శరవేగంగా: - సరికొండ శ్రీనివాసరాజు
 రాము క్రికెట్ చూస్తున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 50 ఓవర్లలో 260 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని తన అభిమాన జట్టు ఛేదిస్తుందా లేదా అని రాము టెన్షన్ పడ్డాడు. 261 విజయలక్యంతో దిగిన రాము అభిమాన జట్టు ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఎదురుదాడికి దిగింది. అవకాశం చిక్కినప్పుడల్లా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ శరవేగంగా 25 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయం సాధించింది. రామూకు ఈ ఆట మంచి ప్రేరణ అయింది. 
       రాము ఇప్పుడు 10వ తరగతికి వచ్చాడు. ఉపాధ్యాయులు అందరూ చెప్పే పాఠాలను ఏకాగ్రతతో వింటూ, ఇంటివద్ద ఏరోజు పాఠాలను ఆరోజే చదువుకుంటూ మధ్య మధ్యలో రివిజన్ చేసుకుంటూ ఉన్నాడు. అన్ని సబ్జెక్టుల సిలబస్ డిసెంబరుతోనే పూర్తి అయింది. ఎప్పటి పాఠాలను అప్పుడే చదువుతూ, మధ్య మధ్యన రివిజన్ చేసుకుంటూ డిసెంబర్ పూర్తి అయ్యే నాటికే రాము మొత్తం సిలబస్ నేర్చుకున్నాడు. రాము శరవేగంగా టెన్త్ సిలబస్ పర్ఫెక్టుగా నేర్చుకున్నాడు. మిగిలిన రెండున్నర నెలలను ఆడుతూ పాడుతూ గడిపాడు. ఇంట్లో 7వ తరగతి చదువుతున్న తన చెల్లికి చదువులో సహాయం చేశాడు. ఇంట్లో పూర్తిగా చెల్లెలికే సమయం కేటాయించినాడు. పాఠశాలలో ఈ రెండున్నర నెలలను తోటి స్నేహితులను తనంత తెలివైన వారిని చేయడానికి శతదా సహస్రదా ప్రయత్నించాడు. రాము కృషివల్ల మరింత మంది విద్యార్థులు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించినారు. 

కామెంట్‌లు