అక్షర జల్లులు :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
వాన కురిస్తే - వాగులు పారతాయి
అక్షరాలు కురిస్తే - కవితలు పుడతాయి
పూలు కురిస్తే - మదులు మురుస్తాయి
ప్రేమ కురిస్తే - హృదయాలు పొంగుతాయి.

నిప్పులు కురిస్తే - మంటలు రేగుతాయి
రాళ్లు కురిస్తే - తలలు పగులుతాయి
ముత్యాలు కురిస్తే - మెడలు చుట్టుకూంటాయి
మణులు కురిస్తే - మూటలు ఇల్లుచేరుతాయి.

మాటలు కురిస్తే - తేనెచుక్కలు చల్లబడతాయి
స్వరాలు కురిస్తే - రాగసుధలు వినబడతాయి
ఓట్లు కురిస్తే - విజయభేరులు మ్రోగుతాయి
చెప్పులు కురిస్తే - చీత్కారాలు కనబడతాయి.

తిట్లు కురిస్తే - ద్వేషజ్వాలలు రగులుతాయి
డబ్బులు కురిస్తే - తన్నులాటలు జరుగుతాయి
కాంతులు కురిస్తే - అంధకారాంతము అవుతుంది
వెన్నెల కురిస్తే - మనసులకానందము చేకూరుతుంది. 

కురిస్తే - సంతోషగీతము 
కురవకపోతే - నిరాశ జనితము
అతివృష్టి - అనర్ధ దాయకము
అనావృష్టి - దుఃఖ కారకము.


కామెంట్‌లు