శ్మశానచైతన్యం:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 ఒక‌ జాతి అస్తిత్వానికి స్మశానం 
లేకపోవడమే కారణమా?
బలవంతపు మతమార్పిడి
అనివార్యమా?
పరాయి దేశంలో బతుకుకు
వ్యూహమే కావాలా?
అందరూ చేరేది అక్కడికే అయినప్పుడు,
విభజన జరుగక తప్పదా?
మానవత మచ్చుకు కూడా
కనబడనపుడు,
మనిషి మారిపోతాడా?
మనుగడ కొనసాగిస్తాడా?
మార్గమేదీ కనిపించనపుడు,
మమతలు దోబూచులాడినప్పుడు,
మథన ప్రారంభమవుతుందా?
సూచే లేనప్పుడు దిక్సూచి ఎక్కడి నుండి కనిపిస్తుంది?
సూత్రాలన్నీ తక్కెడలో వేసి తూచబడినప్పుడు,
సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేయగలవా?
శక్తి లేక,చేవ చచ్చి,నిన్ను నీవు
కాపాడుకోవడమే లక్ష్యమవుతుందా?
చిక్కబడిన చేతన చితిని పేర్చుకునేందుకు పనికి వచ్చిందా?
తప్పని బలవంతపు బాధ ఎదురునిలిచి,
సునయనజలాలు పవిత్రం చేస్తుంటే,
చేష్టలుడిగిన జాతి,వికాసమెట్లా కోరుతుంది?
వైరాగ్యమే వెంటపడి సాధించినపుడు,
బంధమెంత బలంగా ఉండగలుగుతుంది?
పరాయీకరణలో పాత్రల ఔచిత్యమే ప్రశ్నించబడ్డప్పుడు,
మరుభూమిలో చోటు కోసం,
మడతపెట్టబడిన సహజత్వం,
శాసించే శాసనాల కింద నలిగిపోదా?
భాష భారమైనప్పుడు,
యాస శ్వాస తీస్తున్నప్పుడు,
చెట్టుకు కాయ బరువవుతుందా?
కట్టే కాలే వరకు,కపాల శబ్దమవనంతవరకు,
మరుజన్మకు ఆత్మ విడవనప్పుడు,
మానవుడు అమరుడయ్యేందుకు
తావులు దొరుకుతాయా?
అస్తిత్వ పోరాటంలో చిరునామా మారితే,
చితి చింత చల్లారేవరకు చిత్రమైనా,
పరకాయప్రవేశం చేయక తప్పదేమో?
బతకాలంటే మరొక్కసారి మరణించాలేమో?
సింహళమైనా,ఈలమైనా,
తమిళమైనా,తెలుగైనా మేను
పులకరించకున్నా మెదడు మొద్దుబారకుండా చూసుకొనుడే విచక్షణా?
ఏది ఏమైనా,ఎవరెక్కడున్నా,
దైవసన్నిధికి దారెటు?

(డా.పత్తిపాక మోహన్ గారు శ్రీలంకలో పరాయి దేశస్తులు చచ్చిపోతే శ్మశానం లేని కారణంగా పరమతంలోకి వెళ్ళిపోక తప్పని పరిస్థితులు ఎదుర్కొంటున్న వారి గురించి చెప్పినప్పుడు స్పందనగా వ్రాసిన కవిత)
కామెంట్‌లు