సొంత సంపాదన:----డా.పోతగాని సత్యనారాయణ,

 పచ్చని గొడుగు విచ్చుకున్నట్టు విశాలంగా వున్న చింత చెట్టుపైన రకరకాల పక్షులు, ఉడుతలు గూళ్ళుకట్టుకొని వాటి సంతానాన్ని పెంచుకోసాగాయి. పక్షులు పంటపొలాల నుండి ధాన్యపుగింజల్ని తెచ్చి పిల్లలకు తినిపించేవి. ఉడుతలు ఆహారాన్ని వెతుక్కుంటూ రకరకాల పండ్లను, గింజల్ని తిని చీకటిపడే వేళకు గూటికి చేరుకునేవి. ఒకరోజు ఉడుతలకు మేతదొరక్క చాలాదూరం వెళ్ళవలసివచ్చింది. తల్లితోపాటు మేతకు వెళ్ళిన ఉడుత పిల్ల అలసిపోయింది. సాయంత్రం వేళకు నెమ్మదిగా ఎగురుకుంటూ తల్లితోపాటు గూటికి చేరింది.
తెల్లవారగానే ఉడుతలన్నీ మేతకు బయలుదేరాయి. ఉడుతపిల్ల నీరసంగా వుండటం చూచి తల్లి బాధపడింది. 
"ఈ రోజుకి విశ్రాంతి తీసుకో బిడ్డా!. నీకోసం ఎంతదూరమైనా వెళ్ళి. నీకు ఇష్టమైన గింజలు తెచ్చిపెడతాను. కడుపునిండా తిందువుగాని. "అంటూ బుజ్జగించి మేతకు బయలుదేరింది.
ఉడుతపిల్ల గూటిలో ముడుచుకొని నిద్రపోయింది. కొంతసేపటికి నిశ్శబ్దంగావున్న ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కోలాహలంగా మారింది. ఒంటరిగా ఉన్న ఉడుతపిల్ల ఉలికిపడి నిద్రలేచింది. భయంతో బయటకు తొంగిచూచింది. గుంపులు గుంపులుగా వస్తున్న పక్షుల్ని చూచి గూళ్ళలోని పక్షిపిల్లలు నోళ్ళు తెరచి అరుస్తున్నాయి. పంటపొలాల నుండి తెచ్చిన గింజల్ని తల్లిపక్షులు పిల్లలనోట్లో వేసి తినిపిస్తున్నాయి.ఆ సమయంలో కొన్నిగింజలు పిల్లల నోటినుండి జారి కిందపడుతున్నాయి.
ఈ సంగతి గమనిస్తున్న ఉడుతపిల్లకు ఒక ఉపాయం తట్టింది. కష్టపడకుండా కడుపునింపుకునే అవకాశం దొరికిందని సంబరపడింది. రెప్పపాటులో గూటినుండి బయటకువచ్చి చెట్టుకిందకు చేరింది. తలపైకెత్తి చూస్తే ధాన్యపుగింజల వర్షం కరుస్తున్నట్లనిపించింది. దొరికిన గింజను దొరికినట్టు నోట్లోవేసుకొని ఆకలి తీర్చుకుంది. ఈ విషయాన్ని తన తల్లికి కూడా చెప్పకుండా రహస్యంగా వుంచాలని నిర్ణయించుకుంది. తల్లి వచ్చే వేళకు గూటిలోకి చేరి బాధ నటిస్తూ మూలగసాగింది. గూటికి చేరిన తల్లి ఉడుత బిడ్డబాధను చూచి తల్లడిల్లిపోయింది. 
"ఇదిగో బిడ్డా! నీకోసం రుచికరమైన గింజలు తెచ్చాను తిను "అంటూ ఆప్యాయంగా తినిపించింది.
తల్లితెచ్చిన గింజల్నితిని ఉడుతపిల్ల హాయిగా నిద్రపోయింది. ప్రతిరోజూ ఏదో ఒక రోగంపేరు చెప్పి మేతకువెళ్ళడం మానేసింది ఉడుతపిల్ల. చెట్టుకింద రాలిపడిన గింజల్నే కాక తల్లితెచ్చిన గింజల్ని కూడా తింటూ కాలం గడపసాగింది. నెలలు గడిచి పోతున్నా బిడ్డ మేతకు రాకపోవడంతో తల్లికి ఆహార సంపాదన కష్టంగా మారింది. రోజుకో రోగం పేరుచెప్పి తప్పంచుకుంటున్ను ఉడుతపిల్ల మాటలపై సందేహం కలిగింది. ఉడుత పిల్లను దూరం నుండి గమనించడం మొదలు పెట్టింది.
ఒకరోజు రాలిన గింజల్ని తింటుండగా అక్కడికి ఒక కుందేలు గెంతుకుంటూ వచ్చింది. అంత పెద్ద శరీరాన్ని చూచి ఉడుతపిల్ల భయపడింది. 
"ఎవరు మీరు "అంటూ వణికిపోతూ అడిగింది. 
"ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఉడుతలన్నీ మేతకు వెళితే, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావ్."అంటూ బెదిరించింది కుందేలు."...
"ఆరోగ్యం బాగాలేక మేతకు వెళ్ళలేకపోయాను. ఇదిగో ఈ చెట్టుకింద రాలిన గింజల్నితిని ఆకలి తీర్చుకుంటున్నాను." అంటూ దీనంగా బదులిచ్చింది ఉడుతపిల్ల.
 
"ఛీ..ఛీ..సోమరిపోతా! అబద్ధం చెప్పకు కష్టపడకుండా వచ్చిన ఎంగిలి గింజలు తిని ఒళ్ళు పెంచుకుంటున్నావ్. తోటివాళ్ళు కష్టపడి ఆహారం సంపాదించుకుంటుంటే రోగం పేరుతో ఒళ్ళుదాచుకుంటావా? పని చేయగలిగే శక్తి వుండి, ఇతరులపై ఆధారపడటం మన జంతు జాతికే అవమానం" అంటూ కోపంతో ఊగిపోయింది కుందేలు.
మీరు పెద్దవారు నిజం తెలుసుకోకుండా నిందలు వేయడం మీకు తగునా?" అంటూ ఏడవసాగింది ఉడుతపిల్ల." 
"పెద్దదాన్ని గనుకనే బుద్ధి చెప్పడానికి వచ్చాను. చేసిందంతా చేసి మొసలి కన్నీరు కారుస్తావెందుకు? అసలు విషయం చెబుతా విను" అంటూ ఉడుత పిల్లను దగ్గరకు తీసుకుంది కుందేలు.
" మీ అమ్మ నాకు మంచి స్నేహితురాలు. దారిలో కలిసి నీ గురించి చెప్పింది. ఒకరోజు మేతకు వెళ్ళివస్తూ గింజలు మేసి, లేని రోగాన్ని నటిస్తున్న నీ మోసాన్ని గ్రహించి బాధ పడిందట. బిడ్డను పోషించడం కష్టం కాకపోయినా  తల్లికి భారంగా మారి , బాధ్యతల్ని మరిచిపోకూడదు కదా! నేరుగా నిన్నే అడగాలనుకున్నా, నిన్ను చిన్నబుచ్చటం ఇష్టంలేక అడగలేక పోయిందట. అదీ తల్లి మనసంటే ఇప్పటికైనా అర్థమైందా?" అంటూ వివరించింది.
ఆ మాటలు విన్న ఉడుతపిల్ల సిగ్గుతో తలదించుకుంది. తనవల్ల తల్లికి కలిగిన కష్టాన్ని తలచుకొని బాధ పడింది.
"ఇప్పుడు బాధపడి ఏం లాభం? ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఈ చింత చెట్టుకూడా ఎండిపోవడం మొదలైంది. పక్షులన్నీ గూళ్ళను వదిలి వలస పోవడం ప్రారంభించాయి. నేడో రేపో ఈ గింజలు కూడా కరువై పోతాయి. నీకు ఆహారం కోసం వెతుకులాట తప్పదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఆహారం సంపాదించడం అలవాటు చేసుకో" అంటూ అసలు విషయం చెప్పి ముందుకు నడిచింది కుందేలు.
తప్పు తెలుసుకున్న ఉడుతపిల్ల, తల్లి గూటికి రాగానే క్షమాపణ వేడుకుంది. అప్పటినుండి తల్లితో పాటు మేతకు వెళ్ళడం మొదలు పెట్టింది. ఇతరులపై ఆధారపడటం మానేసి, సొంతంగా ఆహారాన్ని సంపాదించటం అలవాటు చేసుకుంది. కష్టపడి పనిచేయటంలో వున్న ఆనందాన్ని తిరిగి పొందగలిగింది.

కామెంట్‌లు