సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -981
మధు పశ్యసి దుర్భుద్ధే ప్రపాతం నాను పశ్యసి  న్యాయము
*****
మధు అనగా తేనె. పశ్యసి అనగా చూస్తావు, చూడండి, మీరు చూస్తున్నారు, నీవు చూస్తున్నావు.దుర్భుద్ధే అనగా చెడుబుద్ధితో, చెడు ఆలోచనలతో,చెడు లక్షణాలు గల వ్యక్తి.ప్రపాతం అనగా కింద పడటం, ఎత్తైన ప్రదేశం నుండి కిందకు పడటం, ఎత్తైన ప్రదేశం నుండి కిందకు పడే శిఖరం,కిందకు దూకే జలపాతం.నాను అనగా  ఓ వంటి సంబోధనా పదం, కాదు , లేదు, ఖచ్చితంగా. పశ్యసి అనగా చూస్తావు, చూస్తున్నావు, చూస్తాడు, చూస్తుంది అనే అర్థాలు ఉన్నాయి.
మూఢుడా!తేనెనే చూస్తున్నావు కానీ, పతనాన్ని మాత్రం గమనించడం లేదు అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి ఉదాహరణగా ఇలా చెబుతున్నారు.కొందరు వ్యక్తులు చిటారు కొమ్మలో ఉన్న తేనెను సంపాదించాలనే అత్యాశతో ప్రాకులాడుతూ ,పైకి పాక్కుంటూ వెళ్తారు కానీ ఆ కొమ్మ ఎలా ఉంది అనేది పట్టించుకోరు.తద్వారా కొమ్మ విరిగి తాము పడేది ఏ మాత్రం గమనించడం లేదు. అనగా ఖచ్చితంగా కింద పడటం ఖాయం అని అర్థము.
 ఇందులో యిమిడి వున్న నిగూఢమైన అర్థం ఏమిటంటే "తుచ్ఛ కామ సుఖం అనుభవించేందుకు ఇష్టపడుతూ చేయరాని పనుల్లో కాలుమోపుటయే గానీ మూఢులు దాని వలన సంభవించు అనర్థాలు,నరకమును మాత్రము గుర్తించరు.దీనినే "మధు పశ్యసి దుర్భుద్ధే ప్రపాతం కిం న పశ్యసి న్యాయము "అని కూడా అంటారు.
తుఛ్ఛ కామ సుఖం అంటే క్షణికమైన, తాత్కాలికమైన కోరికల నుండి పొందే అల్పమైన సుఖం. ఇలాంటి వన్నీ ఇంద్రియాల నిగ్రహం లేకపోవడం వల్ల కలుగుతాయి. ఇవి భౌతిక పరమైన సుఖాలు.విపరీతమైన , విలాసవంతమైన జీవితం గడపాలని లేదా తినాలని, తాగాలని, యదేచ్ఛగా తిరగాలని ఇలాంటి వన్నీ ఆ కొద్దిసేపు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి. వీటి వల్ల క్షణికమైన, స్వల్పమైన ఆనందం మాత్రమే కలుగుతుంది.
 ఇలాంటి వాటికి వెంపర్లాడుతూ అవి అనుకున్న వెంటనే అందకపోతే, దొరక్క పోతే కొందరు మూఢులు ఎంతటి నీచానికైనా తెగబడటం చూస్తున్నాం. అలాంటి వారు అలాగే అనుభవిస్తూ తాము అనుకున్న విధంగా సుఖంగా ఉంటారా? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే అలాంటి కోరికలకు అంతూ పొంతూ ఉండదు. నిరంతరం ఏవేవో కోరికలతో రగిలిపోతూ ఉంటారు.
 పెరుగుతున్న కోరికలతో  అదుపులో ఉంచుకోలేని కొందరు ఇంద్రియ నిగ్రహం లేక అమాంతం అగాధంలో పడిపోతుంటారు.
 వారి జీవితాన్ని వారే కోరికల జలగల్తో పీల్చేసుకుని పనికి రాని చెత్తలా సమాజం ముందు నిలబడతారు.
 వాళ్ళ వల్ల అటు తల్లిదండ్రులకు,ఇటు  సమాజానికి చెడు తప్ప మంచి జరుగదు.
 ప్రస్తుతం వివిధ ఛానల్స్ పత్రికలు చూసినట్లయితే ఎన్నో భయానక జుగుప్సాకరమైన సంఘటనలు. వీళ్ళ మనుగడ ఏమిటి? ఇంత నీచానికి ఎందుకు ఎగబాకుతున్నారు. జరుగబోయే పరిణామాలు, పర్యవసానాలు తెలియవా? అని అనిపిస్తుంది.
 అందుకే మన పెద్దలు చిన్నప్పటి నుండే మంచి అలవాట్లు, క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహము మొదలైనవి కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని నీతి కథలు,పద్యాలు జీవిత సత్యాలు బోధిస్తూ వక్ర మార్గంలో నడవకుండా  మంచి విలువలు నేర్పుతుండే వారు. ప్రస్తుతం అలా చెప్పేవారు లేక పోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
 కాబట్టి ఈ "మధు పశ్యసి దుర్భుద్ధే ప్రపాతం నాను పశ్యసి న్యాయము"ను దృష్టిలో పెట్టుకొని ఏ మాత్రం అవకాశం దొరికినా వదలకుండా నేటి, రేపటి తరాన్ని  మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. అది సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. "Each one Teach one " వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే  అలాంటి మూఢులు మన సమాజంలో లేకుండా మంచి మార్పు పొందుతారు.

కామెంట్‌లు