బాల సాహిత్యంలో కథల స్థానం గణనీయమైనది! కథ చెబుతాననగానే పిల్లలు పరిగెత్తుకు వస్తారు. కథలో ఆ మహత్తు ఉంది. అందుకే బాల సాహిత్య రచయితలు కథల ప్రాముఖ్యత నెరిగి కథారచన చేయడం చాలా బాధ్యతతో కూడుకున్న వ్యాపకం! ఆ వ్యాపకంలో డా.. కందేపి రాణీప్రసాద్ అడుగుపెట్టి సఫలీకృతులయ్యారనే చెప్పవచ్చు ఆమె ఇటీవల తెచ్చిన బాలల కథల సంపుటి "స్వీటీ, మిల్కీ, ఓ చిలుక" చూశాక!
పుస్తకానికి పేరు పెట్టడంలోనే ఆమె ప్రతిభ కనిపించింది. పిల్లల కిష్టపడే పదాల కూర్పుతో పుస్తకానికి పేరు పెట్టి ఆమె బాల పాఠకులను తన వైపు తిప్పుకోగలిగారు.
పుస్తకంలో మొత్తం 16 కథలున్నాయి. అందులో మొదటిదే "స్వీటీ, మిల్కీ, ఓ చిలుక" కథ! స్వీటీ అబ్బాయి పేరు, మిల్కీ అమ్మాయి పేరు. గాయపడిన చిలుకను వాళ్ళ తాతగారు ఇంట్లోకి తెచ్చి గాయానికి కట్టు కట్టి కాపాడతారు. సాయంత్రం బడి నుంచి మనవలు రాగానే చిలుకను ఆయన చూపించారు. చిలుక కాలుకు కట్టు కట్టుబడి ఉండడం చూసి స్వీటీ, మిల్కీ ఇద్దరు తెగ బాధపడతారు. ఆ సమయం నుంచి చిలుక బాధ్యతను వాళ్లు తీసుకుంటారు. రోజూ కుట్టు మార్చడం, మందు పూయడం చేసి చిలుకను బాగు చేస్తారు. చిలుక ఆ ఇంటిలో ఒక కుటుంబ సభ్యురాలే అయింది. ముఖ్యంగా పిల్లలు చిలుకతో బంధం పెంచుకున్నారు. ఆ చిలుక కూడా పిల్లలతో అనుబంధం పంచుకుంది. అందుకే తన తోటి చిలుకలు ఇంటి పరిసరాల కొచ్చినా ఆ చిలక మాత్రం ఆ ఇంటిని వదలలేదు. పిల్లలను విడిచి పెట్టి పోలేదు. రాణీ ప్రసాద్ మేడం గారు పిల్లల మనసులకు ఇష్టమయ్యే రీతిలో కథను తీర్చి దిద్ది జీవకారుణ్య గుణాన్ని పిల్లల్లో పెంపొందించడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు.
రెండో కథ "విత్తనాల విలాపం". ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో పెంచే కథ ఇది! ఏదో ఒక కోణంలో చూసి నిరాశపడి బతుకును నిందించరాదు. ఈ కథలోని విత్తనాలకు లాగే నిరాశలో ఉన్న మన జీవితాల్లో కూడా మంచి జరగవచ్చు. మనకు తెలియని నైపుణ్యాలు మనలో దాగి ఉండవచ్చు. సమయం, సందర్భం కలిస్తే అవి ఫలించవచ్చు. అంతవరకు మనం ఆగాలి. అంతేకాని నిరాశ పడరాదు. ఈ జీవిత సత్యం విత్తనాల విలాపం కథ చెప్పింది.
అనుభవంతో చెప్పిన తల్లిదండ్రుల మాటలు వినకపోతే ఏం జరుగునో చెప్పే కథ ‘పిల్ల దోమలు'!
లేని వాటి కోసం ప్రాకులాడి ఉన్న వాటిని గమనించ కపోవడం వాటి ప్రాముఖ్యతను గుర్తించకపోవడం మనకు మనం తక్కువ చేసుకున్నట్టే! ఈ గుణం మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయగలదన్న సత్యం చెప్పిన కథ 'తృప్తి'.
మంచి చెడులు గమనించకుండా ఎక్కువ మార్కులు తెచ్చుకునే పిల్లలను వెనకేసుకొచ్చే ఉపాధ్యాయులకు చురకలాంటిది ఈ కథ. వెనుకబడిన కుర్రాడి మీద శ్రద్ద చూపిన ఉపాధ్యాయుడే ఉత్తమ ఉపాధ్యాయుడు. బోధనా రంగాన్ని కడిగేసిన కథ 'అవహేళన'.
లేనిపోని సమస్యలలో ఇరికి పోకుండా తన నిజాయితీ వెంకటాచారిని కాపాడింది. నిజాయితీ కి బహుమతి తప్పక లభించగలదని చెప్పే కథ 'నిజాయితీ'!
మంచి వారికెప్పుడూ మన్నన ఉంటుందని తెలిపే కథ 'పరోపకారి'! మంచివారే కాదు ఒక్కొక్కసారి చెడ్డవారు కూడా మంచితనానికి దాసులవుతారు! మంచికి ఉన్న మహత్తు గొప్పది. మరి గాంధీ గారి ఉద్యమానికి తెల్లదొరలు దాసోహం కాలేదా?! భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించలేదా?! మంచికి మన్నన ఎప్పటికైనా దక్కుతుంది!
ఆకతాయి పనులు చేసే వారికి రోజులు ఎప్పుడూ వారివి కావు! ఎప్పుడో ఒకసారి వారి పాపం పండి దండనకు గురి కాగలరు! ఆ సత్యం చెప్పిన కథే 'అల్లరి కోతి'! పిల్లలు భుజాలు తడుముకునేటట్టు కథను ఆసక్తిదాయకంగా రచయిత్రి నడిపించారు.
అందరు సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి. అందుకు అందరూ సమయత్తమవ్వాలి. అప్పుడే అందరికీ ఆనందం అని గుండీలతో కథ నడిపే తీరు బాగుంది. "పసుపు రంగు చొక్కా - పారేయబడ్డ గుండీ" కథలో!
‘పూల తోట’ కథ మానవుల్లో లోపాలను ఎత్తి చూపగలిగింది. మనిషి సిగ్గుపడేలా పూలరాణి గులాబీ బాల ఇచ్చిన తీరు బాగుంది.
మూగజీవుల పట్ల ప్రేమను కలిగించే కథ ‘సర్కస్’! జంతువులన్నీ కూడి జంతువులను విడిపించే సన్నివేశం బాలలను ఆకట్టుకోగలదు! కథలో జంతువుల సంఘ జీవనాన్ని చక్కగా చూపించారు!
ఎవరూ తానే గొప్ప అని ఇతరులు కొద్ది అని అనుకోరాదు. గర్వబోతులకు గర్వభంగం తప్పదన్న నీతిని 'పొట్లకాయ పొగరు' కథ సందేశమిస్తుంది!
'చెట్టుగా మారని మొలక' కథ కథా సంపుటికి తల మానికంగా నిలుస్తోంది. కథలోని మొక్క చచ్చిపోవటం లేదు. అందమైన బాలల బాల్యం చచ్చిపోయింది. మనసును కదిలించే కథ. బాలలపై రచయిత్రి గారికి గల అపారమైన అనురాగానికి ప్రతీకగా ఈ కథ నిలుస్తుంది.
'విశ్వాసం లేని మనుషులు' కథ మానవులపై విసిరిన సెటైరు! పిల్లల్ని ఆలోచింపజేస్తుంది. జీతం లేని చాకిరీ చేసి కూడా కనీస సానుభూతి పొందని కుక్కపై కథ చదివాక సానుభూతి కలుగుతుందేమో.
'దంతాల వర్షం' హాస్య ప్రధానమైన కథ. ఒకరినొకరు గౌరవించుకోవాలన్న నీతిని చక్కగా ఇముడ్చుకున్న కథ!
ఇలా సంపుటిలోని కథలన్నీ దేనికదే ప్రత్యేకత సంతరించుకున్నాయి. శాస్త్ర విషయాలు శాస్త్ర విషయాలు పిల్లలకందించడంలోను, బాలగేయ నిర్మాణంలోను, ఒక ప్రత్యేకతను పొందిన డా.. కందేపి రాణీప్రసాద్ గారు కథలు రాయటంలోనూ ప్రత్యేకత పొంది కథా రచనలో ఇంకా ముందుకు పోగలరన్న ఆశ కనిపిస్తోంది. తప్పక విజయం సాధించవచ్చు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి