సంపూర్ణ మహాభారతము* సరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము-ద్వితీయాశ్వాసము:-10 వ రోజు
ఇంతలో ఇంద్రుడు గరుత్మంతునపై వజ్రాయుధాన్ని వేసాడు. తనపై వేసిన వజ్రాయుధాన్ని గౌరవించి ఒక ఈకను మాత్రం తుంచమని చెప్పాడు. ఇంద్రుడు గరుడుని బలానికి అచ్చెరువు చెంది అతనితో మైత్రి చేసుకున్నాడు. గరుడా క్రూరులైన నాగులకు అమృతాన్నిచ్చి లోకాలకు కీడు చేయవద్దని వేడుకొన్నాడు. అందుకు సమ్మతించిన గరుత్మంతుడు "నేను అమృతాన్నిచ్చి నా తల్లితో సహా దాస్య విముక్తులము అవుతాము. ఇంద్రా నీవు వారు అమృతం సేవించే లోపు తిరిగి తీసుకొని వెళ్ళు" అని చెప్పాడు. అలాగే చేసి తల్లిని దాస్య విముక్తి చేసి తన రెక్కలపై పెట్టుకొని తీసుకు వెళ్ళాడు. అమృతం త్రాగే ముందు నాగులు శుచి అగుటకు నదిలో స్నానమాచరించే సమయంలో ఇంద్రుడు అమృతాన్ని తీసుకు వెళ్ళాడు. నిరాశ పడిన నాగులు అమృతం ఉంచిన దర్భలు నాకాయి. ఆ కారణంగా వాటి నాలుకలు రెండుగా చీలి పోయాయి. ఆనాటి నుండి నాగులు ద్విజిహ్వులు అయ్యారు. అమృతం పెట్టిన కారణంగా దర్భలు పవిత్రం అయ్యాయి. ఇదంతా చూసిన ఆదిశేషుడు తల్లి మీద తమ్ముల మీద అసహ్య పడి వారిని విడిచి వెళ్ళి బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. అతని సత్య సంధతకు ధర్మనిష్టకు మెచ్చిన బ్రహ్మ దేవుడు భూభారాన్ని మోసే భారాన్ని ఆది శేషునకు అప్పగించాడు.
నాగులను రక్షించే ప్రయత్నం
ఆది శేషువు వెళ్ళగానే కద్రువ కుమారులకు సర్పయాగం భయం పట్టుకుంది. అందు వలన కలత చెందిన వాసుకి నాగులను పిలిచి తనకు పాలసముద్ర మధనంలో సహాయపడిన కారణంగా దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చిరంజీవత్వం లభించేలా చేసారు. మిగిలిన నాగులను రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పాడు. అది విని ఏలా పుత్రుడు అనే పాము " అమ్మ శాపం ఇచ్చే సమయంలో నేను అమ్మ ఒడిలో పడుకుని దేవతల మాటలు విన్నాను. దేవతలంతా " బ్రహ్మదేవా ఏ మాత్రం దయ లేకుండా కద్రువ కుమారులకు శాపం ఇచ్చింది. దీనికి విమోచన లేదా " అన్నారు. బ్రహ్మ దేవుడు దేవతలతో " పాములు లోకానికి హాని చేస్తాయి కనుక ఈ శాపం మంచిదే. అయినా మంచి సర్పాలను రక్షించే ప్రయత్నం జరత్కారుడు జరత్కారువు దంపతులకు పుట్టిన ఆస్తీకుడు చేస్తాడు " అని దేవతలు చెప్పగా విన్నాను. ఆ తరువాత వాసుకి తన సోదరి జరత్కారువుని వివాహమాడటానికి జరత్కారుని కోసం ఎదురు చూస్తున్నాడు. జరత్కారువు ఒక ముని. అతడు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు. ఒక రోజు ఒక మడుగు సమీపంలో ఎలుకలు కొరకగా మిగిలిన రెల్లు దుబ్బులను చూసాడు. వాటిని ఆధారం చేసుకుని వేలాడుతున్న ఋషులను చూసి " మహాత్ములారా ఇలా తలకిందులుగా ఎందుకు వేలాడుతున్నారు. ఇదేమి తపస్సు" అని అడిగాడు. అందుకు వారు " మా వంశంలో పుట్టిన జరత్కారువు అనే పాప కర్ముడు వివాహం చేసుకుని వంశాభివృద్ధి చేయలేదు. అందువలన అతని పితృ దేవతలమైన మాకు ఉత్తమ గతులు కలుగలేదు. నీకు అతడు కనిపిస్తే మా సంగతి వివరించి మాకు ఉత్తమ గతులు కలుగచేయమని చెప్పు " అన్నారు. అది విని జరత్కారువు పితృరుణం తీర్చుకొనే నిమిత్తం వివాహం చేసుకోవడానికి తనపేరు కలిగిన కన్య కోసం వెతకసాగాడు. కానీ అతనికి తన పేరు కలిగిన కన్య లభ్యం కాలేదు. అది తెలుసుకున్న వాసుకి తన చెల్లెలిని తీసుకుని జరత్కారుని దగ్గరకు వెళ్ళాడు. వాసుకి జరత్కారునితో " మహాత్మా ఈమె నీ పేరు కలిగిన కన్య ఈమెను వివాహం చేసుకోండి " అన్నాడు. అందుకు సమ్మతించి జరత్కారువును వివాహం చేసుకున్నాడు. అతడు భార్యతో "నీవు నా మాటను ఎప్పుడూ మన్నించాలి నీవు నాకు ఎదురు చెప్పిన రోజు నేను నిన్ను విడిచి తపస్సు చేసుకోవడానికి వెళతాను" అన్నాడు. ఆమె అందుకు అంగీకరించింది. జరత్కారువు గర్భవతి అయింది. ఒకరోజు సంధ్యా వందనం చేసుకునే సమయం అయిందని తన తొడపై తల పెట్టి నిద్రిస్తున్న భర్తను నిద్ర లేపి చెప్పింది. అందుకు జరత్కారుడు కోపించి " నన్ను నిద్ర లేపి అవమానించావు. కనుక మన ఒప్పందం ప్రకారం నేను నిన్ను విడిచి తపస్సుకు వెళతాను. నీవు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు " అన్నాడు. జరత్కారువు వాసుకి ఇంటికి వెళ్ళింది. వాసుకి ఇంటికి చేరిన జరత్కారువు ఆస్తీకునికి జన్మ ఇచ్చింది. ఆస్తీకుడు చ్యవన మహర్షి కుమారుడైన ప్రమతి వద్ద విద్యాభ్యాసం చేసాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు