలు వంటి వివిధ అంశాలను కవిత్వంగా ప్రదర్శించడంలో, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో కవి యొక్క ప్రతిభా నైపుణ్యం బయట పడుతుంది.
 ఇది కవి యొక్క మేథో సంపద ఎంత ఉందో, అతని సాహిత్య శ్రద్ధా సామర్థ్యాన్ని తెలుసుకునే విశిష్ట ప్రక్రియ.అలా కేవలం ఒక వ్యక్తి అడిగే అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కాకుండా ఒకే సమయంలో అనేక మంది అనేక అంశాలపై అడిగే ప్రశ్నలకు ఎవరు ఏ ప్రశ్న అడిగారో గుర్తు పెట్ఠుకుని సరైన సమాధానం ఇవ్వడం.ఇందులోనే కవి తన జ్ఞానాన్ని, శ్రద్ధను, జ్ఞాపక శక్తిని,ప్రతి స్పందన సామర్థ్యాన్ని చూపుతాడు.
ఈ అవధాన ప్రక్రియలో  అష్టావధానం, శతావధానం,సహస్రావధానం ముఖ్యమైనవి.
తెలుగు సాహిత్యంలో నాటి కందుకూరి వీరేశలింగం, తెనాలి రామకృష్ణ, శ్రీనాథుడు, కొప్పరపు సోదర కవులు. నేటి కాలంలో గరికపాటి నరసింహారావు, మాడుగుల నాగ ఫణి శర్మ, మేడసాని మోహన్, గండ్ర లక్ష్మణ రావు గారి లాంటి ఎందరో అవధాన కవులు ఈ ప్రక్రియకు వన్నె చేకూరుస్తూ,ఈ ప్రక్రియ గొప్పతనాన్ని సాహితీ లోకానికి చాటుతున్నారు.
 అయితే ఇదంతా సాహితీ లోకానికి సంబంధించిన విషయము. మరి మనిషి జీవిత పరమార్థం ఏమిటి?లోకము నందు జీవన ప్రయాణం కొనసాగేటప్పుడు తదేక నిష్ఠతో పాటు ఇంకెలాంటి నిష్ఠలు  అనుసరించాలో మరియు ఆచరించాలో మనమిప్పుడు తెలుసుకుందాం.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు   అర్జునుడితో ఇలా అంటాడు.
"శ్రీ భగవానువాచ లోకేస్మిన్ద్వివిధా నిష్ఠగా,పురా ప్రోక్తా మయానఘ/జ్ఞాన యోగేన సాజ్ఖ్యానాం(జ్),కర్మ యోగేన యోగినామ్!!"
అనగా ఓ పాప రహితుడైన అర్జునా! ఈ లోకంలో రెండు విధములైన నిష్ఠలు వున్నాయి.తత్వ విచారణా పరులైన సాంఖ్య యోగులకు జ్ఞాన యోగము ద్వారా,జ్ఞాన యోగులకు కర్మ యోగము ద్వారా నిష్ఠ కలుగుతుంది" అని అంటాడు. 
సాంఖ్య యోగా అనేది జ్ఞానము, స్వీయ సాక్షాత్కారం మరియు వాస్తవిక స్వభావాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని సూచిస్తుంది.
అలాగే జ్ఞాన యోగ అనేది నేను ఎవరు? నేను ఏమిటి?అనే ప్రశ్నల జ్ఞానాన్ని వెంబడించే ఆధ్యాత్మిక సాధన ద్వారా స్వీయ సాక్షాత్కారం పొందడం గురించి చెబుతుంది.
 ఈ విధంగా తదేక నిష్ఠతో పాటు సాంఖ్య యోగము,జ్ఞాన యోగము లాంటి రెండు నిష్ఠలను కూడా కలుపుకుని జీవితమనే నూనెకుండ  తొణికి పోకుండా జీవితాన్ని  ఆఖరి క్షణం వరకు గడపాలనే అంతరార్థం ఇందులో యిమిడి ఉంది.
కాబట్టి మనమూ నూనె కుండ లాంటి జీవితాన్ని తలపైకెత్తుకుని అటూ ఇటూ ఇంద్రియాలు, అరిషడ్వర్గాల వైపు ఒలకకుండా ఏకాగ్రత, తదేక నిష్ఠతో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఆత్మ సాక్షాత్కారం పొందేందుకు ప్రయత్నం చేద్దాం.

కామెంట్‌లు