అనువాదంలో సహజత్వం:- యం. రాం ప్రదీప్, జెవివి సభ్యులు, తిరువూరు-9492712836

 1990 తరువాత ప్రపంచీకరణ వేగం పుంజుకుంది. మనిషి  గ్లోబల్ సిటిజన్ గా ఎదగాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడింది. శాస్తవేత్తలు జరుపుతున్న నిరంతరం పరిశోధనల వల్ల సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి.ఫలితంగా కొత్త రంగాలు అభివృద్ధి చెంది ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో సమాచార మార్పిడి పెరిగింది.యువత కూడా వివిధ ప్రాంతాల్లో స్థిర పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందడంతో వివిధ దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు పెరిగాయి.
ఒక భాషలోని భావాలు మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమవ్వాలంటే కచ్చితంగా అనువాదం అవసరం. అలా గత పదేళ్లలో అనువాదకు అవసరం ప్రపంచదేశాలకు ఎక్కువైంది. దీంతో ఎన్నో అనువాద సంస్థలు సేవలు ప్రారంభించాయి. వాటిలో ఎంతో మంది అనువాదకులు భాషకు,భాషకు మధ్య వారధిలా పనిచేస్తున్నారు. వారందరి సేవలను గుర్తిస్తూ ‘అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ప్రతిపాదించారు. ఈ దినాన్ని బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్ కు అంకితమిచ్చారు. 
ప్రపంచ అనువాదకుల పితామహుడిగా  సెయింట్ జెరోమ్ నిపిలుస్తారు.ఈయన ఇటలీకి చెందిన ప్రీస్ట్. గ్రీకు భాషలో ఉన్న బైబిల్ ను లాటిన్ భాషలోకి అనువాదం చేశారు. ఈయన సెప్టెంబర్ 30, క్రీస్తు పూర్వం 420లో బెత్లెహామ్ నగరానికి సమీపంలో మరణించారు. ఆయన జన్మించిన తేదీ ఎవరికీ తెలియదు. అందుకే ఆయన చనిపోయిన రోజునే, అతని  గౌరవార్థం అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ప్రకటించారు. 
ప్రపంచదేశాల మధ్య వారధిలా పనిచేసే అనువాద ప్రక్రియకు ఏడాదిలో ఓ రోజును కేటాయించాలని ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్ లేటర్’ అనే సంస్థ 1953లో ప్రతిపాదించింది. కానీ ఆ విషయాన్ని చాలా ఏళ్ల పాటూ ఎవరూ పట్టించుకోలేదు. గత కొన్నేళ్లు లోకలైజేషన్ భారీగా పెరిగింది. గూగుల్  వంటి సంస్థలు కూడా స్థానిక భాషల్లో తమ సేవలు మొదలుపెట్టారు. ప్రపంచంలో అనువాదకుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. దీంతో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో అనువాద దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. 
తొలిసారి అనువాద దినోత్సవాన్ని 2017, సెప్టెంబర్ 30 నిర్వహించారు. తొలుత కేవలం అజర్ బైజాన్, బంగ్లాదేశ్, బెలారస్, కోస్టారికా, క్యూబా, టర్కీ... ఇలా కొన్ని చిన్నదేశాలు మాత్రమే డ్రాఫ్ట్ రిజల్యూషన్ పై సంతకాలు చేశాయి. 2018 నుంచి అమెరికా ట్రాన్స్ లేటర్స్ అసోసియేషన్ కూడా సెపెంటర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ప్రారంభించింది. అంతేకాదు సమాచార వ్యాప్తికి, అనువాదకుల పాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాల్లో పలు కార్యక్రమాలు కూడా చేపట్టింది.
ప్రస్తుతం అనువాదకులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒక భాషలో విషయాన్ని మూల భావం మారకుండా అనువాదం చేయాలంటే ఎంతో సాధన అవసరం. ఆధునిక కాలంలో ఇంగ్లిష్ భాషతో పాటు,ఫ్రెంచ్,జర్మనీ, స్పానిష్,జపనీస్, హిందీ,రష్యన్ మరియు మాండరీన్ తదితర భాషలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ఉంది.
అనువాదకులకు కేవలం రెండూ లేదా మూడు భాషలపై పట్టు ఉంటే సరిపోదు.వివిధ భాషలు మాట్లాడే ప్రజల యొక్క చరిత్ర,సంస్కృతిపై కూడా వారికి అవగాహన ఉండాలి. అదే విధంగా వారి యొక్క సాంఘిక, ఆర్ధిక పరిస్థితులపై కూడా అవగాహన ఉంటే ఇంకా మంచిది. హైదరాబాద్ లో ఇఫ్లూ వివిధ భాషలకు సంబంధించి కోర్సులను కూడా అందిస్తుంది. 
ఈ ఏడాది అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని   "ట్రాన్స్‌లేషన్, షేపింగ్ ఎ ఫ్యూచర్ యు కెన్ ట్రస్ట్" అనే థీమ్ తో జరుపుతున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కృత్రిమ మేధ మీద ఆధార పడుతున్నారు. ఇందులో భాగంగానే అనువాదానికి కూడా అనేక యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.
యంత్ర అనువాదాలు (కృత్రిమ మేధ )పెరుగుతున్న కాలంలో మానవ నిపుణుల ప్రాముఖ్యతను, విశ్వసనీయత, సాంస్కృతిక అవగాహన, మరియు నైతికతను ఈ ఏడాది ఈ దినోత్సవం నొక్కి చెబుతుంది. మానవ అనువాదకులు యంత్ర అనువాదాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మనుషులు అనువదిస్తే సహజత్వం ఉంటుంది. యంత్ర అనువాదాల్లో సృజనత్మాకత ఉండదు. పైగా మూల రచయిత యొక్క భావాన్ని కూడా కృత్రిమ మేధ ద్వారా సరిగ్గా రాబట్టలేము.ఈ విషయంలో కృత్రిమ మేధ పై అవసరం అయినంత మేరకే ఆధార పడాలి. కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అనువాదంలో మానవ సృజనాత్మకత, సాంస్కృతిక అవగాహన  కీలక ఆలోచనలు ఎప్పటికీ కీలక మైనవేనని ఈ ఏడాది ఇతివృత్తం నొక్కి చెప్తుంది.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++



(సెప్టెంబర్ 30-అంతర్జాతీయ అనువాద దినోత్సవం )
కామెంట్‌లు