*****
"ఏందవ్వా! నీ కళ్ళేంది గట్ల ఊట శెల్మిలైనయి. అప్పగింతలు పెడ్తున్న గా పిల్ల అమ్మ నాయిన సుత నీవొతికె గింతగనం ఏడ్వట్లే. పెండ్లిపిల్ల పెద్దలకి దండాలు పెడుతుంది జూస్కుంట నువ్వేంది కొంగడ్డం బెట్కొని గిట్ల ఎక్కిళ్ళు బెట్తున్నవ్" అవ్వని దగ్గరికి తీస్కుని ఊకుండ బెట్తుంటే...
" కళ్ళు తుడ్సుకుంట "ఏమోనే శెల్లె నా లగ్గం యాది కొచ్చింది. అమ్మ నాయిన నన్ను అత్తోళ్ళకు అప్పగింతలు బెట్టి పెద్దల కాళ్ళు మొక్కిత్తుంటే "నేను బోను మిమ్మల్ని యిడ్సి అని నేను ఎక్కెక్కి ఏడుత్తుంటే అమ్మలక్కలు ఇంకాత్త ఏడిపిచ్చుకుంట అన్న మాటలు యాదికొచ్చినయ్. ఇంగ దుఃఖమాగలె". తడైన కళ్ళను మల్లోపాలి తుడ్సుకుంటుంటే...
"అయ్యో! గంతగనం మాటల్తో నొప్పించిడ్రా ఆళ్ళు. గాళ్ళేం మడుసులు.బడే బాద్దరోల్లే. గింతకీ ఏమన్నరక్కా .."
" అందరి కాళ్ళు మొక్కినా అత్తోరింటికి పోక తప్పదే. ఇంగ ఆ యింట్ల దీపం ముట్టిచ్చేది నువ్వే దీపమై ఎలిగేది నువ్వే. కొత్త తగ్గేదనుక బెర్కుబెర్కుమన్నట్టుంటది.ఆటెంక మాలెక్క అయితవు తీ" అన్నరు.గవన్ని మతికొచ్చినయ్"
"ఇంతకీ పెండ్లిపిల్ల,పెండ్లి పిలగాడు ఏడున్నరు శెల్లె! దండాలు బెట్టుడు అయ్యిందా? గా పిల్ల ఇంక గట్లనే ఏడ్వబట్టిందా?
"పకపక నవ్వుకుంట ఓ అవ్వా! గాళ్ళు అగ్గో అక్కడ కూకోని ముచ్చట్లు బెట్టుకుంటున్రు.నువ్వు అన్నిట్ల ముందున్నవ్ గని! గిందుల మస్తెనకబడ్డవే.
"గిప్పుడు సామెత తిరగ మరగ అయ్యింది.అంతగనం అందరి కాళ్ళకు మొక్కుడు లేదు.అత్తోరింటికి పోతున్నమని ఏడ్సుడు తూడ్సుడు లేదు.అత్త మీద కాపురాలు ఎప్పుడో పోయినయి.మొగుడికో,పెళ్ళానికో- ఇద్దరికో సిన్నదో పెద్దదో ఉద్దోగమని బయటికెళ్తున్నరు.ఇంగ ఈ ఏడ్పులు ఆర్పులత్తో పనేముంది. గాళ్ళ మొకాలు జూసినవ్ గద. ఏదో శాస్తర ప్రకారం గీ తంతు చేయిత్తున్నరంతే. కాలం మారిందే అవ్వా! అప్పటి లెక్క గాదు...
"నిజమే గక్కడ అదంత జూసినంక అవ్వకు సుత నవ్వొచ్చింది.ఆటెంక ఎక్కల్లేని సిగ్గు ముంచుకొచ్చింది.
అవ్వనలా జూడటం అందర్కీ బలే ముచ్చటగా అన్పిచ్చింది.
గదండీ సంగతి " అందరి కాళ్ళకు మొక్కినా అత్తోరింటికి పోక తప్పదు" అంటే పెద్దలకి దండాలు అని వాళ్ళు పెట్టిస్తరు.పెండ్లిపిల్ల మన్సులోనేమో గింత మందికి బెడ్తున్న గద.అత్తింటికి పంపొద్దని ఎవలన్న ఆపితే బాగుండు.అత్తోరింటికి పోయె బాధ తప్పతది అన్కుంటదట. అప్పుడంత చిన్నతనాన పెండ్లిండ్లు. ఆ రోజులకు ఈ రోజులకు ఎంత మార్పు వచ్చిందో అందరికీ తెలుసు.
సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి