శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - వ్యాఖ్యానము - భాగం - 10
 ఆదిశన్కర భగవత్పాదుల అంతటి మహనీయుడు శ్రీ భాస్కరరాయలు వారు, అని లలితా పరా భట్టారిక చేత చెప్పబడిన శ్రీ భాస్కరరాయలవారి చరితము తెలుసుకుందాము.
"సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
శ్రీ భాస్కరరాయలవారి జీవిత కాలంలో అనేక మహిమాన్వితమైన విషయాలు జరిగాయి. మనం మచ్చుకు ఒక నాలుగు మహిమా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.....
శ్రీ భాస్కరరాయలు వారు తమ చివరి దశలో, తంజావూరు రాజులు, వారికి బహుకరించిన మధ్యార్జునక్షేత్రం, నేటి తిరువిడైమరుదూరు గ్రామంలో వున్నారు. వారి శిష్యులు, ప్రశిష్యులు,  భాస్కరరాయలు వారి, సిద్ధాంతాలు, సంప్రదాయాలు ఆధారంగా చేసుకుని, అద్వైత సిద్ధాంతాన్ని, శ్రీవిద్యా రహస్యాలను, శ్రీవిద్యా ఉపాసనను ఈ భూమి నాలుగు వైపులా ప్రచారం చేసారు. 
శ్రీ భాస్కరరాయలు వారు చండభాస్కరము, రసికరంజని, శ్రీ సూక్త భాష్యము మొదలైన 18 రచనలు చేసారు. కొన్ని లభ్యమౌతున్నాయి. 
శ్రీ భాస్కరరాయలు వారు తమ 93/95 వ ఏట, అంటే 1776/1785 సం.లో శ్రీలలితా మహాత్రిపురసుందరి లో ఐక్యమయ్యారు, అని చరిత్రకారుల మాట.
అయితే, శ్రీలలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యము రాయాలని శ్రీవిద్యరణ్య స్వామి గారు కూడా ప్రయత్నం చేసారు. కానీ, అమ్మ అనుజ్ఞ ఇవ్వలేదు, శన్కరభగవద్పాదులకు ఇవ్వనట్లే. అయినా తమ ప్రయత్నాలను కొనాసాగించాలి అనుకున్నారు, విద్యారణ్య స్వామి. దాని ఫలితంగా, వారి బుద్ధి, చూపు మందగిస్తుంది, అమ్మ వద్దని చెప్పినా వినకపోవడంతో.
ఇక, అతి రహస్యమైన ఈ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము బ్రహ్మాండ పురాణం లో, శ్రీలలితోపాఖ్యానము లోనిది. అమ్మ, స్వయంగా వశిన్యాది ఎనిమిది మంది (వశిని, కామేశ్వరీ, మోదినీ, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని) వాగ్దేవతలతో వ్రాయించినవి. ఈ అష్ట వాగ్దేవతలు కలిసిన రూపమే, భాస్కరరాయలు గారు. అందువల్లనే, శ్రీలలితా సహస్రనామ స్తోత్ర భాష్యము సంపూర్ణముగా, పామరులకు కూడా అర్ధం అయ్యేలా చేయగలిగారు.
శ్రీ భాస్కరరాయలు వారు ఒక యోగి. మహోపాసకుడు. పూర్ణదీక్షాపరుడు. ఇంతటి మహాపురుషుడు, ఆదిశంకరుల సమానుడు, మన భారతదేశంలో పుట్టడం గొప్ప విషయం. అందునా మన తెలుగు వారు అవడం మన అందరి మహద్భాగ్యము. గర్వకారణము.
శ్రీలలితా సహస్రనామములు - అక్షరక్రమ నామ సంఖ్య రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు