చదువు విలువ: - సరికొండ శ్రీనివాసరాజు
    "నిన్నటి మ్యాచ్ చూశావా? ఈజీ టార్గెట్. ఛేదించలేక మనోళ్ళు చతికిల పడ్డారు. అన్నాడు వాసు. "కెప్టెన్ ఒక్కడే బాగా ఆడినాడు. అతనికి సపోర్ట్ కూడా లేదు. చివరకు కెప్టెన్ కూడా అవుట్ అవడంతో మనోళ్ళు ఓడిపోయారు." అన్నాడు రాము. "నేను చాలా నిరాశ పడ్డాను. డిప్రెషన్ ఎక్కువ కాగా ఏమీ తినకుండా పడుకున్నాను." అన్నాడు వాసు. "శభాష్ మీ దేశభక్తి మెచ్చుకోతగింది.?" అన్నాడు ధనంజయ మాస్టర్. రాము, వాసులు ఉలిక్కిపడ్డారు. "ఇంట్లో మీ అమ్మా నాన్నలు కూడా మీరు చదువులో బాగా రాణించాలని, మార్కులలో భారీ స్కోర్ సాధించాలని ఆశలు పెట్టుకున్నారు. మరి మీరు ఎప్పుడూ తెచ్చుకునే మార్కులు చూసి మీ తల్లిదండ్రులు ఎంత నిరాశ పడుతున్నారో. ఎన్నిసార్లు అన్నం తినడం మానేశారో!" అన్నాడు మాస్టర్. "బాగా చెప్పారు గురువు గారూ! మా తల్లిదండ్రులను మేము ఎప్పుడూ సంతోషపెడతాము. మా మార్కులు చూసి ఎప్పుడూ మంచి బహుమతులు కూడా ఇస్తారు." అన్నారు శ్రుతిలయలు అనే స్నేహితురాళ్ళు. 
     "ముందు చదువులో మీ తెలివితేటలను ప్రదర్శించండి. మీ అమ్మా నాన్నలను సంతోషపెట్టండి." అన్నారు ధనంజయ గారు. ఆ తర్వాత రోజు రాము, వాసులు తమ స్నేహితుడు వేంకటేశాన్ని కలిశారు. జరిగింది చెప్పారు. "ఆ శ్రుతి, లయలు నన్ను అవమానించారు. వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఏం చేయాలి?" అని అడిగారు.  కష్టపడి చదివి, మంచి మార్కులు సాధించి, మార్కులలో వారిని ఓడించండి. వాళ్లు మాట్లాడరు." అన్నాడు వేంకటేశం. వాసు, రాములు పట్టుదలతో క్షణం తీరిక లేకుండా చదువుతున్నారు. వాళ్లకు వచ్చిన మార్కులు చూసి, తల్లిదండ్రులు చాలా సంతోషిచారు. మంచి బహుమతులు ఇచ్చారు. 

కామెంట్‌లు