"తెరమరుగువుతున్న తపాలా?:- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ)-సారవకోట -చరవాణి: 9490904976
 "త"న, పరాయివాళ్లకు
"పా"ర్శిల్లు, ఉత్తర ప్రత్యుత్తరాలను 
"లా"భదాయకంగా అందించి, పొందే సంస్థ "తపాలా శాఖ".
 
తోక లేనిపిట్ట తొంభై ఆమడలు పోతుంది ఏమిటది? (పొడుపు కథగా ఉండేది)
ఉత్తరం..
పొడుపు కథే కాదు
పొదుపు చేసేందుకు కూడా పోస్టు ఆఫీసులో అవకాశం ఉంది.
ఉత్తర ప్రత్యుత్తరాలకు ఊపిరి పోసింది ఎర్రటి తపాలా పెట్టె. ఎంతటి దూరాలకైనా పంపింది తపాలా వ్యవస్థ..
క్షేమ సమాచారాల్ని, సందేశాల్ని దూరభారాలలో ఉన్న ఇతరులకు పంపేందుకు పూర్వం రాజులు పావురాలతో లేఖల ద్వారా పంపేవారు. దగ్గరగా ఉంటే వర్తమానాలనూ వ్యక్తులతో  పంపేవారు.
ప్రపంచ తపాలా వ్యవస్థ ఆవిర్భావంతో ఏ దేశంలో, ఎక్కడున్నా ఎవరికైనా ఉత్తరాలను సాధారణ వ్యక్తుల కూడా వారి బంధువులు, స్నేహితులకు, కావాల్సిన వారికి పోస్టు కార్డులు, ఇన్లాండ్ , ఎన్వలప్  కవర్ల ద్వారా వ్రాసే పంపే అద్భుత అవకాశం అందరికీ అందుబాటు ధరలలో తెచ్చి ఇచ్చింది తపాలా శాఖ. డబ్బులు పంపేందుకు మనీయార్డర్ ద్వారా, వస్తుసేవలను పార్శిల్ ద్వారా  పంపే అవకాశం కల్పించింది.
అందరూ చక్కగా స్వదస్తూరితో వ్రాసి వారి కుటుంబ సభ్యులకు పంపే అద్భుత అవకాశం ఉండేది. అందరూ చదువుకొని ఆనందించే రోజులు కరువైపోయాయి.
టెలీఫోన్, వైర్ లెస్ ఫోన్, కార్డు లెస్ ఫోన్, మొబైల్ ఫోన్లు రాకతో ఉత్తరాలు బిత్తరపోయాయి.
చరవాణి రాకతో వ్యక్తిగతంగా 
సంక్షిప్త సందేశాలు (ఎస్సెమ్మెస్) పంపుకోవడాలు,
చాటుగా చాటింగులతో చిన్నాభిన్నం అవుతున్నాయి సంబంధాలు, కుటుంబాలు.
ఎర్రపెట్టె చెరలోకి పోయి మాయమైపోయింది.
ఉత్తరాలు వ్రాయడం లేకపోవడం వల్ల భాషాపరమైన, ఉత్తమమైన సంబోధనా పదాలు చిన్నబోయాయి.
మహారాజశ్రీ అనే మాటేలేదు..
గౌరవనీయులైన గొంతేలేదు..
ఉభయకుశలోపరి ఊసేలేదు..
చిరంజీవన్న దీవింపే లేదు..
ప్రియమైన అనే పలుకులు ప్రేమతో, ప్రేమగా పిలుపేలేదు.
గంగా భాగీరథి సమానురాలైన మాట గంగలో కలసిపోయింది.
భవదీయుడు భస్మం అయిపోయింది.
చిత్తగించవలెను చిత్తైపోయింది.
ఇట్లు ఎటెల్లిపోయిందో..
ఆఖరికి తపాలా కార్యాలయాలు
ఆర్డీలు, భీమాలు, బాండ్లు, పొదుపులకు,
ఆధార్ కార్డు సెంటర్లుగా ఆదాయ వనరులుగా నేడు అవతరించాయి..
తపాలా దినోత్సవం సందర్భంగా .... 

కామెంట్‌లు
Popular posts