సుప్రభాత కవిత : - బృంద
గుండెను తట్టి మేలుకొలిపే
నిండైన వెలుగుల బింబము
కోటి వరాలు మూటగా చేసి
కుమ్మరించే దైవము.

దినమును బహుమతి ఇచ్చి
దిగులును తీర్చే వేకువగా
దిక్కు తోచని హృదయాలను
అక్కున చేర్చుకునే తండ్రి!

కనుపాపలు కన్న కలలు 
కనురెప్పకు తెలియకపోయినా 
కనికరించి కల వరింపచేసి
కరుణతో ఏలే లోకాల ప్రభువు!

చేసిన తప్పులు చూసి 
చేయని మంచిని తెలిసి 
చెరగని లెక్కలు వేసి
వదలక శిక్షించే సమవర్తి!

వీడని చిక్కుల ముళ్ళకు
వాడని ఆశల చివుళ్లుఇచ్చి
తోడుగా ఉంటానంటూ
వీడక వెంట నడిచే మిత్రుడు

ఆవరించిన కాంతులతో 
అఖిల చరాచర  జగత్తును 
ఆదరించి అనుంగు బిడ్డగా
అవనిని రక్షించు అంతర్యామికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు