సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!

 వన పర్వము ద్వితీయాశ్వాసము-* 85వ రోజు
తీర్ధ మహిమ
శివుడు నివసించే దేవికా క్షేత్రాన్ని, కామ క్షేత్రాన్ని, రుద్రతీర్ధాన్ని, బ్రహ్మవాలుకాన్ని, దీర్ఘసత్రాన్ని సేవించిన వారికి అష్ట కామ్య సిద్ధి కలుగుతుంది. వినశనంలో మాయమైన సరస్వతీ నది నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భేద లలో స్నానం చేసిన నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియాన తీర్థం స్నానం సహస్ర గోదాన ఫలం వస్తుంది. రుద్రకోటిలో శివుని అర్చించిన కైలాస ప్రాప్తి లభిస్తుంది. ధర్మజా కురుక్షేత్రం, నైమిశ తీర్థం, పుష్కర తీర్థం అనేవి మూడూ పవిత్ర క్షేత్రాలు. కురుక్షేత్రం సరస్వతీ నదికి దక్షిణంలో దృషద్వతీ నదికి ఉత్తరంలో ఉంది. ఆ కురుక్షేత్రంలో శమంతక పంచకం నడుమ రామహ్రదం అనే సరస్సు మధ్య పితామహుడు బ్రహ్మదేవుని ఉత్తరవేది అనే క్షేత్రం దర్శించిన వారికి సర్వపాపక్షయం కలుగుతుంది. విష్ణు స్థానంలో విష్ణుమూర్తిని పూజించినా, పారిప్లవ తీర్థంలో, శాలుకినీ తీర్థంలో, సర్పతీర్థంలో, వరాహతీర్థంలో, అ శ్వినీ తీర్థంలో, జయంతిలో ఉండే సోమతీర్థంలో, కృతశౌచ తీర్థంలో స్నానమాచరించిన ఎంతో పుణ్య ప్రాప్తి కలుగుతుంది. అగ్నివట క్షేత్రంలో, ముంజవట క్షేత్రంలో శివారాధన చేసినా యక్షిణీ తీర్థంలో స్నానం చేసినా కామ్యసిద్ధి కలుగుతుంది. "ధర్మజా! జమదగ్ని కుమారుడైన పరశురాముడు, తన గొడ్డలితో రాజులందరిని వధించినప్పుడు వారి రక్తం ఐదు పాయలుగా పారింది. వాటిని శమంతక పంచకం అంటారు. అందులో పరశురాముడు తన తండ్రికి తర్పణం విడిచాడు. అప్పుడు పితృదేవతలు సాక్షాత్కరించి వరాలు కోరుకొమ్మని అడిగారు. పరశురాముడు తనకు రాజులను సంహరించిన పాపం నశించాలి అని తనకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకున్నాడు. ఈ శమంతక పంచకం పవిత్రత సంతరించు కోవాలి అని కోరాడు. అప్పటి నుండి శమంతక పంచకం పుణ్యతీర్ధాలుగా భాసిల్లుతున్నాయి. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. కాయసోధనం, లోకోద్ధారం, శ్రీతీర్థం, కపిలతీర్థం, సూర్యతీర్థం, గోభనం, శంఖినీ తీర్థం, యక్షేంద్రతీర్థం, సరస్వతీ నది, మాతృతీర్థం, బ్రహ్మావర్తం, శరవణం, శ్వావిల్లోమాపహం, మానుష తీర్థం, ఆపగ నదీ తీర్థం, సప్తఋషి కుండం, కేదారం, కపిల కేదారం, సరకం, ఇలాస్పదం, కిందానం, కింజప్యం అనే తీర్ధాలలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యాలు కలుగుతాయి . నారద నిర్మిత అంబాజన్మం అనే తీర్థంలో చనిపోతే పుణ్య లోకాలకు పోతారు.పుండరీకం అనే తీర్థంలో ఉన్న వైతరణిలో స్నానమాడినా, ఫలకీ వనం, మిశ్రకం, వ్యాసవనం, మనోజవం, మధువటి, కౌశికీనది, దృషద్వతీ నదీ సంగమంలో సమస్త పాపాలు నశిస్తాయి. కిందర్త తీర్థంలో తిలోదానం చేస్తే పితృ ఋణం తీరితుంది. అహస్సు, సుదినం, అనే తీర్ధాలలో స్నామాచరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. మృగధూమం అనే క్షేత్రంలో గంగా స్నానమాచరించి శివుని ఆరాధించిన అశ్వమేధ ఫలం కలుగుతుంది. వామన తీర్థంలో స్నానం చేస్తే విష్ణు లోకానికి పోతారు. పావన తీర్థంలో స్నానమాచరించిన వంశం పవిత్రమౌతుంది. శ్రీకుంజంలో తీర్ధాన్ని దర్శిస్తే బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. సప్తసారస్వతాలు అనే తీర్థంలో స్నానంచేస్తే సమగ్ర సారస్వతప్రాప్తి కులుగుతుంది. ఔశనశం, కపాలమోచనం, విశ్వా మిత్రం, కార్తికేయం అనే తీర్ధాలలో స్నానమాచరిస్తే పాప విముక్తులౌతారు. పృధూక తీర్థంలో చనిపోతే పాపాల నుండి విముక్తులౌతారు.గంగా, సరస్వతీ సంగమంలో స్నానమాచరిస్తే బ్రహ్మ హత్యా పాతకం పోతుంది.శతం, సహస్రం అనే తీర్ధాలలో తపస్సు చేస్తే అంతులేని పుణ్యం వస్తుంది. రుద్రపత్ని అనే తీర్థంలో స్నానం చేస్తే సర్వ దుఃఖ విముక్తి కలుగు తుంది. స్వస్తి పురం అనే తీర్థం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఏకరాత్రం అనే తీర్థంలో ఉపవాసం చేస్తే స్త్యలోకం సిద్ధిస్తుంది. ఆ దిత్యాశ్రమంలో సూర్యుడిని ఆరాధిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. దధీచి తీర్థంలో మూడురాత్రులు నివసిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. స్యర్యగ్రహణ సమయంలో సన్నిహిత తీర్థంలోస్నానం చేస్తే నూరు అశ్వమేధాలు చేసిన ఫలం పొందుతారు. ధర్మతీర్థంలో స్నానం చేస్తే ధర్మాచరణ కలుగుతుంది. జ్ఞానపావనం, సౌగంధికం అనే తీర్ధాలలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి.సరస్వతీ హ్రదం నుండి వచ్చే జలంలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలం వస్తుంది. శాకంబరీ తీర్థంలో ఒకరోజు శాకాహార తపస్సు చేస్తే పణ్యం లభిస్తుంది. ధూమావతీ, రథావర్తం అనే తీర్ధాలలో స్నానం చేస్తే దు॰ఖం నుండి విముక్తులౌతారు. అందరూ పుణ్య తీర్ధాలలో స్నానం చేయలేరు. నోములు నోచని వారు, చెడ్డవారు, ఉపవాసాలు చేయని వారు, శుచిత్వం లేని వారు తీర్ధయాత్రలు చేయలేరు. కనుక నీవు తీర్ధ యాత్రలకు వెళ్ళి రమ్ము. రోమశుడు అనే మహర్షి నీ దగ్గరకు వచ్చి నిన్ను తీర్ధయాత్రలు చెయ్యమని ఆదేశిస్తాడు. నీవు ధౌమ్యుని అనుమతితో తీర్ధయాత్రలు చేసి రా " అని చెప్పి నారదుడు వెళ్ళాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు