చిన్న నష్టం - పెద్ద లాభం :----డా.పోతగాని సత్యనారాయణ
 ధర్మయ్య అనే మేకల కాపరి తన నూటయాభై మేకలతో జీవనం సాగించేవాడు. అవి అతని కుటుంబానికి ఆధారం కాబట్టి, వాటిని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. 
ప్రతిరోజూ వాటిని అడవి అంచున ఉన్న పచ్చిక బయళ్ళలోకి తోలుకుపోయి మేపుతూ ఉండేవాడు. అతనికి తోడుగా ఎప్పుడూ మూడు నమ్మకమైన పెంపుడు కుక్కలు ఉండేవి. అవి మేకల మందకు కాపలాగా ఉండేవి.
ఒకరోజు మధ్యాహ్నం, ఎండ తీవ్రతకు అలసిపోయి ధర్మయ్య ఒక పెద్ద మర్రిచెట్టు కింద నిద్రపోయాడు. అదే సమయంలో ఒక పెద్ద పులి పొదల వెనుక నుండి నక్కి నక్కి వచ్చి, నిద్రపోతున్న ధర్మయ్య వైపు కదిలింది. పులిని గమనించిన కుక్కలు వెంటనే గట్టిగా మొరగడం మొదలుపెట్టాయి. అంతేకాకుండా పులి వైపు దూసుకొచ్చాయి. కుక్కల అరుపులు విని, వాటిని చూసి పులి చప్పున వెనక్కి తిరిగింది.
అదే సమయంలో, ధర్మయ్య కుక్కల అరుపులకు ఉలిక్కిపడి నిద్రలేచాడు. కళ్ళు తెరిచి చూసేసరికి, పులి దగ్గరలో మేత మేస్తున్న మందలోని అత్యంత బలమైన మేకపోతును పట్టుకుని పారిపోవడం కనిపించింది. 
ఈ దృశ్యాన్ని దూరం నుండి చూస్తున్న తోటి మేకల కాపరులు భయంతో కేకలు వేస్తూ ఊరిలోకి పారిపోయారు.
ధర్మయ్య వణికిపోయాడు. తాను ఒక మేకపోతును కోల్పోయినందుకు చాలా బాధపడుతూ ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రంతా నిద్రపట్టక, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ దుఃఖించాడు.
మరుసటి రోజు ఉదయం, ధర్మయ్య బాధగా కూర్చుని ఉండగా, ఊరి పెద్ద అతని ఇంటికి వచ్చాడు. 
"ధర్మయ్యా! నిన్న అడవిలో జరిగినదంతా మిగతా మేకల కాపరులు చెప్పారు. నీ ప్రాణానికి పెద్ద ప్రమాదం తప్పిందని విన్నాం. నువ్వు మేకపోతును కోల్పోయినందుకు బాధపడుతున్నావు గానీ, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. పులి నిన్నే పట్టుకుపోయి ఉంటే... ఎంత పెద్ద అనర్థం జరిగేది? నీ కుటుంబం అనాథగా మారేది కాదా?" అని వివరించాడు.
గ్రామ పెద్ద మాటలకు ధర్మయ్యకు కనువిప్పు కలిగింది. 
"ఆ మేకపోతు పోయినా నీ ప్రాణాలు దక్కాయి. నీ కుటుంబం క్షేమంగా ఉంది. అందుకు నువ్వు సంతోషించాలి. గుర్తుంచుకో, అప్పుడప్పుడు నష్టపోవడం కూడా గొప్ప మేలే చేస్తుంది. కొన్నిసార్లు చిన్న నష్టం మనకు తెలియకుండానే పెద్ద ప్రమాదాల నుండి మనల్ని కాపాడుతుంది" 
అని గ్రామ పెద్ద ధర్మయ్యకు మంచి మాటలు చెప్పాడు.
ధర్మయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గ్రామ పెద్ద చెప్పిన మాటల వెనుక ఉన్న నిజం అతనికి పూర్తిగా అర్థమైంది. తాను కేవలం ఒక మేకపోతును కోల్పోయానని బాధపడ్డాడు కానీ, పులి తనను వదిలి మేకపోతును పట్టుకెళ్లడం తన అదృష్టమని, తన ప్రాణం దక్కిందని గ్రహించాడు. ఆ నమ్మకమైన కుక్కలు సరైన సమయానికి అరిచి, పులి దృష్టిని మళ్లించడం వల్ల తాను ప్రాణాపాయం నుండి బయటపడ్డానని తెలుసుకున్నాడు.
ఆ రోజు నుండి ధర్మయ్య చిన్న నష్టాలను చూసి ఎప్పుడూ బాధపడలేదు. నష్టం వెనుక ఏదో ఒక గొప్ప మంచి దాగి ఉంటుందని బలంగా నమ్మాడు. తన మిగిలిన మేకలను మరింత జాగ్రత్తగా చూసుకుంటూ, తన నమ్మకమైన కుక్కలను ఎప్పుడూ తన పక్కనే ఉంచుకునేవాడు.

కామెంట్‌లు