ఒకూర్లో ఒక పిల్లోడున్నాడు. వాడు చిన్నోడైనా చానా చానా మంచోడు. ఒకరోజు వాళ్ళమ్మ వానికో వందరూపాయలు ఇచ్చి “బియ్యం తీసుకురా" అని బజారుకి పంపిచ్చింది. "సరే" అని వాడు సంచి తీసుకోని పోతావుంటే దారిలో ఒకచోట ఒక పాములోడు ఒక చిన్న పాముపిల్లను పట్టుకోని చిన్న కట్టెతో కొడతా కనబన్నాడు.
అది చూసి ఆ పిల్లోడు అయ్యో పాపమని జాలిపడి వురుక్కుంటా వాని దగ్గరికి పోయి “ఎందుకట్లా చిన్నపిల్లని పట్టుకోని కొడతా వున్నావ్" అనడిగినాడు. దానికి వాడు కోపంగా “ఏం చేయమంటావ్? నాగస్వరం ఎంత ఊదినా ఇది ఆట ఆడ్డం లేదు. నాకు డబ్బులు రావడం లేదు. అందుకే కొడతా వున్నా" అని చెప్పినాడు.
దాన్ని ఎట్లా తప్పించాలబ్బా అని ఆలోచిస్తా వుంటే ఆ పిల్లోనికి వాళ్ళమ్మ ఇచ్చిన డబ్బులు గుర్తు కొచ్చినాయి. దాంతో “నా దగ్గర వంద రూపాయలున్నాయి. అవి తీసుకోని దీన్ని విడిచి పెడతావా" అనడిగినాడు. వాడు “సరే” అన్నాడు. వెంటనే ఆ పిల్లోడు వానికి వందరూపాయలిచ్చేసి ఆ పాముపిల్లను తీసుకోని సంబరంగా ఎగురుకుంటా ఇంటికి వచ్చేసినాడు.
బియ్యానికని పోయి పాముపిల్లని తెచ్చేసరికి వాళ్ళమ్మకు చానా కోపమొచ్చింది. దాంతో బాగా తిట్టి “ఈసారి అటూఇటూ చూడకుండా సక్కగ పోయి సక్కగ రా” అంటా మల్లా వందరూపాయలిచ్చి బియ్యానికి పంపిచ్చింది. వాడు "సరే" అని పోతావుంటే దారిలో ఒకచోట ఒకడు ఒక చిన్న పిల్లిపిల్లను పట్టుకోని కొడతా కనబన్నాడు. అది చూసి ఆ పిల్లోడు అయ్యో పాపమని జాలిపడి వురుక్కుంటా వాని దగ్గరకు పోయి “ఎందుకట్లా చిన్నపిల్లని పట్టుకోని కొడతా వున్నావ్" అనడిగినాడు.
దానికి వాడు కోపంగా “ఈ దొంగ సచ్చినేది మా ఇంట్లోకి జొరబడి గిన్నెలోని పాలన్నీ నున్నగా తాగేసింది. అందుకే పట్టుకోని కొడతా వున్నా” అని చెప్పినాడు.
దాన్ని ఎట్లా తప్పించాలబ్బా అని ఆలోచిస్తా వుంటే ఆ పిల్లోనికి వాళ్ళమ్మ ఇచ్చిన వంద రూపాయలు గుర్తుకొచ్చినాయి. దాంతో “నా దగ్గర వంద రూపాయలున్నాయి. అవి తీసుకోని దాన్ని విడిచిపెడతావా" అనడిగినాడు. వాడు 'సరే' అన్నాడు. ఆ పిల్లోడు వానికి వందరూపాయలిచ్చేసి ఆ పిల్లిపిల్లను తీసుకోని సంబరంగా ఎగురుకుంటా ఇంటికి వచ్చేసినాడు. బియ్యానికనిపోయి ఈసారి పిల్లిపిల్లను తెచ్చేసరికి వాళ్ళమ్మకు చానా కోపమొచ్చేసింది. దాంతో వాన్ని బాగా తిట్టి "ఇంగ నా వద్ద డబ్బుల్లేవు. ఇవే ఆఖరి వంద రూపాయలు. బియ్యం తేకపోతే తినడానికి తిండి గూడా వుండదు. జాగ్రత్త" అని హెచ్చరించి మరలా వంద రూపాయలు ఇచ్చి పంపిచ్చింది. వాడు "సరే" అని పోతావుంటే దారిలో ఒకచోట ఒకడు ఒక చిన్న కుక్కపిల్లని పట్టుకోని కొడతా కనబన్నాడు.
అది చూసి ఆ పిల్లోడు అయ్యోపాపమని జాలిపడి వురుక్కుంటా వాని దగ్గరికి పోయి "ఎందుకట్లా చిన్నపిల్లని పట్టుకోని కొడతా వున్నావ్" అనడిగినాడు. దానికి వాడు కోపంగా “ఈ దొంగసచ్చినేది మా ఇంట్లో జొరబడి మా కోసం వండుకున్న అన్నమంతా నున్నగా తినేసింది. అందుకే కొడతా వున్నా" అని చెప్పినాడు.
దాన్ని ఎట్లా తప్పించాలబ్బా అని ఆలోచిస్తా వుంటే ఆ పిల్లోనికి వాళ్ళమ్మ ఇచ్చిన వంద రూపాయలు గుర్తుకొచ్చినాయి. దాంతో "నా దగ్గర వంద రూపాయలున్నాయి. అవి తీసుకోని దాన్ని విడిచిపెడతావా" అనడిగినాడు. వాడు సరే అన్నాడు. వెంటనే ఆ పిల్లోడు వానికి వంద రూపాయలిచ్చేసి ఆ కుక్కపిల్లని తీసుకోని సంబరంగా ఇంటికి పోయినాడు.
ఈసారి గూడా బియ్యం తెమ్మంటే తేకుండా కుక్కపిల్లని తెచ్చేసరికి వాళ్ళమ్మకు తెగ కోపమొచ్చేసింది. ఆమె దగ్గర ఇంగ డబ్బుల్లేవు గదా... దాంతో ఏడుస్తా "ఇంగ నేను బియ్యమెక్కన్నించి తేవాల, అన్నమెట్లా వండాల" అని వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇంట్లో నుండి బైటకు దొబ్బేసింది.
అది చూసిన ఆ పాముపిల్ల నెమ్మదిగా వాని దగ్గరకు పోయి "మావల్లనే గదా నీకిన్ని కష్టాలు. నీ కష్టాలన్నీ తీరే ఉపాయం చెప్తా. మా నాయన నాగరాజు. ఈ అడవిలో ఒక పాడుబడిన గుడుంది. దాని పక్కనే మా ఇండ్లు. నేను బైటకొచ్చి ఆడుకుంటా వుంటే ఎక్కడినుంచి వచ్చినాడో గానీ వాడు లటుక్కున నన్ను పట్టేసుకున్నాడు. నా కోసం మా అమ్మా నాయనా ఎంత వెదుకుతా వున్నారో ఏమో... నాకు ఆ గుడి దగ్గరికి ఎట్లా పోవాలో తెలీదు. నువ్వు గనుక ఎట్లాగైనా నన్ను అక్కడికి తీసుకోనిపోతే మా నాయనకు చెప్పి నీకు కావాల్సినంత బంగారం ఇప్పిస్తా” అనింది.
కానీ వానికి గూడా అడవిలో ఏది ఎక్కడుందో తెలీదు. దాంతో ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా వుంటే కుక్కపిల్ల తోకూపుకుంటా వాని దగ్గరకొచ్చి “నాకు ఆ అడవంతా బాగా తెలుసు. నా ఎంబడొస్తే ఆ పాడుబడిన గుడి ఎక్కడుందో చూపిస్తా" అనింది. దాంతో సరే అని కుక్క ముందు దారి చూపిస్తా వుంటే పామూ, పిల్లీ, వాడు దాని వెనకాలనే బయలుదేరినారు. అట్లా ఒక ఐదారు గంటలు అడవిలో బాగా నడిచినాక ఆ గుడి కనబడింది.
పాముపిల్ల సంబరంగా పాక్కుంటా గుడి పక్కనే వున్న వాళ్ళ పుట్ట కాడికి పోయి "నాయనా! నాయనా! బైటకు రా" అంటా గట్టిగా పిలిచింది. ఆ పిలుపింటానే నాగరాజు సరసరసర పాక్కుంటా వచ్చి జరిగినదంతా తెలుసుకోని సంబరంగా వాళ్ళందరినీ నాగలోకానికి తీసుకోనిపోయినాడు. చాలుచాలన్నా వినకుండా పెట్టినేవి పెట్టకుండా రకరకాల తినుబండారాలు పెట్టినాడు. తిరిగి పోయేటపుడు వానికి ఒక బంగారు ఉంగరమిచ్చి "ఇది మామూలు అలాంటిలాంటి అల్లాటప్పా ఉంగరం కాదు. చానా చానా మహిమలున్న ఉంగరం. నువ్వేమయినా కోరుకోని దీన్ని ముద్దు పెట్టుకోడం ఆలస్యం అడిగినవన్నీ అరక్షణంలో నీ ముందుంటాయి" అని చెప్పినాడు. వాళ్ళు ఆనందంగా ఇంటికి బైలుదేరినారు.
అట్లా తిరిగి వస్తావుంటే దారిలో ఒకచోట ఒక చిన్న చెరువు కనబడింది. దాన్ని చూస్తానే వానికి దాంట్లో ఈత కొట్టాలనిపించింది. వెంటనే వాడూ, కుక్క, పిల్లీ నీళ్ళలో దిగి ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటా బాగా ఆడుకున్నారు. అట్లా ఆడుకుంటా వుంటే అనుకోకుండా వాని వేలికున్న ఉంగరం కాస్తా నీళ్ళలో జారి పడిపోయింది. ఎంత వెదికినా దొరకలేదు. దాంతో వాడు ఏడుస్తావుంటే పిల్లి “నీ ఉంగరం ఎక్కడికీ పోదులే. నేను వెదికి తెస్తా" అని చెప్పి చెరువులోనికి దూకి దొరికిన చేపను దొరికినట్టు కొరికి కొరికి పెట్టడం మొదలు పెట్టింది. పిల్లిని చూసి కుక్క కూడా అట్లాగే చేయసాగింది.
దాంతో ఆ చెరువులోని చేపలన్నీ వాటి దగ్గరకొచ్చి “మేం ఏం పాపం చేసినామని మమ్మల్నిట్లా కొరికి కొరికి పెడతా వున్నారు" అనడిగినాయి. అప్పుడా పిల్లి “ఈ చెరువులో మేం ఆడుకుంటా వుంటే మా ఉంగరమొకటి ఎక్కన్నో పడిపోయింది. దాన్ని వెదికి తెచ్చిస్తే మిమ్మల్ని ఏమీ చేయం" అనింది. సరేనని ఆ చేపలు ఆ మూల నుండి ఈ మూలకు, ఈ ములనుండి ఆ మూలకు చెరువునంతా అంగుళం గూడా వదలకుండా కిందికీ, మీదికి వెదికి ఆఖరికి ఉంగరాన్ని దొరికిచ్చుకోని తెచ్చిచ్చినాయి.
వాడు ఆనందంగా ఉంగరాన్ని వేలికి తొడుక్కోని పిల్లినీ, కుక్కనీ తీసుకోని వురుక్కుంటా వాళ్ళమ్మ దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి ఉంగరమిచ్చినాడు. అప్పట్నించీ వాళ్ళు ఆ బంగారు ఉంగరంతో కావల్సినవన్నీ తెచ్చుకుంటా హాయిగా వున్నారు.
***********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి