సామెత -14 : అడకత్తెరలో పోక చెక్కోలె
****
గొడ్ల మందను అల్లిస్తూ పెద్ద బాయి చెట్టుకిందకి నీడకని ఎళ్ళిన అవ్వకు అక్కడ కూకోని ఆకాశమొంక సూత్తున్న నర్సిమ్మ కన్పించిండు.
" ఏందిరా మన్వడా! సెట్టంత మడిసిని నడిసొచ్చే సప్పుడు సెవికి సోకనే లేదా! కాసింత గట్టిగ నిష్టూరంగా అన్న మాటలకు తలదిప్పి"
"అయ్యో! అవ్వా! అమ్మ తోడు! ఇన్రాలే.ఒట్టు అన్నడు.
" ఉత్తగనే నిన్ను ఉడికిద్దమని అన్నగని. గదేంది మన్వడా! తిండి తినక ఎన్రోజులైంది. మొగమంత గట్ల పీక్కుపోయింది.గట్లున్నవేంది? నాకు సెప్పగూడని యిసయమా? ఎదురుంగ బండమీద కొంగుతో దులిపి కూసుంటూ" అంది.
ఏం జెప్పనవ్వా! నువ్వు ఆర్చేది తీర్చేది గాదులే! మద్దెల నేను బలంతంగ ఆరిపోవల్సిందే?"
గదేంద్రిరా ఒక్కపాలె గంతలావు మాటన్నవ్. ఇంకోపాలి అనబాకు.కట్టాలు కలకాలం కాపురం ఉండవ్.రేయెనక పగలోలె సుఖాలొత్తయి.
గంత అదృట్టం నా మొఖాన రాసిండంటవా? "మింగమంటే కప్పక్కోపం.ఇడువ మంటె పాముక్కోపం" అన్నట్టుంది. ఆళ్ళు పాం కప్పలు కాదే అవ్వా! పాం ముంగిసలు. దినాం కొంపల రసరసే సన్నాసం బుచ్చుకొని ఎటైనా పోతే బాగుండు అనిపిస్తాంది."
"ఆగకుండా సొద జెప్తున్న నర్సిమ్మను అడ్డుకుంట నీ అమ్మ,పెళ్ళామేనా? నిన్నిట్ట ఆగమాగం చేసేది ? మొన్న మొన్నటి దాకా బాగనే ఉండ్రి గదరా. గిట్లెట్ట మారిండ్రు? అయ్యో నాయినా! అడకత్తెరలో పోక చెక్కోలె అయ్యిందా? నీ బతుకు.
అవునే అవ్వా! ఆకాడికి నెత్తి నోరు కొట్టుకోని జెప్పిన. గీ మట్టి బిసుక్కుని బతికేటోడికి గా పట్నం పిల్ల వద్దే అంటే ఇన్నదా? ఆ పొల్లకు పల్లె అంటె ఇట్టం.చెట్టూ చేమంటె ఇట్టమటరా! నీకెట్టాగూ సదువబ్బలేదు.కొంచం సదువుకున్న పొల్లయితే రేప్రేపు పుట్టేటోళ్ళకు అదే కూసబెట్టి సక్కంగ జెప్పుకుంటదని బుదగరిచ్చి లగ్గం జేసింది. గిప్పుడు సూడు. పట్నం బోదామని ఒకటే లొల్లి.గా మాట ఇన్న కానించి అమ్మ అగ్గిమీద గుగ్గిలమై ఒకటే ఒర్రుడు.ఇద్దరి మద్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటాంది. దానికేం దెయ్యం బట్టిందో! గిట్ల తయ్యారయ్యింది.నేను గావాల్నా!మీ అమ్మ గావాల్న తేల్సుకో అంటుంది.
"అమ్మేమో దాని మాటలిని లంకంత కొంప,పాడి, పచ్చని సంసారం వదిలెస్కొని ఆడెట్ల నీతో వత్తడు అంటది. ఆళ్ళ ఆళ్ళు పందెం కోళ్ళోలె తిట్టుకోడమే గని నా సంగతి,నా మనసు పట్టించుకోట్లే అవ్వా!
ఒరెయ్ మన్వడా! నువ్వే అన్నవ్ గద.దెయ్యం పట్టిందా అని.నిజమేరా! అమ్మగారింట్ల ప్రతి దాన్కి బయటకెళ్ళి తెచ్చుకునుడాయె. ఇక్కడ నౌకర్లు,చాకర్లతో కడుపులో సల్ల కదలకుండ కూసబెట్టి ఏ మాత్తరం కందకుండ సూస్కుంటున్నవ్. "ఖాళీ బుర్రకాయలో దెయ్యాలు దూర్తయని ఊకెనే అన్లె. ఇయ్యాల పొద్దుగుంకినంక నీ పెళ్ళాన్ని ఎంటబెట్టుకుని రా! నిచ్చింత గుండు." అవ్వ మాటలకు సంబర పడి పోయిండు.
బాగున్నవ మన్వరాలా? అంటూ ముచ్చట్లకు దించి మనసును కాచి వడపోసింది. పెద్దబల్లె సదివే పొల్లగాండ్లకు పొద్దున్న, సందేళ ఇంగిలీసు, లెక్కలు సెప్పేలా ఒప్పించింది. మద్దేనం తనకు నచ్చిన కుట్టుడో అల్లుడో,బొమ్మలేసుడో,రాసుడో చేసుకొమ్మని.గావాటికి ఏమేం గావల్నో నర్సిమ్మతో పట్నమెళ్ళి తెచ్చుకోమంది.గదంతా ఇంటున్న భూలచ్మి అక్కా! అక్కా! నేనొత్త టూషన్కి " అంటుంటే సంబురంగ సరేనంది.
ఇద్దరూ అవ్వ కాళ్ళు మొక్కుతుంటె ఒరేయ్! మన్వడా! ఆరానికో,పది రోజుల్కో మీ యమ్మను నా తానకు పంపి సిన్మాకు తీస్కపో! దాని ఇట్టాలూ కనిపెట్టాలె.నోరు దెర్సి అన్ని జెప్పలేరు.
ఒసే మన్వరాలా! ఏదన్న తేడా వత్తె జెప్పు అనంగనే "వామ్మో!గిప్పుడు నేను అవ్వ మన్వరాలి మద్దెన పోక చెక్క అయ్యేట్టున్న గద " అంటున్న నర్సిమ్మ మాటకు అర్థం తెల్వక "అవ్వా! అడకత్తెరా? గదెట్లుంటది? అడిగింది భూలచ్మి.
పాన్ దాన్ పెట్టె దీసి సూపెడ్తూ అందులోని తమల పాకులో వక్కని బెట్టి ముక్కల్జేసి రెండు పాన్లు గట్టి ఆళ్ళిద్దరికిప్పించింది.
గదండీ సంగతి! "అడకత్తెరలో పోక చెక్కోలె" అంటే ఇద్దరు ఇష్టమైనోళ్ళ మద్దెన నలిగే మూడో వ్యక్తి పరిస్థితిని గిట్లంటరన్న మాట.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి