విశ్వ నరుడు...గుర్రం జాషువా..!:- కవి రత్న-సాహిత్యధీర-సహస్రకవి భూషణ్-పోలయ్య

నాదేశం నాలుగు వేదాలకు
నిలయం ఒక దివ్య దేవాలయం
అట్టి నా దేశంలో బుసలుకొడుతోంది
"నాలుగు పడగల హైందవ నాగరాజు"...!

ప్రపంచమంతా వెతికినా కనపడని
"నాలుగు వర్ణాల దుర్వ్యవస్థకు"
నాంది పలికి...ఒక మానవ జాతిని
"అంటరానితనమనే" చితిమంటల్లో
"దహించేందుకు నాదేశంలో పుట్టిందే...
"మనుధర్మ శాస్త్రమనే మాయామృగం"...!

"అంటరాని తనం"...
"ఒక ఆరని అగ్నిగుండమైన వేళ...
"కులసర్పం" కోరలుచాచి బుసలుకొట్టే వేళ
చాటు మాటుగా కాటు వేసే వేళ...
కులాంతర మతాంతర వివాహమాడిన
గుర్రం వీరయ్య యాదవ్  లింగమ్మ 
అరుంధతిల గర్భాన జన్మించిన జాషువా
అడుగడుగున కులపిశాచి వేధించినా
ఆత్మగౌరవపు దీపంలా వెలిగాడు..!

విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల వంటి
నాటి మేటి మేధావులతో పోటీ పడి
సాహితీ సమరాన ఢీకొట్టిన దిట్ట
ధీటైన పదునైన పద్యాలతో సాహితీ
విప్లవ సృష్టికర్త...సంఘసంస్కర్త
మహాకవి...గుర్రం జాషువా..!

గుర్రం జాషువా గురువులిద్దరే...
ఒకరు పోరాటాన్ని నేర్పిన "కులం",
మరొకరు నిచ్చెనమెట్ల సమాజంలో
ఎదురించి బ్రతకడం నేర్పిన "పేదరికం"..!

గాంధేయవాదిగా...
గాంధీజీ బోధించే పాటించే...
వర్ణవ్యవస్థ...హరిజనోద్ధరణ...
ద్వంద్వ సిద్దాంతాన్ని" గుర్రం జాషువా
గుడ్డిగా నమ్మినా అంబేద్కర్ ఆశయాలకు  
తన "పద్యాలతో పట్టాభిషేకం" చేసిన
సమతవాది పోరాట యోధుడు
ఘనుడు త్యాగధనుడు...గుర్రం జాషువా..!

తనను "ద్వితీయశ్రేణి" కవియని
"పంచమ కవికోకిలని" హేళన చేసిన
అసూయా పరులైన అగ్రవర్ణ కవులకు
కనువిప్పు కలిగించేలా పసందైన
పద్యాలతో ఏడు ఖండకావ్యాలు లిఖించి
పీడితుల కన్నీటిగాధల్ని విశ్వవేదికలపై వినిపించిన "కులపంజరంలో" చిక్కుకోని
"విశ్వనరుడు"...గుర్రం జాషువా...!

మహాకవి కాళిదాసు "మేఘసందేశం"లా
తన "గబ్బిలం" కావ్య ఖండికలో తాను
తన జాతి తరతరాలుగా అనుభవించే అంటరానితనాన్ని...కులవివక్షతను...
పూజారిలేని సమయాన "పరమేశ్వరునికి"
వినిపించమని "పక్షిసందేశం" పంపిన
అక్షరదాసు...అక్షర పిపాసి...గుర్రం జాషువా
"ఫిరదౌసి", "ముంతాజ్ మహల్",
"క్రీస్తు చరిత్ర", "నా కథ" వంటి కోహినూర్
వజ్రాల్లాంటి ఖండకావ్యాలెన్నో వ్రాసి
శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిచే "గండపెండేరాన్ని" తొడిగించుకున్నా...!

"కళాప్రపూర్ణ", "పద్మభూషణ్"వంటి
ప్రతిష్టాత్మక పురస్కారాలు అవార్డులు అందుకున్నా...
ప్రతినిత్యం" అంటరానితనం అగ్ని" 
తన హృదయాన్ని దహించి వేసిందని...!

"కుల విషసర్పం" తనను తాను జాతిని
తరతరాలుగా కాటు వేస్తూనే ఉందని...
కుమిలిపోతూ "కలం కత్తితో"... కసిగా
"కులవిషవృక్షాన్ని" కూకటివేళ్లతో సహా 
పెకలించి వేసిన "విప్లవశంఖం" పూరించని ఎర్రజెండా ఎత్తని విప్లవకవి గుర్రంజాషువా..!

"కులమత రహిత
"నవసమాజం కోసం" పరితపించిన...
కన్నుమూసే వరకు "పెన్ గన్ తో
విప్లవ పద్యగీతాలను ఆలపించిన"కవికోకిల" 
"నవయుగ కవిచక్రవర్తి"...గుర్రం జాషువా..!

అట్టి మహనీయున్ని స్మరించుకోవడం...
మనందరి అదృష్టం...వారి
ఆశయాల సాధనకు కృషి చేయడం...
మానవత్వమున్న
ప్రతి భారతీయుని ప్రథమ కర్తవ్యం...!

చిలకమర్తి, వీరేశలింగం, గురజాడల,
వారసుడిగా సాహితీ సంఘసంస్కర్తగా
జీవితాంతం అక్షరమే ఆయుధంగా 
సమాజంలోని అసమానతలను సమాధి 
చేసిన ఆ అక్షర శిల్పికి...ఆ అక్షర గుర్రానికి...
మరణంలేని ఆ మహాకవికిదే నా అక్షర నీరాజనం.


 

కామెంట్‌లు