నేను బతికే ఉన్నాను.
అవును!నేను బతికే ఉన్నాను.
చావలేక,చావు రాక,చేత కాక,
తెలివితప్పి,మతి గతించి,
మనుషుల మధ్యనే పడి ఉన్నాను.
ఉద్యోగంలో ఉన్నప్పుడు నిత్యం చచ్చి బతికేవాణ్ణి.
ఇప్పుడు బతికి ఉండడానికి
ప్రతిరోజూ చచ్చిపోతూనే ఉన్నాను.
అందరూ స్థిరపడ్డాక విడిచిన నిట్టూర్పు,
నిండా తేలిన బ్యాలెన్స్ షీటు,
క్రమం తప్పక వేసుకోవాల్సిన టాబ్లెట్లు ఎన్నో.
షుగర్,బి.పిల మానిటరింగుతో,
ఉదయం,సాయంత్రం వ్యాహ్యాళులతో,
ఒంటరితనం తుంటరితనంగా అపహాస్యం చేస్తుంటే,
సొంత రక్తంలో పరాయితనం కనబడుతుంటే,
వెనకేసుకోలేని తెలివికి దండం పెడుతూ,
నిత్యనీరాజనాలందుకుంటున్నాను.
పండుగ పాయసం తీర్థంలా తీసుకునే సౌకర్యంతో,
పిండివంటలు పండుటాకువు నీవని సెలవిస్తుంటే,
టీ.వీ స్నేహితుడై పలకరిస్తుంటే,
వార్తల హారాలు ధరిస్తుంటాను.
నేను బతికే ఉన్నానని సమర్పించుకుంటూ,
ఇంటిదాని సాధింపులతో విపులమైన నాకు,
ప్రతి ఉదయం భయపెడుతూనే ఉంటుంది.
సెల్ ఫోన్ గణగణకై ఆరాటపడుతూ,
పడుతూ,లేస్తూ,పలవరిస్తూ,
అప్పుడప్పుడు ఆసుపత్రికి చుట్టమై వెళ్ళి వస్తుంటాను.
హుషారుకు నమస్కరించి,
చిన్న చిన్న పనులు పురమాయించే పరిస్థితులకు
సాష్టాంగ నమస్కారం చేయలేక,
సింగిల్ హాండ్ షేక్ హాండిస్తాను.
నేను బతికే ఉన్నానని నా వారికి,పరాయి వారికి తెలియజేస్తూ,
ఎదురుచూపుల పరీక్షలు అన్లైనులో వ్రాస్తుంటాను.
బ్యాంకులో పడే పెన్షను డబ్బులకు మోహరించిన సజీవాలకు కానుకలిస్తుంటాను.
విసుగుపడే సంతానాన్ని,
విధేయత చూపే సేవకగణంతో గుణించుకొని,
గతించిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,
లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించుకుంటూ ప్రయాణం ఆగేవరకు నడిపిస్తుంటాను.
బతికే ఉన్నానని ప్రకటించుకుంటూ,
బతుకు భారమైనా బతికేస్తుంటాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి