దూరాన గగనాన ఊరేగు
వెలుగుల తేరు మెరుపులు
గిరుల మధ్యన తూరుపున
కాంచన కలశపు కాంతులు
వేకువ ఎపుడూ నిశ్శబ్దమే!
నల్లటి రేగడి చాటున
దాగిన ధాన్యపు గింజలు
నేలను చీల్చుకుని మొలకై
పచ్చగ ఎదిగే ప్రక్రియ..
చప్పుడు చేయని నిశ్శబ్దం!
మెచ్చిన వెచ్చని కలలు
ముచ్చటగా అల్లుకున్న
చక్కని ఆశల పందిరికి
చుక్కలు చూపే దారి
ఒక్కరికే సొంతమైన నిశ్శబ్దం!
వలపుల వలలో చిక్కి
విలవిలాలాడే మనసును
ఊహల ఉయ్యాలూపి
మధుర భావ లహరిలో
తేలించే హాయిది నిశ్శబ్దమే!
తొలగిన భ్రమల నడుమ
కరిగిన కలల శిఖరపు
ధారల తడిసిన మమతల
దోవ తెలియక తారాడే
విరిగిన ఎడదల సవ్వడి నిశ్శబ్దమే!
వేచిన వేకువ కోసం
కాచిన మనసుల తొందర
దాచిన సంతోషపు హోరు
పెదవుల దాటని నవ్వుల జోరు
అనుభవైక్యవేద్యమైన నిశ్శబ్దం!
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి