సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!

ఆది పర్వము చతుర్థాశ్వాసము సమాప్తం: - 22వ రోజు
దృతరాష్ట్రుడు పాండురాజు విదురుల జననం

భీష్ముని సలహా విన్న తరవాత సత్యవతికి తనకు పరాశరుని వలన కలిగిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు. ఆవిషయం భీష్మునకు చెప్పింది. వ్యాసుడు సమస్త ధర్మాలూ తెలిసిన వాడు. మహాతపశ్శాలి వేదవేదాంగ పారంగతుడు అతడు నీ తమ్ముని భార్యలకు సంతానం ప్రసాదించగలడు అని చెప్పింది. ఆమె వెంటనే మనసారా వ్యాసుని ప్రార్ధించింది. వ్యాసుడు ప్రత్యక్షమై తల్లికి నమస్కరించాడు. సత్యవతి వ్యాసునకు పరిస్థితి వివరించి దేవర న్యాయం అనుసరించి తనకు మనుమలను ఇచ్చి వంశోద్దరణ చేయమని కోరింది. వ్యాసుడు తల్లి ఆజ్ఞను శిరసా వహిస్తానని చెప్పి"తల్లీ! నీకోరిక ధర్మసమ్మతమే కాబట్టి తీరుస్తాను. అయితే రానులిద్దరిని ఓ సంవత్సరము పాటు నేను చెప్పినట్లు వ్రతమును ఆచరించమను. అప్పుడే వారు నా తేజస్సును భరించ గలుగుతారు" అని అనగ సత్యవతి "నాయనా! అంతకాలం రాజు లేకుండా వుంటే రాష్ట్రంలో అరిష్టము లేర్పడతాయి. కాబట్టి ఏమి చేస్తే రాణులు త్వరగా గర్భవతులు కాగలరో ఆ ప్రకారం చేయి. వారిని భీష్ముడు పెంచి పెద్దచేస్తాడు" అని అన్నది.అంత వ్యాసుడు నా శరీర గంధాన్ని, రూపాన్ని, వేషాన్ని, శరీరాన్ని భరించ గలిగితే అంబిక నేడే ఉత్తమ గర్భాన్ని పొందవచ్చు" ననగా సత్యవతీ దేవి పెద్దకోడలైన అంబికను ఎలాగో సమ్మతింప జేసి అలంకరించి వ్యాసుని వద్దకు ఏకాంతంగా పంపగా ఆమె సన్నని నల్లని జఠలతో భయంకరంగా ఉన్న వ్యాసుని చూసి కన్నులను మూసుకున్నది. అందువలన ఆమెకు మహాబలవంతుడైన కుమారుడు పుడతాడు, కానీ అతడు తన తల్లి చేసిన దోషం వలన గ్రుడ్డి వాడుగా పుడతాడని చెప్పగా సత్యవతి " నాయనా! గ్రుడ్డివాడికి రాజ్యార్హత ఉండదు గదా కాబట్టి మరొక బిడ్డను ప్రసాదించు" మనగ వ్యాసుడు సంతసించాడు. సత్యవతి రెండవ కోడలైన అంబాలికను ఒప్పించి పంపగా ఆమె వ్యాసుడిని చూసి భయంతో తెల్లబోయింది. తనను చూసి తెల్లబోయింది కాబట్టి పాండు వర్ణం తో పుడతాడని చెప్పాగా సత్యవతి మరొక బిడ్డకోసం కోరగా సరేనని వ్యాసుడు నిస్కమించాడు. అంబిక గ్రుడ్డి కొడుకును కన్నది. అతడే ధృతరాష్ట్రుడు. అంబాలిక పాండు వర్ణంతో బిడ్డను కన్నది అతడే పాండురాజు. అంబికకు గుడ్డి వాడు కలిగినందుకు దుఃఖించిన సత్యవతి ఇంతకు ముందే వ్యాసుడిని మరొక్క కుమారుని ప్రసాదించమని ప్రార్ధించి నందున తిరిగి అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అయితే అంబిక అత్తగారి మాట కాదనలేక సమ్మతించినా ఆ మహర్షి రూపాన్ని, తేజస్సును తలచుకొని భయపడి తన దాసీని అలంకరించి వ్యాసుని వద్దకు పంపగా ఆమె వ్యాసుడికి సకల సేవలు చేసి సంతోషింప జేసింది. వ్యాసుడు తల్లికి విషయం తెలియ జేసి ఈమె కడుపున పండిత శ్రేష్టుడు, ధర్మస్వరూపుడు పుడతాడని తెలిపి నిష్కమించాడు. ఆ దాసీకి మాండవ్య మహాముని శాపం అందుకున్న యమధర్మరాజు కుమారునిగా జన్మించాడు. అతడే విదురుడు.అది విన్న జనమేజయుడు మాండవ్య ముని యమధర్మ రాజుకు శాపం ఎందుకు ఇచ్చాడని వైశంపాయనుని అడిగాడు.
మాండవ్యముని వృత్తాంతం
మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు.రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు. రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేసాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపసుని కొనసాగించారు. ఒక రోజు రాత్రి కొంతమంది మహఋషులు పక్షి రూపాలతో అక్కడకు వచ్చి మాడవ్యుని చూసి " మహానుభాడవైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేసారు " అని ప్రశ్నించారు.అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని అందుకు ఎవ్వరిని నిందించ వలదని చెప్పాడు. ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని క్రిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు.శూలం అతని శరీరంలోనుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంతభాగం మాత్రం మిగిలి పోయింది. ఆ తరవాత అతడు ఆణి మాండవ్యుడునే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరవాత యమపురికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో " మహా మునీ చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించే వాడివి. అందు వలన ఈ శిక్ష అనుభవించావు. " అన్నాడు. అది విన్న మాండవ్యుడు కోపంతో " పదునాలుగేళ్ళ వరకూ పిల్లలలు ఏమి చేసినా తెలియక చేస్తారు. అందు వలన ఇక మీదట పదునాలుగేళ్ళ బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు. వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది. కానీ యమధర్మరాజా నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు శూద్ర గ్రర్భమందు జన్మించెదవు కాక " అన్నాడు. ఆ కారణంగా వ్యాసుని వలన యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టాడు అన్నాడు వైశంపాయనుడు.
ఆది పర్వము చతుర్థాశ్వాసము సమాప్తం

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు