మొక్కను బ్రతిమిలాడా –
రోజూ ఒకపువ్వు ఇవ్వమని,
చెట్టును బ్రతిమిలాడా –
నిత్యమూ ఒకపండు పంచమని.
నోటిని అడిగా –
తేనె చుక్కలు చిందమని,
పెదవులను అడిగా –
అమృత రసమును అందించమని.
అక్షరాలను కోరా –
అద్భుతంగా అందంగా అమరమని,
పదాలను కోరా –
పసందుగా ప్రేమగా కూడమని.
చేతిని వేడుకున్నా –
చక్కగా తియ్యగా వ్రాయమని,
మోమును వేడుకున్నా –
కుషీగా దేదీప్యంగా మెరవమని.
కలాన్ని అర్ధించా –
కదిలి కమ్మగా కూర్చమని,
కాగితాన్ని అర్ధించా –
నిలిచి పూర్తిగా నిండమని.
కవితను ప్రార్థించా –
కరుణ జల్లులు కురిపించమని,
విషయమును ప్రార్థించా –
విశ్వ రూపము ప్రదర్శించమని.
పత్రికలకు మనవిచేశా –
ముచ్చటగా ముఖ్యంగా ముద్రించమని,
ప్రచారమాధ్యమాలకు మనవిచేశా –
ప్రసిద్ధి ప్రాచుర్యము కలిగించమని.
గాయకులను అభ్యర్ధించా –
శ్రావ్యంగా మధురంగా పాడమని,
శ్రోతలను అభ్యర్ధించా –
మొత్తాన్ని మౌనముగా ఆలకించమని.
సాహితీవేదికలను వేడుకున్నా –
స్వాగతించి అవకాశం ఇవ్వమని,
ముఖ్య అతిథులను వేడుకున్నా –
నాలుగు మంచిమాటలు చెప్పమని.
మదిలోనితపనను విన్నవించా -
అంతరంగ గళమును తెరిచా,
హృదయస్పందనను తెలిపా
సాహితీ మిత్రులను పలకరించా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి