సామెతల ఊట -సునందమ్మ నోట :- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం
 సామెత -12: -అసలే కోతి - ఆపై కల్లు తాగినట్లు
 *****
"అవ్వా! ఓ అవ్వా! ఇయ్యాల లింగయ్య మావింట్లో ఓ గమ్మతి జరిగింది.జల్దీ రా అవ్వా! గీ బంకుల మీద కూకోని గా ముచ్చటి సెప్పుకుందం. పకా పకా ఓ వైపు నవ్వుతూ మరో వైపు  పిలుస్తుంటే..
" గిదేం సోద్యం గంతగనం నవ్వబడ్తివి. పొట్ట సేత్తో పట్టుకుని కళ్ళెంట నీళ్ళు కారేలా ఆపకుండ నవ్వుతున్న రత్తమ్మ వాలకం జూసి అవ్వకూ నవ్వాగలే.
 తాను నవ్వు వంత గలిపి "ఇంగ జెప్పు. గంత నవ్వొచ్చే సంగతేందో" అంది.
తల్సుకొని తల్సుకొని నవ్వుతూ మన లింగయ్య మావ లేడు. గాళ్ళింటికి  శాన్నాళ్ళయింది మేనమావను సూడనీకని శెల్లె బిడ్డ పొల్లగాండ్లిద్దర్ని తీసుకొచ్చింది.
నీ మొఖం మరి గందులో గింత గనం నవ్వొచ్చేదేముందే" అంటున్న అవ్వతో..
 "ఎహే ఆగే అవ్వా! పురాగ యిన్నంక నీకు నవ్వు రాపోతే సూడు.
 ఆ శెల్లె బిడ్డ పొల్లగాండ్లిద్దర్ని తీసుకొచ్చిందని చెప్పిన్నా. చిన్న పోరడు మహా దూలగొండి పోరడు.ఉన్న సోట ఉండడు.ఒకటే దూం సేసుడు. "ఇల్లు పీకి పందిరేసిండు రెండు దినాలకే... సాటుంగ అత్త మా గోడ కాడికొచ్చి" ఎక్కడి పొల్లగాండ్లోనే  కోతి పొల్లగాండ్లు. ఒకటే దూం సేత్తుండ్రు. గా తల్లి ఏమనదు. నాకు మీ మావకు ఆపవళం గావట్లే" అంది.
 పొల్లగాండ్లన్నంక దూము,లొల్లి సేయకుండ ఉంటరా.మనల్ని జెయ్యమంటె సేత్తాం.? గా వయసే గట్లాంటిది అంటున్న అవ్వతో..
 "జర్రాగవవ్వా యిసయమింక పురాగ సెప్పనే లేదు.అసలు కత ఏమైందంటే....
 లింగయ్య నిత్తెం తాగే ఆడుక కల్లును బింకిలో కాకుండ సీసాలో తెచ్చుకుని తనబ్బిలో దాపెట్టిండట. గది గా సిన్న పోరడు సీమ లెక్క జాడ బట్టి  కూల్ డింక్ సీసా దెచ్చుకుని  మాకు బొయ్యకుండ దాపెట్టుకుంటడా! అనుకుండంట.
ఇంగేముంది ఆళ్ళెవ్వరు జూడకుండ సీసా దీస్కబోయి ఇంటెనుక ఏప సెట్టు కింద దిమ్మె మీద కూకోని సుక్క మిగులకుండ పురాగ తాగిండంట. ఇంగేముంది. ఎన్నడూ తాగని పోరడు. కల్లు మైకం తలకెక్కి ఒళ్ళు సోవి లేకుండా అటూ ఇటూ తూలుతూ ఏదేదో ఒర్రుడంట. గజ్జూసి తన కొడుక్కి  దెయ్యమో భూతమో పట్టిందని గా పొల్ల గుండెలు బాదుకుంట ఒకటే ఏడ్సుడుపో.
గా లొల్లికి నేనురికి బోయిన. అత్త గడగడలాడుతోంది. రాక రాక వచ్చినోళ్ళకి గిట్ల జరిగిందేమని. నేను సుత నిజంగనే పోరడికేదో అయ్యిందనుకున్న. ఎంటనే రచ్చ బండ దెగ్గరున్న లింగయ్య మావ పిల్సుకొచ్చినం.ఎవలకు కాల్జేతులు ఆడట్లే. ఊళ్ళె  ఆరెంపి డాట్టరును పిలుద్దాం బయపడకని జెప్పి,  డబ్బుల కోసం తనబ్బి తెరిసేతల్కి .పోరడేం జేసిండో తెల్సిపోయింది.ఆర్నీ కడుపుడుక.ఎంత పని జేసినవ్రా అయ్య".ఇంగ జూస్కో! మావ  బయటికొచ్చి సెప్పా నవ్వ.. సెప్పా నవ్వ. గబ్బ గబ్బ బాయిల నీళ్ళు మూన్నాల్గు బకెట్లు చేది పోరడి మీద పోసి ఒళ్ళంతా తుడిసి సల్ల కలిపి బువ్వ తినిపిచ్చినంక పోరడు సల్లబడ్డడు. సుట్టు పక్కలోల్లమంత పొట్ట సెక్కలయ్యేలా నవ్వుకున్నం పో..
యిషయం ఇన్నంక అవ్వకూ నవ్వాగలే. అసలే కోతి పోరడు ఉన్న సోట ఉండలే.ఆ పైన కల్లు దాగిండు.ఇంగెట్లుంటది. అనుకుండ్రు.
మన ఎనుకటోళ్ళు ఊకె బుట్టించలే గిట్లాంటి సామెతలు.కళ్ళార జూసి అనుభవంతో చెప్పినయివి.
గదండీ సంగతి! "అసలే కోతి ఆపై కల్లు తాగినట్లు" అంటే గిదే మరి.

కామెంట్‌లు