జెండా మోసి జై కొడితే...?:- కవిరత్న-సాహిత్య ధీర-సహస్రకవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
గుడిమెట్లు ఎక్కితే...
గుడిలో కాలు పెడితే...
అగ్రకులంలో పుడితే...చాలు
రాజకీయ నాయకుల
అండ దండలుంటే...చాలు

ఎంత పెద్దనేరాలు చేసినా
ఎన్ని దోపిడీలు దౌర్జన్యాలు
హత్యలు చేసినా...
ఎవరిని ఎంతగా హింసించి
క్రూరంగా మట్టు పెట్టినా...
ఖరీదైన కార్లలో కాలరెగరేస్తూ
వీధుల్లో దర్జాగా విచ్చలవిడిగా
వీరవిహారం చేయవచ్చు...
సులభంగా తప్పించుకొని తిరగవచ్చు...

పెద్దలు గద్దలై వారికి
శిక్ష పడకుండా తప్పిస్తారు
చీమ కుట్టకుండా చూస్తారు
రౌడీ షీటర్లుగా ముద్రపడినా
తప్పులెన్ని చేసినా వారు నిర్దోషులే...

కానీ ...
అజ్ఞానంతో...
అమాయకత్వంతో...
అనాలోచితంగా...
ఆవేశపూరితంగా...
కోతలుకోసే నేతలకు బానిసలైన
బహుజన యువతీ యువకులే...

పోలీసు స్టేషన్ల కోర్టుల చుట్టూ
న్యాయం కావాలంటూ...తిరుగుతూ...
ఏళ్ల తరబడి జైళ్ళల్లో మగ్గుతూ...
చేయని నేరానికి...శిక్షలు అనుభవిస్తూ...
ఎన్కౌంటర్లలో మరణిస్తుంటారు...

జెండాలు మోసి...జై కొట్టినా...
అగ్రనాయకుల అండదండలు లేక
దిక్కులేని కుక్క బ్రతుకులు బ్రతికే అజ్ఞానాంధకారంలో మునిగితేలే...
బహుజన యువత పచ్చనిజీవితాల్ని
బంగారు భవిష్యత్తును ఛిద్రం చేసింది
వారిని ఆటబొమ్మల్లా వాడుకున్నది...
వారి ప్రాణాలతో ఆడుకున్నది అగ్రకులమే
నయవంచకులైన రాజకీయ నాయకులే...

అట్టి దుఃఖితులకు..‌
అట్టి దురదృష్టవంతులకు..‌.
ఎప్పుడు...? ఎప్పుడు...?
బానిసత్వపు బ్రతుకుల నుండి
విముక్తి ఎప్పుడు..?
వారు స్వేచ్ఛ వాయువులు
పీల్చేదెప్పుడు..?

సత్యాన్ని శోధించినప్పుడు...
నిప్పులాంటి
నిజాల్ని గ్రహించినప్పుడు...
పిడికిలి బిగించినప్పుడు...
కళ్ళల్లో నిప్పులు కురిసినప్పుడు...
జ్ఞానామృతాన్ని సేవించినప్పుడు... 
మొద్దునిద్ర నుండి మేల్కొన్నప్పుడు...
గుండెల్లో చైతన్యజ్వాలలు రగిలినప్పుడు
కండరాలు బానిసత్వపు
బండరాళ్లను బద్దలు చేసినప్పుడు...

అప్పుడే...అప్పుడే
విముక్తి అప్పుడే..‌.
గుడిసెల్లో కాకుండా
పైకులంలో పుట్టినప్పుడే...
గుడిలో అడుగుపెట్టినప్పుడే...
గడ్డిపరకల్లా కాక
గండ్రగొడ్డళ్ళుగా మారినప్పుడే...

వీరులై...
శూరులై...
విక్రమార్కులై...
అరివీర భయంకరులై...
విజ్ఞానజ్యోతిని చేపట్టి విశ్వవేదికలపై
విప్లవ శంఖారావాన్ని పూరించినప్పుడే...
విప్లవకారులై ఉద్యమంలో దూకినప్పుడే..
పోరాడి అసువులుబాసి అమరులైనప్పుడే
చిరునవ్వులు...
చిందిస్తూ చితికి చేరి..చిరంజీవులైనప్పుడే.

ఓ బహుజన యువతీ యువకులారా..!
ఇక ఎప్పుడో  ఆ కదిలే కాలమే...
మీరు ఆర్జించిన ఆ విజ్ఞానమే...
మీలో జ్వలించే ఆ చైతన్యమే...నిర్ణయించాలి...
అంబేద్కర్ అమృత బోధనలే
రక్షణ కవచమై మిమ్మల్ని రక్షించాలి...జై భీమ్...



కామెంట్‌లు