మిత్రభేదం :- సరికొండ శ్రీనివాసరాజు

 10వ తరగతిలో కొత్తగా ప్రవేశించింది శ్రావణి. శ్రావణి చాలా తెలివైన అమ్మాయి. అదే తరగతిలో శర్వాణీ అనే అమ్మాయి కూడా చదువుతుంది. శర్వాణీ చిన్నప్పటి నుంచీ అదే తరగతి చదువుతున్నది. మొదటి నుంచీ శర్వాణీ క్లాస్ ఫస్ట్ వచ్చేది. శర్వాణీకి చిన్నప్పటి నుంచీ పోటీ అనేదే లేదు. ఇప్పుడు పదవ తరగతిలో శ్రావణీ అనే అమ్మాయి ప్రవేశించి శర్వాణీకి పోటీగా తయారవుతుంది. కొన్ని విషయాలలో శర్వాణిని మించిపోతుంది. శర్వాణీ శ్రావణి మీద ఈర్ష్య పెంచుకుంది. శ్రావణితో అస్సలు మాట్లాడదు. ఇది శ్రావణిని ఎంతో బాధ పెట్టింది. రాను రాను శ్రావణికి కూడా శర్వాణి మీద బీభత్సమైన కోపం పెరిగిపోయింది. 
     ఉపాధ్యాయులు ఇద్దరిలో ఎవరిని పొగిడినా ఇంకొకరు ఓర్వలేరు. వాళ్లకు కోపం, ఏడుపు వస్తుంది. వీళ్ళ సంగతి తెలిసి వీళ్ళను కలపాలని తెలుగు ఉపాధ్యాయులు వేంకటేశం గారు భగీరథ ప్రయత్నం చేసినారు. విఫలమయ్యారు. కలసి ఉంటే ఎన్ని లాభాలు ఉంటాయో హిందీ ఉపాధ్యాయులు రాజేశ్ గారు ఎన్నో కథలు చెప్పినారు. లాభం లేకపోయింది. 
     ఒకరోజు బయట శ్రావణికి శర్వాణీ ఎదురైంది. శర్వాణీ శ్రావణితో "నేను నాస్కూలులో తిరుగులేని నంబర్ వన్ స్టుడెంటుగా చిన్నప్పటి నుంచీ ఉన్నాను. నువ్వు అడుగు పెట్టాకనే నాకు గుర్తింపు పోయింది. మర్యాదగా ఈ స్కూలు నుంచి మరొ స్కూలుకు వెళ్ళిపో." అన్నది కన్నైర్రజేస్తూ. "ఈ స్కూలు మీ తాతలు కట్టించారా? లేక మీ ఆస్తినా? నేను వెళ్ళను." అని మరింత పెరిగింది. గొడవ శ్రుతిమించింది. అప్పుడే అక్కడకు వచ్చింది లలిత అనె పెద్దావిడ. ఇద్దరినీ కోప్పడ్డది. ఇద్దరినీ నోరు మూయించింది. ఇద్దరినీ వాళ్ల పేర్లు, వివరాలు అడిగింది. వాళ్ల అమ్నా నాన్నల పేర్లు అడిగింది. వాళ్ల అమ్మమ్మల, నాయనమ్మల పేర్లు అడిగింది. ఆశ్చర్యపోయింది.
       "చిట్టితల్లులూ మీ ఇద్దరూ నాకు చిన్నప్పుడు తెలుసు. మీరు చిన్నతనంలో ప్రాణ స్నేహితులు." అన్నది లలిత. ఆశ్చర్యపోయారు ఇద్దరూ. "మీరిద్దరూ సొంత అక్కా చెల్లెళ్ళ పిల్లలు." అన్నది లలిత మరింత ఆశ్చర్యపోయారు. "మీ అమ్మమ్మ ఇంటి పక్కనే మా ఇల్లు. మీ అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడల్లా ఒకరంటే మరొకరు ప్రాణంగా ఉండేవాళ్ళు." అంటు వారిద్దరూ చిన్నప్పుడు కలసి ఆడుకున్న ఆటలు, ఇద్దరూ కలసి ఊరంతా తిరుగుతూ చేసిన అల్లరి వాళ్ల అమ్మలు ఊరికి బయలుదేరుతుంటే ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఏడ్చిన ఏడుపులూ సవివరంగా చెప్పింది. వీరిద్దరూ అయిదేళ్ళ వయసు దాకా సెలవుల్లో అమ్మమ్మ ఇంట్లో కలుసుకునే వాళ్లని ఆ తర్వాత అంటే దాదాపు పదేళ్ల నుంచీ ఇద్దరూ అమ్మమ్మ ఇంటికి రావడం లేదని చెప్పింది లలిత. ఆశ్చర్యపోయారు ఇద్దరూ. "మరి మీ అమ్మలు ఇద్దరూ కలవడం లేదని, ఇద్దరూ కలసి చాలా సంవత్సరాలు అయిందని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. మీ అమ్మమ్మ ఇల్లు కూడా మరచిపోయారు. మీరు కలసిపోవడమే కాక మీ అమ్మలను కలిపే బాధ్యత మీది." అని వెళ్ళిపోయింది లలిత. శ్రావణీ, శర్వాణీలకు చిన్నతనం గుర్తుకు వచ్చింది. ఒకరి మీద మరొకరు పడి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇన్నాళ్ళూ కలసి ఉన్న ప్రాణ మిత్రులు అనవసరమైన ఈర్ష్యా ద్వేషాలతో దూరం పెంచుకున్నందుకు సిగ్గుపడ్డారు. కలసి చదువుకోవడం మొదలు పెట్టినారు. 10వ తరగతి పూర్తి అయ్యాక వేసవి సెలవుల్లో అందరినీ కలసి ఉండేలా చేయాలని నిశ్చయించినారు. 

కామెంట్‌లు