మధిర మార్పు:- అరుణ . బట్టువార్. -ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. -జడ్పిహెచ్ఎస్ .ఇంద్రవెల్లి
 మధిర గోండు గిరిజన అమ్మాయి. ఏడవ తరగతి చదువుతోంది. ఆరోజు  బడికి సెలవు కావడంతో తన అమ్మానాన్నలతో అడవికి వెళ్ళింది. మధిర అమ్మానాన్నలు దమ్మశీల సుంగులు. అడవిలో దొరికే ఇప్పపువ్వు ,తునికి పండ్లు, మొర్రి పండ్లు ,జీడి పండ్లు, పుట్ట తేనె వంటి వాటిని అమ్ముకొని జీవనం గడిపేవారు. 
మధిర గంప నెత్తిన ఎత్తుకొని అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ  బుట్టలొ నింపుతూ ఉంది. ఇంతలో కొంతమంది అడవి నరకే దుండగులు గొడ్డల్లు కొడవల్లతో ఒక చెట్టు కింద సమావేశమై ముచ్చటిస్తూ కనిపించారు. ఒకడేమో చాలా ఆకలిగా ఉందిరా ఏం చేయను అంటున్నాడు. ఇంకో వ్యక్తి  . కాలికి గాయమై రక్తం కారుతూ విలవిల లాడుతున్నాడు. ఇంతలో అడవి దొంగల ముఠా నాయకుడు వీరయ్య  కబుర్లు చాలు గానీ ఏ దిక్కుకు వెళ్లి చెట్లను నరుకుదాం అన్నాడు. ఆ మాటలు విన్న మధిరకు చాలా బాధేసింది అయ్యో వీరు చెట్లు నరకే దొంగలా? ఎలాగైనా ఆ దొంగల ముఠాకు బుద్ధి చెప్పాలనుకుంది. వెంటనే అక్కడికి వెళ్లి. 
 తన నెత్తి పైనున్న గంపను దింపి.  ఇవిగో ఈ జీడి పండ్లు మొర్రి పండ్లు తిని నీ ఆకలి తీర్చుకోమని తన బుట్టలోని పండ్లు తీసి అందరికీ పంచి పెట్టింది. అలాగే కాలికి గాయమైన వ్యక్తికి అచట ఉన్న మూలికలు తెంపి ఆకు పసరు పోసి రక్తం కారకుండా కట్టు కట్టింది. వెంటనే వారితో ఇలా అంది. 
 
మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. మనందరికీ ప్రాణం పోసే అడవి తల్లి ప్రాణాలు తీస్తున్నారు మీరు. అడవి తల్లి అమ్మ లాంటిది. ప్రేమతో మనల్ని చేరదీస్తుంది. అడిగినదల్లా కాదనకుండా ఇచ్చే  కల్పవల్లి. 
మృత సంజీవని  తానై మూలిక వైద్యాన్ని అందించి ప్రాణాలు  కాపాడుతోంది. వర్షాలకు నెలవై పుష్కలమైన  పాడిపంటలకు  దోహదకార వుతుంది. క్రూరమైన అడవి జంతువులు   ఊర్లోకి పరుగిడి మానవుల ప్రాణాలు తీయకుండా సమస్త మానవజాతిని  కాపాడుతోంది. ఎన్నో ఎన్నెన్నో అటవీ సంపదలను మానవాళికి అందిస్తోంది. ఆక్సిజన్ని అందించి ప్రాణాలు నిలబెడుతోంది. ఇప్పుడే చూశారుగా ఆయన గాయానికి వైద్యురాలు అయ్యింది. పండ్లతో మీ అందరి ఆకలి తీర్చి. . కనిపించని అమ్మ తాన య్యింది. ఒక్కటా రెండా? ఏం చేస్తే ఈ తల్లి రుణం తీర్చుకోగలమని ఆలోచించాలి గాని. దైవం కన్నా మిన్న అయినా ఈ అడవి తల్లి ప్రాణాలు తీయటం కన్నా ఘోరం ఇంకేమైనా ఉందా? 
నా మాటలు మీకు సబబు అనిపిస్తే వచ్చిన దారినే తిరిగి వెళ్ళండి. లేకపోతే ఆ పై మీ ఇష్టం .అంటూ గంప నెత్తుకుని వెనుదిరిగింది మధిర. అమ్మా మధిర చిన్నపిల్లవే అయినా మా కళ్ళు తెరిపించావు. తప్పైపోయింది. బుద్ధొచ్చింది. మమ్మల్ని క్షమించు తల్లిీ. అని గొడ్డల్లు కొడవల్లు అచటపడేసి. అడవి తల్లికి సాష్టాంగ ప్రణామాలు చేసి. వెను దిరిగిపోయింది ఆ దొంగల ముఠా! వారిలో వచ్చిన మార్పు కి
చిన్ని మధిర మనసు ఆనందంతో పొంగిపోయింది.

.

కామెంట్‌లు