అక్షర అశ్వం"...గుర్రం జాషువా..!:- "కవి రత్న"-"సాహితీ ధీర"-"సహస్ర కవి భూషణ్"-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
అంటరానితనమనే
అగ్నిగుండంలో జనియించిన
"అగ్నిపుత్రుడు" గుర్రం జాషువా..!

పేదరికమే గురువుగా...
అక్షరమే ఆయుధంగా...
సాహితీ రణభేరిని మ్రోగించిన
నాటి మేటి కవులైన విశ్వనాథ,
కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీలతో పోటీపడి
పద్యబాణాలతో విప్లవ జ్వాలలు
రగిలించిన "అక్షరఅల్లూరి" గుర్రం జాషువా..!

అంబేద్కర్ ఆశయాల జ్యోతిని
విశ్వమంతా వెలిగించిన"సమతావాది"..!
కులం కరాళ నృత్యం చేస్తున్నా
ఏడు ఖండకావ్యాలతో ఆత్మగౌరవ రాగం
ఆలపించిన..."నవయుగ కవి చక్రవర్తి"...!

కాళిదాసు
మేఘసందేశంలా...
అస్పృశ్యత మంటల్లో
దహించుకుపోయే
తన జాతికి "అక్షరార్చన" చేసి...
గబ్బిలంతో గగనమంత ...
"పక్షి సందేశాన్ని పరమేశ్వరునికి" పంపిన "అక్షరదాసు,అక్షర పిపాసి"గుర్రం జాషువా.!

"కలాన్ని కత్తిగా...
"పద్యాన్ని బాణంగా చేసి...
కులవృక్షాన్ని కూకటి వేళ్ళతో
సహా పెకలించి వేసిన...
"సాహితీ సమరయోధుడు"..
"సంఘసంస్కర్త"... గుర్రం జాషువా..!

"పీడిత ప్రజల పిల్లనగ్రోవిగా"
కార్మిక...కర్షక...రైతు కూలీల...
కన్నీటి గాథల్ని ఆలపించిన...కవికోకిల..!

విధివంచితుల విషాద గీతాలను
విశ్వ వేదికలపై వినిపించిన...
"సాహితీ శంఖారావాన్ని" పూరించిన...
"విశ్వనరుడు"...గుర్రం జాషువా...!

కళాప్రపూర్ణ పద్మభూషణ్ వంటి ఎన్నో
ప్రతిష్టాత్మకమైన అవార్డులందుకున్నా...
శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిచే కాలికి"గండపెండేరాన్ని"తొడిగించుకున్నా..!

గుండెల్లో దిగింది కులం బాకులని...చుట్టూ
మతం ముళ్ళులేనని..కులం కుళ్ళేనని...
కుమిలిపోతూ చిట్టచివరి శ్వాస వరకు
"కులమత రహిత నవసమాజం" కోసం
"తపించిన సమానత్వ సౌభ్రాతృత్వ
"సాహితీ శిల్పాలు" చెక్కిన...
"అక్షర శిల్పి"..! గుర్రం జాషువా..!

కలం మంటలతో...
కవితా కాంతులతో...
జాతి చీకట్లను చీల్చిన
అరుణోదయ "అక్షర కిరణం"...
సాహితీ సమరం సాగించి
సాంఘిక దురాచారాలను సమాధి చేసిన... 
నవ సమాజం నిర్మాణానికి పునాది వేసిన...
కందుకూరి వీరేశలింగం...
చిలకమర్తి...గురజాడల వారసుడు...
"మరణంలేని మహాకవి" గుర్రం జాషువా..!
అట్టి మహనీయునికిదే నా అక్షర నీరాజనం..!




కామెంట్‌లు