పుస్తకాలకు గౌరవం:- - యామిజాల జగదీశ్
 చదవడాన్ని పిల్లలకు ఒక పనిగా  బలవంతం చేయకూ


డదు. చదువూ చదువూ అంటూ ఒత్తిడి చేయకూడదు. అదొక బహుమతిగా ఉఝడాలని ఒకరంటే పుస్తకాలు మనుషుల్లాంటివని ఎమ్మా థాంప్సన్ అన్నారు. మీకు అవి చాలా అవసరమైనప్పుడు మీ జీవితంలోకి వస్తాయని అన్నారు ఎమ్మా. అయితే మరొక రచయిత "నేను చదవడం మొదలుపెట్టి, స్కూల్లో వాళ్ళు చదవనివ్వని పుస్తకాలు కనుగొన్న తర్వాతే, అందరిలా ఉండకుండా సంతోషంగా ఉండి, మంచి జీవితాన్ని గడపవచ్చని కనుగొన్నాను" అని చెప్పారు.
పుస్తకాలు ఒక ప్రత్యేకమైన పోర్టబుల్ మ్యాజిక్.” అని స్టీఫెన్ కింగ్ అభిప్రాయం. 
పుస్తకాలు అద్దాలు లాంటివి. వాటిలో ఇప్పటికే మీలో ఉన్న వాటిని మాత్రమే చూస్తారంటారు కార్లోస్ రూయిజ్ జాఫాన్. ఇలా పుస్తకాలు గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. పుస్తకాలతో బంధం విడదీయరానిదీ. విడదీయలేనిదీ. అంతకుమించి, ఆత్మీయమైనది. అఫ్ కోర్స్, ఇది పుస్తకాలను ప్రేమించే వారి విషయంలో అనుకోండి. 
పాత్రికేయులు, రచయితల ఇళ్ళల్లో వారి ప్రియమైనది గా చూసుకునే
పుస్తకాలకు కుటుంబ సభ్యుల నుంచి ఏ మేరకు ఆదరణ లభిస్తుందో అనేది ప్రశ్నార్థకమే. ఈ విషయమై ప్రశ్నిస్తే సదరు రచయితో పాత్రికేయుడో సున్నితమైన నవ్వుతో ఎందుకొచ్చిన గొడవని జవాబు దాట వేస్తారు. మరికొందరు మాట మార్చెస్తారు. ఇంకొందరైతే తన పుస్తకాలంటే కుటుంబ సభ్యులకు అస్సలు ఇష్టం ఉండదని సన్నిహితులతో వాపోతుంటారు. ఎక్కడో నూటికో కోటికో ఒకరిద్దరు రచయితలకు ఇంటా బయటా వారి పుస్తకాలకు ఆదరణ ఉంటుంది. అభిమానాన్నీ పొందగలరు. నా దృష్టిలో వారే అసలైన అదృష్టవంతులు. సరే గానీ విషయానికొస్తాను. 
నేను ఆ రచయితల పేర్లు ప్రస్తావించకుండా విన్న కన్న ఒకటి రెండు విషయాలను ఇక్కడ పంచుకుంటున్నాను.
ఒకరు సీనియర్ పాత్రికేయులు. రచయిత. ఆయనొక్కరే వివిధ పేర్లతో
ఓ పత్రికకు పది పన్నెండేళ్ళపాటు  పుంఖానుపుంఖాలుగా రచనలు చేశారు. ఆయన వ్యాసాలతోనే పత్రికంతా తయారయ్యేది. ఆయన మంచి చదువరికూడా. రోడ్డుపక్కన బజ్జీలమ్మేవాళ్ళు పొట్లాలు కట్టిచ్చే కాగితాలను నలిపి పారేయడం సహజం. కానీ అటువంటి కాగితాలలోనూ తెలుసుకోవలసిన విషయాలు ఏవైనా ఉంటాయేమోనని ఈయన చదివేవారు. ఒకవేళ ఉపయోగపడతాయనుకుంటే ఆ కాగితాన్ని ఇంటికి తీసుకొచ్చి దాచుకునేవారు. సందర్భానికి తగినట్లు వాటిని వినియోగించుకునే వారు. ఆయనకు పుస్తకాలంటే వల్లమాలిన ప్రేమ. అటువంటి వ్యక్తి మరణించిన మరుసటి రోజే ఇరవై  కుటుంబసభ్యులు ఆయన ప్రాణప్రదంగా చూసుకున్న పుస్తకాలను తూకానికి అమ్మేసారు‌. అమ్మయ్య చెత్తంతా వదిలిందని చేతులు దులుపుకున్నారు మహదానందంగా. ఆయన కొన్న, సేకరించిన పుస్తకాలకు అటువంటి గతి పెట్టినట్లు తెలిస్తే ఆ పాత్రికేయ రచయిత మనసు ఎంతగా బాధపడేదో పాపం.
అయితే మరొక రచయితకు ఎంత గౌరవం దక్కిందో నమ్మలేకపోతున్నాను. అది తెలిసి నా మనసు ఎంతగా ఆనందించిందో. ఆ రచయిత నిజంగా భాగ్యవంతుడే.
కొన్ని రోజుల క్రితం ఓ రచయితకు నివాళులర్పించే సభకు హాజరయ్యాను. హాల్లోకి ప్రవేశించడంతోనే కుడివైపున ఓ బల్ల ఉంచి దాని మీద ఓ అయిదారు పెట్టెల పుస్తకాలు ఉంచారు. నాకు పుస్తకాలంటే సహజంగానే ప్రేమ. దాంతో వాటి దగ్గరకు వెళ్ళి చూశాను. కొన్ని పుస్తకాలు తిరగేసాను. పుస్తకాలు కొనేంత డబ్బులు లేకపోవడంతో పేజీలు తిరగేయడంతో సరిపెట్టుకున్నాను. కార్యక్రమమంతా ముగిసిన తర్వాత హోల్ లోంచి బయటకు వచ్చే ముందర మరొక్కసారి పుస్తకాల బల్ల దగ్గరకు వెళ్ళి చూస్తుండగా ఓ ప్రముఖ రచయిత, మిత్రుడు "జగదీశ్ గారూ, మీక్కావలసిన  పుస్తకాలు తీసుకోండి. అవన్నీ ఉచితమే..." అనడం చెవిన పడింది. ఔనా అని ఆశ్చర్యపోయాను. సభకొచ్చిన వారిలో కొందరు తమకు కావల్సిన పుస్తకాలు తీసుకున్నారు. నేనూ ఓ అయిదు పుస్తకాలు తీసుకున్నాను. వాటిలో ఓ రెండు పుస్తకాలపై రచయిత సంతకాలు కూడా ఉన్నాయి. ఆ సంతకాలు కోసమే వాటిని తీసుకున్నాను. గతించిన రచయిత తాలూకు కుటుంబసభ్యులు పుస్తకాలు నలుగురికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో కార్యక్రమం రోజు ఉచితంగా అందించడం అనేది ఎంత హుందాగా ఉందో కదూ. ఎవరూ తీసుకోకపోతే వాటిని ఓ లైబ్రరీకి ఇచ్చెయ్యాలనీ నిర్ణయించుకున్నారట. ఇది మంచి సంప్రదాయం అనిపించింది. తనుండే వరకూ ప్రేమించిన ఓ రచయిత పుస్తకాలను కిలో లెక్కలో అమ్మకుండా ఇలా ఇవ్వడం అన్నది ఆయన పట్ల కుటుంబసభ్యులకున్న మర్యాదను చెప్పక చెప్తోంది. ఇటువంటి గౌరవం ఎంత మందికి దక్కుతుందో కదూ?!
కామెంట్‌లు