మంచి అలవాటు: సరికొండ శ్రీనివాసరాజు
 ప్రాథమిక పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేరినారు విద్యార్థులు. వారం పది రోజులు గడిచాయి. విద్యార్థులు పూర్తి సంఖ్యలో బడికి వచ్చినారు.  ఆరోజు తెలుగు ఉపాధ్యాయులు తిరుమలేశం గారు విద్యార్థులను ఒక ప్రశ్న అడిగారు.  "మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? పేరు మాత్రమే చెప్పవద్దు. ఎందుకు బెస్ట్ ఫ్రెండో కారణం కూడా చెప్పాలి." అని. 
     "నా బెస్ట్ ఫ్రెండ్ వాసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ మేమిద్దరం చాలా ఆటలు ఆడుకున్నాము. మేము ఆడుకున్న ఆటలకు లెక్క లేదు." అన్నాడు రాము. "నా బెస్ట్ ఫ్రెండు నా చెల్లెలు స్రవంతి. చిన్నప్పటి నుంచీ నేను చెడు సహవాసాలతో ఆటలకు మరిగి చదువును నిర్లక్ష్యం చేసినాను.  నా చెల్లెలు స్రవంతి వాళ్ల క్లాస్ ఫస్ట్.  నా చెల్లెలు నన్ను బతిమాలి, మంచి మాటలతో నన్ను పూర్తిగా చదువు వైపు మళ్ళించింది. ఇప్పుడు నేను తెలివైన విద్యార్థిని." అన్నాడు సోము. 
      "నా బెస్ట్ ఫ్రెండ్ రంగ. ఎప్పుడూ నా కోసం టైం కేటాయించి, నాతో క్రికెట్ ఆడేవాడు.  మేమిద్దరం కలిసి ఎన్ని ఆటలు ఆడినామో లెక్క లేదు." అన్నాడు మోహన్. "నా బెస్ట్ ఫ్రెండ్ అనిల్. ఎప్పుడూ మేము ఇద్దరం మొబైల్ ఫోన్లో రకరకాల గేమ్స్ ఆడుతాం." అన్నాడు రాఘవ.  "నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీను. ఇద్దరం చిన్నప్పటి నుంచీ లెక్క లేనన్ని ఆటలు ఆడినాము.  చదువులో ఎప్పుడూ పోటీ పెట్టుకుంటాం." అన్నది వాణి. 
     "నేను తీరిక సమయాల్లో మిత్రులతో రకరకాల ఆటలు ఆడుతాను. కొత్త ఆటలు కూడా కనిపెట్టి ఆడుతాను. సెల్ ఫోన్లు, టీవీలకు పూర్తిగా దూరం. కథల పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. చిన్నప్పటి నుంచీ నా తీరిక సమయాన్ని ఎక్కువగా కథలు చదవడానికే కేటాయించాను. నా స్నేహితులకు కూడా కథలు చదివించడం అలవాటు చేశా. కథా పుస్తకాలు నా బెస్ట్ ఫ్రెండ్స్." అన్నది శ్రావణి.  "శభాష్ శ్రావణి.  సెల్ ఫోన్లు, టీవీలే లోకం అ అన్న తీరున ఉన్నారు చాలామంది. నీ కథా పఠన అభిరుచి చాలా గొప్ప అభిరుచి. నీ స్నేహితులకు కూడా ఆ అభిరుచి పెంచడం ఎంత ప్రశంసించినా తక్కువే. మన క్లాసులో అందరికీ ఈ కథా పఠనాన్ని అలవాటు చేయి." అన్నాడు ఉపాధ్యాయుడు. మరునాడు ఆ ఉపాధ్యాయుడు ఎన్నో కథల పుస్తకాలను తెచ్చి శ్రావణికి బహుమతిగా ఇచ్చాడు. 

కామెంట్‌లు